Jagan: రండి..రండి..దయ చేయండి.. జగన్ సభకు 60 వేల కుటుంబాలకు ఆహ్వాన పత్రాలు

ABN , First Publish Date - 2022-11-19T19:16:37+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) ఈనెల 21వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narsapur)లో జరిపే పర్యటనను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Jagan: రండి..రండి..దయ చేయండి.. జగన్ సభకు 60 వేల కుటుంబాలకు ఆహ్వాన పత్రాలు
jagan

నరసాపురం: సీఎం జగన్ (CM Jagan) ఈనెల 21వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narsapur)లో జరిపే పర్యటనను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు ఇంటింటికీ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 60 వేల కుటుంబాలకు వలంటర్లు, పార్టీ వార్డు, గ్రామ కమిటీలతో పంపిణీ చేస్తున్నారు. ముఖ్య నేతలు కూడా కొన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రాలను అందించారు. నియోజకవర్గంలో గడిచిన మూడేళ్లల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా 21న చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఆహ్వాన పత్రాల్లో వివరించారు.

ఇప్పటికే పట్టణం, మండలంలోని చాల గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం సభకు ఆహ్వానాలు అందించడంపై ఆసక్తికరమైన చర్చ నెలకొంది. ఇటు ప్రజలు కూడా దీనిపై భిన్నంగా చర్చించుకోవడం గమనార్హం. వీవర్స్‌ కాలనీలో జరిగే సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే బాధ్యతను వలంటీర్లు (Volunteers), డ్వాక్రా సంఘాలు, వెలుగు సిబ్బంది, ఇటు పార్టీ నేతలపై పెట్టారు. వార్డులు, గ్రామాల వారీగా టార్గెట్‌లు ఇచ్చారు. వీరందరిని స్కూల్‌ బస్సుల్లో వేదిక వద్దకు తీసుకొచ్చే బాధ్యతనూ వీరిపైనే ఉంచారు.

పచ్చని చెట్లు తొలగింపు

మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. సీఎం కాన్వాయ్‌ (CM Convoy)లోని బస్సుకు అడ్డువస్తాయన్న సాకుతో ట్యాక్సీస్టాండ్‌, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద 20 అడుగుల ఎత్తున్న ఉన్న భారీ చెట్ల కొమ్మలను శనివారం నరికివేశారు. ఇప్పటికే మిషన్‌ హైస్కూల్‌లో డివైడర్‌కు మధ్యలో ఉన్న చాలా చెట్లను తొలగించి కొత్త మొక్కలు వేశారు. ఇది చూసేందుకు కొద్దిగా సుందరంగా ఉన్నా నీడనిస్తున్న పెద్ద చెట్లను కొట్టేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Updated Date - 2022-11-19T19:16:38+05:30 IST