అల్లాడిన కుప్పం
ABN , First Publish Date - 2022-09-24T09:08:32+05:30 IST
అల్లాడిన కుప్పం

ముఖ్యమంత్రి సభ.. 3 గంటల నరకం
ఇళ్లముందు బారికేడ్లు...షాపులు మూత
కిలోమీటర్ల దూరం కదలని వాహనాలు
బయటి ప్రాంతాలనుంచి సమీకరణ
దీంతో కుప్పానికి హామీలపై స్పందన కరువు
సీఎం సభను ‘మమ’ అనిపించిన వైసీపీ నేతలు
తిరుపతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వైసీపీ నాయకులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం ఉదయం నుంచే కుప్పంలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. బారికేడ్లు కట్టేసి జనాన్ని కదలకుండా నిర్బంధించారు. దాదాపు వెయ్యి దుకాణాలు మూసేయించారు. ముఖ్యమంత్రి వచ్చి, తిరిగి వెళ్లే దాకా కుప్పం ప్రజలు బిగబట్టుకుని ఉండాల్సి వచ్చింది. అటూఇటూ కదలడానికి కూడా వీలు లేకుండా దాదాపు మూడు గంటలపాటూ నరకం అనుభవించారు. ఇంతా చేసి కుప్పం బయటి ప్రాంతాల ప్రజలతోనే సభాస్థలిని నింపారు. బెదిరించి, భయపెట్టి తీసుకువచ్చిన వారికి సరైన వసతులు కూడా కల్పించకపోవడంతో వారు శాపనార్థాలు పెట్టారు. సీఎం సహా ముఖ్యుల ప్రసంగాలకూ ప్రజల నుంచి సరైన స్పందన కూడా రాకపోవడం విశేషం. సీఎం జగన్ సుదీర్ఘ ప్రసంగంలో కుప్పం నియోజకవర్గానికి ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనుల చిట్టా వివరించారు. కొత్తగా పలు వరాలూ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.వంద కోట్ల నిధుల మంజూరు, ఆరు నెలల్లో హంద్రీ-నీవా పూర్తి, పాతిక కోట్లతో రెండు రిజర్వాయర్ల నిర్మాణం వంటి హామీలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో భరత్‌ను గెలిపిస్తే మంత్రిగా చేస్తానని వాగ్ధానం చేశారు. అయితే వీటిల్లో దేనికీ జనం నుంచీ కనీసం స్పందన కరువైంది. కుప్పం తనకు పులివెందులతో సమానమని చెబుతూ ‘నేను మీ బిడ్డ’నంటూ పదేపదే సీఎం జగన్ సెంటిమెంట్ ప్రయోగించినా సభికుల నుంచి ప్రతిస్పందన కనిపించలేదు. సభకు వచ్చిన వారిలో కుప్పం ప్రాంతీయులు అత్యల్పంగా వుండడం, వారిని కూడా బలవంతంగా రప్పించడమే ఈ స్పందనా రాహిత్యానికి కారణమని తెలుస్తోంది.
వెయ్యికిపైగా బస్సుల్లో తరలింపు..
చంద్రబాబు కంచుకోటలో జరుగుతున్న సీఎం బహిరంగ సభకు ఆశించినంతగా జనం రాకపోతే దెబ్బతింటామనే ఆందోళనతో వైసీపీ భారీఎత్తున జనసమీకరణకు పూనుకుంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి భారీగా ప్రజలను తరలించారు. ఆర్టీసీ, విద్యా సంస్థల, ప్రైవేటు ట్రావెల్స్ నుంచి వెయ్యికిపైగా బస్సులను స్వాధీనం చేసుకుని జనాన్ని తరలించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలనుంచి బెదిరింపులు, హెచ్చరికలతో జనాన్ని తరలించారు. ప్రతి వలంటీరుకూ పాతిక నుంచి ముప్పై మందిని సభకు తీసుకురావాలని టార్గెట్ విధించారు. అంతకంటే ఎక్కువమందిని తీసుకొచ్చిన వారికి నగదు రివార్డు ప్రకటించారు. సభకు హాజరుకాకుంటే రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ జరిమానా విధిస్తామని, తదుపరి వచ్చే రుణాల్లో ఆ మొత్తాలను కట్ చేస్తామంటూ లబ్ధిదారులను వలంటీర్లు బెదరగొట్టారు. దీంతో అయిష్టంగా, బలవంతంగా కొంతమేరకు జనం సభకు హాజరయ్యారు.
