సొంత ఇల్లే లేదు.. కారు ఎక్కడిది?
ABN , First Publish Date - 2022-07-25T09:25:26+05:30 IST
‘‘నా వయసు 73 ఏళ్లు. నాకు పదేళ్ల కూతురుందని రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారు. సొంత ఇల్లు కూడా లేని నిరుపేదను.
పింఛన్ తొలగింపుపై పెనుకొండ ఎమ్మెల్యేను నిలదీసిన వృద్ధురాలు
‘గడప గడపకు’ కార్యక్రమంలో సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు
సోమందేపల్లి, జూలై 24: ‘‘నా వయసు 73 ఏళ్లు. నాకు పదేళ్ల కూతురుందని రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారు. సొంత ఇల్లు కూడా లేని నిరుపేదను. కారు ఉందంటూ రేషన్ కార్డు, పింఛన్ తొలగించారు. ఇదేం న్యాయం’’ అని వృద్ధురాలు యల్లమ్మ.. పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీశారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యేకు ప్రజలు.. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వృద్ధురాలు యల్లమ్మ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
తనపేరు మీద కారుందని రేషన్‌కార్డు తొలగించి, పింