Jagan: జగన్ కడప పర్యటన.. ట్రయల్‌ రన్‌తో జనం బేజార్‌

ABN , First Publish Date - 2022-12-22T20:45:37+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Jagan) జిల్లా పర్యటన అంటే చాలు.. జనానికి గుండె జారినంత పనవుతోంది. సీఎం టూర్‌కు రెండురోజుల ముందే భద్రత పేరుతో పోలీసులు..

Jagan: జగన్ కడప పర్యటన.. ట్రయల్‌ రన్‌తో జనం బేజార్‌

కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Jagan) జిల్లా పర్యటన అంటే చాలు.. జనానికి గుండె జారినంత పనవుతోంది. సీఎం టూర్‌కు రెండురోజుల ముందే భద్రత పేరుతో పోలీసులు చేసే హడావిడితో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సీఎం పర్యటించే ప్రాంతాల్లో దుకాణాలు బంద్‌ చేస్తున్నారు. జగన్‌ శుక్రవారం కడప పర్యటనకు వస్తున్నారు. దీంతో పోలీసులు సీఎం టూరుకు ముందుస్తుగా గురువారం వేసిన ట్రయల్‌ రన్‌ జనాలకు చుక్కలు చూపించింది. సుమారు గంటన్నర పాటు వాహనదారుల అవస్థలు అంతా ఇంతా కాదు. జన్మనిచ్చిన జిల్లాకు వస్తున్న జగన్‌ పర్యటనకు ఇంత హడావిడి ఎందుకు, జనాలను ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన కోసం పోలీసులు గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ జనాలకు చుక్కలు చూపించింది.

కడప (Kadapa) ఎయిర్‌పోర్టు నుంచి ఇర్కాన్‌ సర్కిల్‌, ఆలంఖాన్‌పల్లె మీదుగా వినాయకనగర్‌ మీదుగా అమీన్‌పీర్‌ దర్గా వరకు చేరింది. అక్కడి నుంచి తిరిగి వినాయకనగర్‌ సర్కిల్‌ మీదుగా బిల్టప్‌, ఐటీఐ, సంధ్యా సర్కిల్‌, కోటిరెడ్డిసర్కిల్‌ మీదుగా అంబేడ్కర్‌సర్కిల్‌ నుంచి సింహపురికాలనీలో ఉన్న పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి, పటేల్‌ రోడ్డులో ఉన్న ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి ఇంటి వరకు పోలీసులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇది సుమారు 1.30 నుంచి రెండుగంటల పాటు జరిగింది. మధ్యాహ్నం ట్రయల్‌ రన్‌ నిర్వహించడంతో ఆఫీసు నుంచి భోజనానికి ఇంటికి వెళ్లేవారు, స్కూలులో విద్యార్థులకు క్యారియర్‌ ఇచ్చేందుకు వెళ్లే తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. ట్రయల్‌ నిర్వహించిన ఐటీఐ, సంధ్యాసర్కిల్‌, కోటిరెడ్డిసర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ ఇలా ప్రతి చోటా వాహనాలు సుమారు గంటన్నరపాటు నిలిపేశారు. దీంతో జనం అవస్థలు పడ్డారు. పోలీసు ట్రయల్‌ రన్‌లో వారి వాహనాల హారన్‌ల శబ్దం విని కంగారుతో ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ యువతి కిందపడ్డారు.

Updated Date - 2022-12-22T20:45:38+05:30 IST