Kothapalli Geetha: కొత్తపల్లి గీతకు హైకోర్టు బెయిల్

ABN , First Publish Date - 2022-09-16T22:29:44+05:30 IST

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత (Kothapalli Geetha)కు హైకోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. గీత భర్త రామకోటేశ్వరరావుకు కూడా బెయిల్ ఇచ్చారు.

Kothapalli Geetha: కొత్తపల్లి గీతకు హైకోర్టు బెయిల్

హైదరాబాద్: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత (Kothapalli Geetha)కు హైకోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. గీత భర్త రామకోటేశ్వరరావుకు కూడా బెయిల్ ఇచ్చారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని  గీతకు హైకోర్టు (High Court) ఆదేశించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ (CBI) కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశం, కేకే అరవిందాక్షన్‌కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష, నిందితుల జాబితాలో ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.


కొత్తపల్లి గీత, రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న ఆ విశ్వేశ్వర ఇన్‌ఫ్రా కంపెనీ 2008లో హైదరాబాద్‌ (Hyderabad) బంజారాహిల్స్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (Punjab National Bank) నుంచి రూ.42 కోట్ల రుణం పొందారు. తప్పుడు పత్రాలు సమర్పించడంతోపాటు కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారని అభియోగం నమోదైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 2015లో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. సదరు రుణం ద్వారా పొందిన డబ్బును సొంత అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసుపై విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా వీరిని దోషులుగా గుర్తించి జైలుశిక్ష, జరిమానా విధించింది. తీర్పు వెలుపడినప్పటికీ అనారోగ్యం కారణంగా కొత్తపల్లి గీతకు పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించి.. జైలుకు తీసుకెళ్లారు. రామకోటేశ్వరరావును, ఇద్దరు మాజీ బ్యాంకు అధికారులను కూడా బుధవారం రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 


గీత ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆమె.. ఇరవై ఏళ్ల వయస్సులోనే ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. గోదావరి గ్రామీణ బ్యాంకులో రెండేళ్లు పనిచేశారు. తర్వాత గ్రూపు-1 పరీక్ష రాసి 1999లో డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. సబ్‌ కలెక్టర్‌గా, ఆర్‌డీవోగా, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా వివిధ హోదాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగంలోకి వెళ్లారు. అనంతరం 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు (ఎస్‌టీ) నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొద్దికాలానికే ఆ పార్టీ అధిష్ఠానంతో విభేదాలు వచ్చాయి. దాంతో ఆమె ఎంపీగా ఉంటూనే 2018లో ‘జనజాగృతి’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అనంతరం 2019 జూన్‌లో బీజేపీలో చేరారు. ఆమె ఎస్టీ కాదని, అరకు ఎంపీగా ఆమె ఎన్నిక చెల్లదని ఫిర్యాదులు రాగా దానిపై ఒక కమిటీ వేశారు. బ్యాంకుకు మోసంపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను గీత ఖండించారు.

Updated Date - 2022-09-16T22:29:44+05:30 IST