Anam Ramanarayana Reddy : నాలుగేళ్లలో.. ఏం చేశామని ఓట్లడగాలి?

ABN , First Publish Date - 2022-12-29T03:46:41+05:30 IST

జగన్‌ ప్రభుత్వ తీరుపై అధికార పక్ష ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. ‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు.

Anam Ramanarayana Reddy : నాలుగేళ్లలో.. ఏం చేశామని ఓట్లడగాలి?

ఒక్క రోడ్డయినా వేయలేదు

ప్లాట్లు ఇచ్చాం తప్ప.. ఒక్క ఇల్లయినా కట్టామా?

పెన్షన్‌ ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారా?

జగన్‌ సర్కారుపై మాజీ మంత్రి ఆనం ఆగ్రహం

మేం ఎవరి ఇంటికి వెళ్లినా రోడ్డు ఎప్పుడు వేస్తారు.. నీళ్లు ఎప్పుడు ఇస్తారని నిలదీస్తున్నారు. మాపై ప్రజలకు నమ్మకం లేదు.

ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ సొమ్ము.. గుంతల రోడ్లపై ప్రయాణిస్తే ఆస్పత్రి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. మేం గ్రామాలకు వెళ్తే సోది చెప్పేందుకు వచ్చారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

- ఆనం రామనారాయణరెడ్డి

రాపూరు/వెంకటగిరి టౌన్‌, డిసెంబరు 28: జగన్‌ ప్రభుత్వ తీరుపై అధికార పక్ష ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. ‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో బుధవారం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల గ్రామ సచివాలయం కన్వీనర్ల తొలి సమావేశంలో ఆయ న పాల్గొన్నారు. వెంకటగిరిలో కూడా సచివాలయ కన్వీనర్లకు సమన్వయ సమావేశం నిర్వహించారు. పెన్షన్‌ ఇస్తే ఓట్లు వేసేస్తారా.. పథకాలు ఇస్తే ఓట్లు వేసేస్తారా.. పేదలు నాలుగు ముద్దలు నోట్లో వేసుకుంటే తాగేందుకు బిందెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆక్షేపించారు. ‘కేవలం పెన్షన్‌ ఇస్తేనే ఓట్లు వేస్తారా!? అలా అయితే గత టీడీపీ ప్రభుత్వంలో సైతం పెన్షన్లు ఇచ్చారు. అయితే వారి కంటే కొంత ఎక్కువ ఇస్తున్నాం. కేవలం ప్లాట్లు ఇచ్చాం తప్ప ఒక్కటంటే ఒక్క ఇల్లయినా నిర్మించామా’ అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ముందజలో ఉందని.. కానీ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వెనుకంజ వేస్తోందని విమర్శించారు. అభివృద్ధికి ఆమడ దూరం లో పయనిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ.213 కోట్లతో పలు పనులకు శంకుస్థాపన చేసినా నిధులు లేక పూర్తి కాలేదన్నారు.

అంచనాలు సిద్ధం చేసి హైకమాండ్‌కు పంపినా స్పందించలేదని చెప్పారు. అమృత్‌-2 పథకం కింద కేంద్రప్రభుత్వ నిఽధులతో వెంకటగిరిలో రూ.93కోట్లతో మరో సమ్మర్‌ స్టోరేజి ఏర్పాటుకు అనుమతులు అందాయన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా తాగునీటి వసతి లేక వాటిని ప్రారంభించలేదన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడో అక్కడ సర్దుకుంటూ పోతున్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల ముందుకు ఎలా వెళ్లి ఓట్లు అడగాలని నిలదీశారు. కేంద్రం జలజీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు ఇస్తుంటే ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ కలగా పిలుచుకునే సోమశిల, స్వర్ణముఖి కెనాల్‌ను నిజం చేయలేకపోతున్నట్లు చెప్పారు. కనీసం ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు పిలిచినా రాలేదంటూ ముఖ్యమంత్రి జగన్‌పై పరోక్షంగా విమర్శలు సంధించారు. కండలేరు డ్యాం నిర్మాణం కోసం.. పుట్టిన ఊళ్లను వదులుకుని వచ్చినవారికి ఎలాంటి వసతీ కల్పించలేకపోయామన్నారు. కనీసం వాళ్ల దాహార్తి కూడా తీర్చలేకపోయినట్లు చెప్పారు. పరిహారం కోసం ఇప్పటికీ బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగేళ్లు గడిచాయి.. మరో ఏడాది పోరాడండని పార్టీ పెద్దలు చెబుతున్నారని.. పోరాడి పైకెక్కి కూర్చోవాలని తమకూ ఉంటుందని.. కానీ దానికి మార్గమెలాగని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, వైసీపీ నేతలు దొంతు శారద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-29T03:46:52+05:30 IST