kambhampati ramamohan rao: దేశం గర్వించే గొప్ప నాయకుడిని కోల్పోయాం
ABN , First Publish Date - 2022-10-10T18:20:28+05:30 IST
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ (Mulayam singh yadav) మృతి పట్ల మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్ రావు (kambhampati ramamohan rao) సంతాపం వ్యక్తం చేశారు. దేశం గర్వించే గొప్ప నాయకుడిని కోల్పోయామని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అల్పసంఖ్యాక వర్గాల ఆరాధ్యుడు ములాయం అని అన్నారు. సోషలిస్ట్‌గా, లౌకిక వాదిగా నమ్మిన ఆదర్శాల కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేశారన్నారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం పరితపించేవారని.. ఎన్టీఆర్ (NTR), చంద్రబాబుల (Chandrababu)తో కలిసి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యూఎన్ పిఏ ఏర్పాటు ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. మూడు ఫ్రంట్‌లలో ముఖ్యపాత్ర ములాయందే అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా ములాయం సింగ్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన మృతి ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాదు, యావత్ భారతదేశానికే తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని కంభంపాటి రామమోహన్ రావు అన్నారు.