Amaravati padayatra : మాది దగాపడిన రైతుల యాత్ర!
ABN , First Publish Date - 2022-10-28T03:14:46+05:30 IST
అమరావతి రైతులది ఉత్తరాంధ్రపై దండయాత్రా?‘పాదయాత్ర 2.0’కు ఎందుకు విరామం ప్రకటించాల్సి వచ్చింది? గమ్యస్థానాన్ని చేరడంలో వీరికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి?

ఉత్తరాంధ్రపై దండయాత్ర కానే కాదు
మా ఆవేదన చెప్పుకొనేందుకే పాదయాత్ర
గుర్తింపు కార్డులు ఇచ్చింది 182 మందికే
అందరూ చూపించాలంటే ఎలా సాధ్యం?
తిట్టినా, రెచ్చగొట్టినా తలవంచుకుని నడిచాం
రాజమండ్రిలో ఎంపీయే దాడి చేయించారు
పాదయాత్రకు విరామం తాత్కాలికమే
మళ్లీ అక్కడి నుంచే కదులుతాం
పాతికవేల మంది రైతులు భూములిచ్చారు
ఇంటికొకరిని అనుమతించాలని అడుగుతాం
రాజధాని దళిత, బీసీ రైతుల ఉద్ఘాటన
మేం ఎక్కడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. బూతులు తిడుతున్నా తలవంచుకొని ముందుకుసాగాం. రాజమండ్రిలో వైసీపీ నేతలు మాపై ప్రత్యక్ష దాడికి దిగారు.
- అంకం సువర్ణ కమల, ఎస్సీ రైతు,
మందడం. ఎకరన్నర భూమి ఇచ్చారు.
అన్ని ఆధారాలతో యాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తాం.
- జొన్నకూటి ఏడుకొండలు,
దళిత రైతు, తుళ్లూరు. 72 సెంట్లు ఇచ్చారు.
అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఇతర ప్రాంతాలపై దండయాత్ర కాదు. దగాపడ్డ రైతులుగా మా గోడును రాష్ట్ర ప్రజలందరికీ వెళ్లబోసుకొనేందుకు చేస్తున్న యాత్ర ఇది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు.
- ఇందుర్తి నరసింహారావు, బీసీ రైతు, తుళ్లూరు.
రాజధానికి 3 ఎకరాలు ఇచ్చారు.
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
అమరావతి రైతులది ఉత్తరాంధ్రపై దండయాత్రా?‘పాదయాత్ర 2.0’కు ఎందుకు విరామం ప్రకటించాల్సి వచ్చింది? గమ్యస్థానాన్ని చేరడంలో వీరికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అమరావతి నినాదాన్ని, అవసరాన్ని ఇప్పటికే తిరుపతిదాకా చాటిన వీరు... అరసవిల్లికి చేరుకోగలరా? తదుపరి కార్యాచరణ ఏమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు! దీనికి సమాధానాలు తెలుసుకునేందుకు రాజధాని ప్రాంతానికి చెందిన, అమరావతి కోసం ఆది నుంచీ పోరాడుతున్న, తాజా పాదయాత్రలో 40 రోజులు పాల్గొన్న ముగ్గురు రైతులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. వీరు ముగ్గురూ చిన్నకారు రైతులు. రాజధాని కోసం 70 సెంట్ల నుంచి మూడెకరాల వరకు ఇచ్చిన సామాన్యులు. ‘మాది ఉత్తరాంధ్రపైనో, రాయలసీమపైనో దండయాత్ర కాదు. దగాపడ్డ రాజధాని రైతుల యాత్ర’ అని తెలిపారు. రాజధాని, వైసీపీ నేతల ఆరోపణలు, పాదయాత్ర ప్రస్థానంపై ఇదీ వారి స్పందన...
కార్డులు ఇచ్చింది కొందరికే!
- జొన్నకూటి ఏడుకొండలు, దళిత రైతు, తుళ్లూరు.
రాజధానికి 72 సెంట్లు ఇచ్చారు.
40 రోజులు ఐడీ కార్డులు అడగలేదు...
అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0లో పాల్గొనేందుకు హైకోర్టు 600 మందికి అనుమతించింది. పోలీసులు మూడు విడతల్లో 182 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు. పాదయాత్ర జరిగిన 40 రోజుల్లో ఎక్కడా గుర్తింపు కార్డుల గురించి పోలీసులు పట్టించుకోలేదు. రాజమహేంద్రవరం చేరిన తర్వాతే వాటి గురించి అడిగారు. ఐడీ కార్డులు బ్యాగుల్లో పెట్టి లగేజ్ వ్యాన్‌లో వేశాం. సాయంత్రం లేదా ఉదయాన్నే చూపిస్తామన్నా ఒప్పుకోలేదు.
అక్కడి నుంచే మళ్లీ మొదలుపెడతాం...
పాదయాత్ర శాశ్వతంగా ఆగిపోయిందని వైసీపీ వాళ్లు భ్రమలో ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఇంటికో మనిషిని పాదయాత్రకు అనుమతించాలని హైకోర్టును కోరుతాం. అన్ని రకాల ఆధారాలతో కొద్ది రోజుల్లోనే మహాపాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తాం.
రాజమహేంద్రవరంలో ఉద్రిక్తతలకు కారణం...
పాదయాత్ర మార్గమధ్యలో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రశాంతంగా ముందుకు కదిలాం. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్, ఆయన అనుచరులు పాదయాత్రలోని మహిళలపైకి వాటర్, కిరోసిన్ బాటిల్స్, చెప్పులు విసిరేయించారు. దాంతో కొంతమందికి గాయాలయ్యాయి. సూర్య భగవానుడి రథంపై కూడా చెప్పులు పడ్డాయి.
మాది దండయాత్ర కాదు...
పాదయాత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర కానే కాదు. మా బాధలు అన్ని ప్రాంతాల వారికీ తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. మాకున్న భూమిలో రాజధాని కోసం ఎకరమో, అర ఎకరమో తీసుకోలేదు. భూమి మొత్తాన్ని తీసుకున్నారు. అక్కడ రాజధాని లేకపోతే మా జీవితాలు అంధకారమే.
వేలమంది చిన్నకారు రైతులే...
రాజధానిలో కొంతమంది రైతుల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు కార్లు కొంటే కొని ఉండొచ్చు. కానీ... మాలాంటి సన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా మంత్రులు అమరావతి రైతులది ఒళ్లు బలిసి చేస్తున్న పాదయాత్ర అని మాట్లాడుతున్నారు.
వీళ్లది పదవులకోసం ఆరాటం...
విశాఖ రాజధాని కాకుంటే తమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు. కానీ... గుంటూరు, కృష్నా జిల్లాల్లో వైసీపీ నేతలు పదవుల కోసం కక్కుర్తి పడుతూ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు.
మోదీయే కట్టడి చేయాలి...
అమరావతి రాజధానికి ప్రధాని మోదీయే శంకుస్థాపన చేశారు. ఈ విషయంలో ఆయనకు కూడా బాధ్యత ఉంది. తప్పులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన కట్టడి చేయాలి. రాజధాని నిర్మాణం జరిగేలా చూడటంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. అమరావతి రాజధానిగా ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది.
మాది ఆవేదన యాత్ర
- ఇందుర్తి నరసింహారావు, బీసీ రైతు, తుళ్లూరు.
రాజధానికి 3 ఎకరాలు ఇచ్చారు.
మా గోడు చెప్పుకొనేందుకే...
అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఇతర ప్రాంతాలపై దండయాత్ర కాదు. దగాపడ్డ రైతులుగా తమ గోడుని రాష్ట్ర ప్రజలందరికి వెళ్లబోసుకొనేందుకు చేస్తున్న యాత్ర ఇది. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. గతంలో తిరుపతి దాకా పాదయాత్ర చేసినప్పుడు... ప్రకాశం జిల్లా ఇంకొల్లులో మాత్రమే ఇబ్బంది పెట్టారు. ఈసారి అడుగడుగునా ఆటంకాలు కలిగించారు. తెనాలిలో ఎమ్మెల్యే ఇల్లు ఉందని బలవంతంగా దారి మళ్లించారు. ఆ తర్వాత వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ మోపిదేవి అనుచరులు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘ఎగరేసి తల నరుకుతాం’ అని గుడివాడలో ఫ్లెక్సీలు పెట్టారు. అయినప్పటికీ తలవంచుకొనే నడిచాం. పాదయాత్ర గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించేసరికే జనాదరణ బాగా పెరిగింది. దీంతో... ప్రభుత్వం ఓర్వలేక రెచ్చగొట్టే చర్యలకు దిగింది. రాజమండ్రిలో తొలుత మేమే బాటిల్స్ విసిరామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ భరత్ స్వయంగా అక్కడ ఉండి మాపైకి బాటిల్స్, చెప్పులు, ఉల్లిపాయలు, టమాటాలు వేయుంచారు.
ఎన్నికలకు ముందు జగన్ రాష్ట్రమంతటా పాదయాత్ర చే శారు. అప్పుడు ఎలాంటి ఆం క్షలు లేవు. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పోలీసులూ సహకరించారు. ఇప్పుడు మాత్రం రైతులు చేస్తున్న పాదయాత్రకు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. రెచ్చగొడుతున్న వారికే కొమ్ము కాస్తున్నారు.
అమరావతి అందరిదీ...
పాదయాత్రను ప్రపంచమంతా చూసింది. రైతులు, కార్మికులు మాకు సంఘీభావం తెలియజేశారు. ఈ రాక్షసపాలన ఇంకెన్నాళ్లని ఆక్రోశించారు. రాయలసీమ ప్రజలను కూడా రెచ్చగొట్టే యత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అందరిదీ. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని ఉండాలి. వికేంద్రీకరణ అభివృద్ధిలో జరగాలి. జగన్ విభజించు పాలించు అన్న ధోరణిలో 3 ప్రాంతాల మఽధ్య చిచ్చు పెడుతున్నారు. ఒకవైపు అమరావతి ‘శాసన రాజధాని’ అంటూనే వైసీపీ వర్గీయులు రాజధానిలో రోడ్లు తవ్వేస్తున్నారు. ఎంఎస్, హెచ్‌డీపీఈ పైపులు ఎత్తుకెళుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే... మమ్మల్నే సాయంత్రం వరకు స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారు.
‘ప్రాజెక్టు’ రైతులతో పోలికెలా?
- అంకం సువర్ణ కమల, ఎస్సీ రైతు, మందడం.
రాజధానికి ఎకరన్నర భూమి ఇచ్చారు.
ఇంటికొకరిని అనుమతించాలి...
రాజధాని కోసం పాతిక వేల మంది రైతులు భూములు ఇచ్చారు. ఇంటికొకరు పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి. కొద్దిమందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చి యాత్రలో ఉన్న అందరినీ కార్డులు చూపించమన్నారు. దాంతోనే పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించాం. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్ర పునఃప్రారంభిస్తాం. పాదయాత్రలో చోటు చేసుకున్న సంఘటనలను జేఏసీ నాయకులు హైకోర్టు దృష్టికి తీసుకెళుతున్నారు.
తిడుతున్నా తల వంచుకునే...
మేం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. బూతులు తిడుతున్నా తలవంచుకొని ముందుకుసాగాం. రాజమండ్రిలో వైసీపీ నేతలు ప్రత్యక్ష దాడికి దిగారు. పాదయాత్ర శాశ్వతంగా నిలిచిపోయిందనేది వారి భ్రమ మాత్రమే. కొద్ది రోజుల్లోనే తిరిగి ప్రారంభించి సూర్యభగవానుడిని దర్శించుకుంటాం.
ఉన్నదంతా ఇచ్చేశాం...
శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులదే అసలైన త్యాగమని... మాది కాదని మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవానికి ఆయా ప్రాజెక్టులకు రైతులు వారికున్న భూమిలో కొంత ఇచ్చారు. దీనికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. వారి త్యాగాన్ని మేమేం తక్కువ చేయడంలేదు. కానీ... అమరావతి విషయంలో అలా జరగలేదు. రైతుల భూమి మొత్తం తీసుకొన్నారు. జీవనోపాధి అనేది లేకుండా పోయింది.
పేదలకు న్యాయం ఇలాగేనా?
రాజధానిలో 5 శాతం భూమిని పేదలకు ప్రత్యేకంగా కేటాయించారు. ప్రతీ గ్రామంలో టిడ్కో ఇళ్లు నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఒక్క టిడ్కో ఇంటిని కూడా పేదలకు అప్పగించలేదు. రాజధానిలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఇక్కడి పేదలకు న్యాయం జరిగిన తర్వాత, బయటి నుంచి వచ్చే వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎవరూ వ్యతిరేకించరు. అలా కాకుండా రాజకీయ స్వలాభం కోసం వేరే ప్రాంతాల్లోని పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప... రాజధానిని మూడు ముక్కలు చేయరాదు.