మగవారికి నగదు, మద్యం పంపిణీ
బహిరంగసభకు హాజరైన మహిళలకు రవాణా సదుపాయం, భోజనాలు సమకూర్చగా మగవారికి రవాణా సదుపాయంతో పాటు నాన్ వెజ్ భోజనం, రూ. 250 నుంచి రూ.300 వరకూ నగదు, మద్యం బాటిల్ అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలకు కూడా నగదు పంపిణీ జరిగినట్టు సమాచారం.
కుప్పంలో రోడ్లంతా బారికేడ్లు.
కుప్పం పట్టణంలో సీఎం హెలిపాడ్ నుంచి బహిరంగసభ ప్రాంగణం వరకూ సుమారు మూడు కిలోమీటర్ల మేర వీధుల్లోని రోడ్లంతా తవ్వేశారు. రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురవుతాయన్న అనుమానం ఉన్న చోట్ల రెండంచెలు, మూడంచెల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వీటికోసం గుంతలు తవ్వడంతో రోడ్లన్నీ పాడైపోయాయి. ఇళ్ళకు, రోడ్డుకు అడ్డుగా బ్యారికేడ్లు కట్టేయడంతో జనం ఇళ్ల నుంచీ రోడ్లపైకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు కూడా ఇళ్ళ నుంచీ బయటికి తీయలేని దుస్థితి. కనీసం కాలినడకనైనా బయట వెళ్ళి పనులు చూసుకొద్దామంటే ఇళ్ళ నుంచీ బయట అడుగుపెట్టనివ్వకుండా వలంటీర్లు, పోలీసులు కాపలా కాశారు. ఈ మార్గంలోని దుకాణాలన్నీ పోలీసులు మూసివేయించారు.
ఎరక్కపోయి వచ్చామంటూ...
సభకు బయటి ప్రాంతాల నుంచీ జనాన్ని తరలించిన అధికారులు వారికి సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైనట్టు కనిపించింది. సభా ప్రాంగణంలో అంచనాకు తగ్గట్టుగా కుర్చీలు, షామియానాలు వేయకపోవడంతో జనం ఎండకు ఇబ్బంది పడ్డారు. ప్రాంగణం వెలుపల చెట్ల కింద కొందరు సేదదీరగా మరికొందరు వెనుదిరిగి తాము వచ్చిన వాహనాల్లో కూర్చున్నారు. సభకు వచ్చిన వారికి సకాలంలో తాగునీరు, భోజనాలు అందించలేదు. చాలా మందికి భోజనాలు అందక సభ తర్వాత పట్టణంలోని హోటళ్ళ మీద ఆధారపడ్డారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సభకు వచ్చిన పలువురు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం కనిపించింది. భోజనం కూడా పెట్టలేనపుడు తమను ఎందుకు తీసుకురావాలంటూ శాపనార్ధాలు పెట్టారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో కృష్ణగిరి ఆస్పత్రికి వెళ్లి తిరిగి వచ్చిన ఓ కుటుంబాన్ని కుప్పం పట్టణంలోకి పోలీసులు అనుమతించలేదు. సీఎం ప్రోగ్రాం ముగిసేవరకు వదిలేది లేదని నడుమూరు వద్ద ఆపేశారు. దీనిపై చంటిపిల్లలతో ఉన్న ఆ కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.