Baby sale: శిశువు విక్రయం
ABN , First Publish Date - 2022-10-30T04:23:49+05:30 IST
కన్నబిడ్డను తల్లే విక్రయించిన ఉదంతమిది. జన్మనిచ్చిన కొద్దిరోజులకే మాతృత్వాన్ని మరచిన తల్లి వ్యవహారాన్ని ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు బట్టబయలు చేశారు.
రూ.50 వేలకు అమ్మేసిన తల్లి
అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు దొరికిపోయిన మహిళ
విజయవాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కన్నబిడ్డను తల్లే విక్రయించిన ఉదంతమిది. జన్మనిచ్చిన కొద్దిరోజులకే మాతృత్వాన్ని మరచిన తల్లి వ్యవహారాన్ని ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు బట్టబయలు చేశారు. విజయవాడ భానునగర్‌కు చెందిన కల్యాణి యాచక వృత్తిలో జీవిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకరిని తన వద్ద పెట్టుకుని, మిగిలిన ఇద్దరిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంటున్న బంధువులకు ఇచ్చేసింది. కొద్దినెలల క్రితం కల్యాణి మళ్లీ గర్భం దాల్చింది. ఈ సమయంలో భానునగర్‌లో ఉండే అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి పోషకాహారాన్ని తీసుకునేది. ఈ నెల 23న విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో కల్యాణి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు డిశ్చార్జి చేయకుండా, ఆసుపత్రిలో సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత కొన్ని రోజులకు తెలిసినవారి ద్వారా బేరం కుదుర్చుకుని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ కుటుంబానికి రూ.50 వేలకు శిశువును విక్రయించింది.
శనివారం కల్యాణి కనిపించడంతో అంగన్‌వాడీ కార్యకర్త ఆమెను ఆరా తీసింది. ఎన్నో నెల అడగ్గా పొంతన లేని సమాధానం చెప్పింది. రికార్డులను పరిశీలించగా ఆమెకు ఇప్పటికే డెలివరీ కావాలని అంగన్‌వాడీ కార్యకర్త గుర్తించింది. కల్యాణి సమాధానంతో ఆమెకు అనుమానం వచ్చింది. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్త కలిసి ఆరా తీయగా ఆసుపత్రి నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కల్యాణి వచ్చేసిందని తెలిసింది. పుట్టిన బిడ్డను ఏం చేశావని ప్రశ్నించినా సమాధానమివ్వక పోవడంతో వారు గుణదల పోలీసులకు సమాచారం ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వీఎ్‌సఎన్ వర్మ, గుణదల ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ ఘటనా స్థలానికి వెళ్లి.. ఆమెను విచారించగా బిడ్డను కనిగిరిలోని ఓ కుటుంబానికి రూ.50 వేలకు విక్రయించినట్టుగా అంగీకరించింది. పోషించే స్థోమత లేకపోవడంతో ఈవిధంగా చేశారని ఒప్పుకుంది. దీనిపై గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు.