Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
ABN , First Publish Date - 2022-12-05T19:58:22+05:30 IST
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది.
విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది. ఇది మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనున్నది. తరువాత అదే దిశలో పయనించి ఈనెల ఎనిమిదో తేదీకల్లా నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా బలపడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు (North Tamil Nadu), దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నదని పేర్కొంది. ఇదిలావుండగా అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా, ఈనెల ఏడో తేదీ సాయంత్రం లేదా ఎనిమిదో తేదీ ఉదయానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత వాయువ్యంగా దిశ మార్చుకుని ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి లేదా పదో తేదీ ఉదయంకల్లా వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేశారు.
కాగా అల్పపీడనం ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న గాలులతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా, రాయలసీమలో వాతావరణం పొడిగా వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల ఏడో తేదీన నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీగా, దక్షిణ కోస్తాలో ఒక మోస్తరుగా, ఉత్తరకోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఇంకా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప (Prakasam, Kadapa), అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో దక్షిణ కోస్తా తీరంలో బలమైన గాలులు వీసే అవకాశం ఉందని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతవరణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్‌కు ‘మాండస్’గా నామకరణం
దక్షిణ అండమాన్‌లో గల అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా, ఈనెల ఎనిమిదో తేదీ ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారనున్నది. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘మాండస్’ (ఎంఏఎన్డీఓయూఎస్) అని నామకరణం చేయనున్నారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్లో తొలిసారి అక్టోబరు 23న తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు ‘సిత్రాంగ్’ అని పేరు పెట్టారు. ఈనెల ఎనిమిదో తేదీన ఏర్పడనున్న తుఫాన్‌కు ‘మాండస్’ అని పేరు పెట్టనున్నారు.