Sharannavaratri celebrations: గాయత్రిదేవి అలంకరణలో కనకదుర్గమ్మ
ABN , First Publish Date - 2022-09-28T13:45:29+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు(Devi sharannavaratri celebrations) వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు గాయత్రిదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రిదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తోంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆది శంకరులు గాయత్రిదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది.
గాయత్రిమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపుగారెలు నివేదన చేస్తారు. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి, గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలి.