BC Corporation Posts: పదవుల పేరిట పచ్చి దగా..

ABN , First Publish Date - 2022-12-16T02:34:43+05:30 IST

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించి బడుగులకు గతంలో ఎప్పుడూలేని విఽధంగా మేలుచేశామని జబ్బలు చరుచుకున్నారు.

BC Corporation Posts: పదవుల పేరిట పచ్చి దగా..

బీసీ కులాల కార్పొరేషన్‌ పదవులకు నేటితో చెల్లు

ఏం చేశామో చెప్పుకోలేకుండానే ముగిసిన రెండేళ్లు

పదవుల పేరిట బీసీలతో జగన్‌ సర్కారు ఆటలు

రెండేళ్ల కిందట 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు

నిధులు, విధులు లేకుండానే చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ఒకే అపార్ట్‌మెంట్‌లో అన్ని కార్పొరేషన్ల కార్యాలయాలు

చేసేదేమీ లేక అటువైపు చూడని నేతలు, సందర్శకులు

‘సిద్ధడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు! రానూ వచ్చాడు! కానీ... ఏం లాభం!’... పాపం 56 బీసీ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లదీ ఇదే పరిస్థితి! ‘మా వల్ల మా కులంలో ఇంత మందికి మేలు జరిగింది’ అని చెప్పుకోవడానికి ఒక్క ముక్కా లేకుండానే వారందరి పదవీకాలం ముగిసింది. వీరంతా 2020 డిసెంబరు 17వ తేదీన ఆర్భాటంగా పదవులు స్వీకరించారు. రెండేళ్ల పదవీకాలం నేటితో ముగిసిపోయింది. వెరసి... ఈ కార్పొరేషన్లతో బీసీలకు వచ్చిందేమిటంటే, పదుగురికి పదవులు మాత్రమే! నేటితో ‘మాజీ’లు అవుతున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారా? వారినే మళ్లీ కొనసాగిస్తారా.. అనే అంశంపై స్పష్టత లేదు.

బీసీలకు 56 కార్పొరేషన్లు ప్రకటించి విజయవాడ గొల్లపూడిలోని ఈ అపార్టుమెంటులోసర్దేశారు. చేయడానికి పనుల్లేవు. చెప్పడానికి మనుషుల్లేరు. చైర్మన్లు, డైరెక్టర్లు తమ కార్యాలయాలకు రావడమే మానేశారు. శుక్రవారంతో వారి రెండేళ్ల పదవీకాలం కూడా ముగిసిపోతోంది. ఎవరూ పట్టించుకోక, ఎవరూ రాకపోవడంతో బీసీ కార్పొరేషన్లు కొలువు తీరిన భవనంలో గురువారం గేదెలు సేదతీరుతూ (పై ఫొటో అదే) కనిపించాయి.

‘నవరత్నాలే’ దిక్కు..

బీసీల పథకాలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు, చదువులకు రాయితీలు, వృత్తులకు చేయూత.. ఇలా బీసీల కోసం ఒకప్పుడు ఎన్నెన్నో పథకాలు ఉండేవి. బీసీ కార్పొరేషన్ల కార్యాలయాలు కళకళలాడుతుండేవి. ఇప్పుడు ఆ పథకాలూ లేవు. ఆ కళ కూడా లేదు.

అందరికీ వర్తించే ‘నవరత్నాలే’ బీసీలకూ దిక్కు! దీంతో... తాడేపల్లిలోని బీసీ సంక్షేమ భవనం వైపు కూడా ఎవరూ రావడంలేదు. రావాల్సిన అవసరమూ కనిపించడంలేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించి బడుగులకు గతంలో ఎప్పుడూలేని విఽధంగా మేలుచేశామని జబ్బలు చరుచుకున్నారు. అయితే ఆ చైర్మన్లు, డైరెక్టర్లు ఏమీ చేయకుండానే... ఏం చేశామో చెప్పుకొనే అవకాశమూ లేకుండానే ‘మాజీ’లు అవుతున్నారు. 2020 డిసెంబరు 17వ తేదీన వీరి నియామకం జరిగింది. ఏడాదిపాటు బీసీ చైర్మన్లు, డైరెక్టర్లు కూర్చోడానికి కనీసం కుర్చీలు, విధులు నిర్వహించడానికి కార్యాలయాలు లేవు. ఆ తర్వాత విజయవాడ గొల్లపూడిలో ఒక అపార్ట్‌మెంటును అద్దెకు తీసుకున్నారు. ఆరంతస్థుల ఈ భవనంలో బీసీ కార్పొరేషన్ల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. నిర్వహణ కింద నెలకు రూ.కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. అయినా... కార్యాలయాలు ఎప్పుడూ తాళం కప్పలతో దర్శనమిస్తున్నాయి. ఆర్భాటంగా ప్రకటించిన కార్పొరేషన్లలో చేపట్టడానికి విధులూ, నిర్వహించాల్సిన పథకాలు ఏవీ లేకపోవడమే దీనికి కారణం. బీసీలకు ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేసింది. ‘నవరత్నాలు’ అందుకున్న వారిని కులాల వారీగా విభజించి... ఆ కులం కార్పొరేషన్‌ ద్వారా లబ్ధి జరిగిందంటూ మాయ చేస్తోంది. అయితే... కనీసం సంబంధిత కార్యకలాపాలు కూడా కార్పొరేషన్‌ కార్యాలయాల నుంచి సాగడంలేదు. వాటిలో ఒక్క రికార్డూ లేదు. కంప్యూటర్లు గానీ, ఉద్యోగులుగానీ లేరు. ఏ చైర్మన్‌ కూడా ప్రతిరోజూ వచ్చి విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ఎవరైనా సమాచారం కావాలన్నా... తాడిగడపలోని బీసీ కార్పొరేషన్‌లో కలవాలని అక్కడ ఉన్న అటెండర్లు సూచిస్తున్నారు.

పదవుల పేరిట పచ్చి దగా..

గతంలో కార్పొరేషన్‌ చైర్మన్‌కు సహాయమంత్రి హోదా ఉండేది. 2 లక్షలకుపైగా అలవెన్సులు ఇచ్చేవారు. నామినేటెడ్‌ పోస్టు అయినా క్రేజ్‌ ఉండేది. వైసీపీ ప్రభుత్వం భారీగా కార్పొరేషన్లు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. అదే సమయంలో అలవెన్సులను కత్తిరించింది. చైర్మన్‌ పోస్టులకు ఇప్పుడు రూ.56 వేలు నుంచి రూ.65 వేలు ఇస్తున్నారు. గతానికి భిన్నంగా కార్పొరేషన్లను సొసైటీస్‌ రిజిస్టర్‌ యాక్టు కిందకు తెచ్చారు. నిజానికి, ఒక్కపైసా కూడా నిధులివ్వకుండా ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు ఇవి. కానీ, వీటి ఏర్పాటుపై పలు జిల్లాల్లో అప్పట్లో మంత్రులు ఆర్భాటం చేశారు. చైర్మన్లకు సన్మానాలు చేశారు. అంతకుమించి జరిగిందేమీ లేదు.

‘నవరత్నాల’ ప్రచారానికే పదవులా?

కార్పొరేషన్‌కు చైర్మన్‌, డైరెక్టర్లు ఉంటే చాలదు. వాటిని నిర్వహించేందుకు ఎండీ, కార్యాలయ సిబ్బంది ఉండాలి. కార్పొరేషన్‌ స్థాయిని బట్టి గ్రూప్‌-1 అధికారులను ఎండీగా నియమించాలి. అయితే మొక్కుబడిగా పదేసి కార్పొరేషన్లకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. బీసీ కార్పొరేషన్‌ అధికారులు కూడా నిధులు బదిలీ చేసేవారిగానే మిగిలిపోతున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో లబ్ధి మొత్తాన్ని జమచేయడమే వారి బాధ్యతగా మారింది. కార్పొరేషన్లకు నిధుల్లేకపోవడంతో ఏ సంక్షేమ కార్యక్రమాన్నీ సొంతగా అమలు చేసే పరిస్థితి లేదు.

Updated Date - 2022-12-16T07:32:13+05:30 IST