ఎన్టీటీపీఎస్‌ కాంట్రాక్టు కంపెనీ సిబ్బందిపై దాడి

ABN , First Publish Date - 2022-10-23T00:59:29+05:30 IST

కాంట్రాక్ట్ దక్కలేదని...

ఎన్టీటీపీఎస్‌ కాంట్రాక్టు కంపెనీ  సిబ్బందిపై దాడి
పోలీసుల స్వాధీనంలో బోలేరో వాహనం

బోలేరో వాహనం, మెటీరియల్‌ అపహరణ

స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు దుర్గాప్రసాద్‌ హస్తం

కాంట్రాక్టు దక్కలేదనే ఆక్రోశంతోనే..

భయంతో పారిపోయిన కంపెనీ సిబ్బంది

పోలీసులకు ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 22 : ఎన్టీటీపీఎస్‌లో పలు మరమ్మతు పనులు చేపట్టిన బిశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ సిబ్బంది వాహనంపై శనివారం దాడి జరిగింది. అంతేకాదు.. సిబ్బంది వచ్చిన వాహనాన్ని, అందులోని మెటీరియల్‌ను దుండగులు అపహరించుకుపోయారు. మైలవరం ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, ఎన్టీటీపీఎస్‌లో కాంట్రాక్టర్‌ అయిన పాలడుగు దుర్గాప్రసాద్‌, అతని అనుచరులు ఈ దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. వాహనంపై దాడి జరుగుతుండటాన్ని గమనించిన సిబ్బంది తప్పించుకుని పరారై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

కాంట్రాక్టు దక్కలేదనే అక్కసుతో..

ఎన్టీటీపీఎస్‌ స్టేజీ-3 వార్షిక మరమ్మతులు చేసేందుకు బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ కాంట్రాక్టు పనులు చేస్తోంది. ఇందులో భాగంగానే జనరేటర్‌ మరమ్మతు కాంట్రాక్టు పనులు చత్తీస్‌ఘడ్‌కు చెందిన బిశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ చేపట్టింది. దీనికి సంబంధించిన మెటీరియల్‌, బిహార్‌కు చెందిన కాంట్రాక్టు కార్మికులతో బోలేరో వాహనం శనివారం ఎన్టీటీపీఎస్‌ మెయిన్‌ గేట్‌కు చేరుకుంది. అయితే, గతంలో ఎన్టీటీపీఎస్‌ ఐదో దశలో జరిగిన కాంట్రాక్టు పనులను పాలడుగు దుర్గాప్రసాద్‌ చేపట్టారు. కానీ, పనిలో నాణ్యత లేకపోవడం వల్ల 60 రోజులకే మరమ్మతులకు గురయ్యాయి. దీంతో బీహెచ్‌ఈఎల్‌ ఈసారి కాంట్రాక్టును బిశ్వాస్‌ కంపెనీకి అప్పగించింది. దీనిని మనసులో పెట్టుకున్న దుర్గాప్రసాద్‌ సదరు కంపెనీని బెదిరించి వెళ్లగొడితే, తిరిగి పనులు చేపట్టొచ్చని ప్రణాళిక వేశాడు. బిశ్వాస్‌ కంపెనీ వాహనం వచ్చే సమయానికి పక్కా ప్రణాళికతో దాడి చేశాడు. సిబ్బందిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించడంతో పరారయ్యారు. కాగా, ఫిర్యాదులో ఎమ్మెల్యే అనుచరుడి పేరు లేకుండా పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి.

డ్రైవర్‌ ఫిర్యాదు

సీజీ 19 బీవీ 8359 నెంబరు కలిగిన బోలేరో వాహనాన్ని మెటీరియల్‌ సహా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని డ్రైవర్‌ రాకేష్‌ మండల్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు బైకులపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని తీసుకెళ్లారని పేర్కొన్నాడు. తనతో పాటు కాంట్రాక్టు కార్మికులు రంజిత్‌ బిశ్వాస్‌, నివాస్‌ హర్దార్‌ ఉన్నట్లు తెలిపాడు. అయితే, రాకేష్‌ మండల్‌ విలేకరులతో మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి తమపై దాడిచేసి డాక్యుమెంట్లు, వాహనాన్ని తీసుకెళ్లాడని చెప్పారు. దీనిపై సీఐ పి.శ్రీను మాట్లాడుతూ అపహరించుకుపోయిన బోలేరో వాహనాన్ని స్థానిక కొత్తగేటు వద్ద స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

గతంలోనూ ఇంతే..

పాలడుగు దుర్గాప్రసాద్‌ పలుసార్లు టీడీపీ నేతలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నారు. మంత్రి జోగి రమేశ్‌తో కలిసి కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిలో కీలకపాత్ర పోషించాడు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టు అక్రమ గ్రావెల్‌పై పరిశీలించి వస్తుండగా, జి.కొండూరు వద్ద జరిగిన దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే, స్థానిక స్టేషన్‌లో ఒక క్వారీ యజమానికి, వ్యాపార సంస్థకు మధ్య జరిగిన ఒప్పందంలో కూడా పోలీసులతో కలిసి సెటిల్‌మెంట్‌ చేసినట్లు వార్తలొచ్చాయి.

Updated Date - 2022-10-23T01:14:44+05:30 IST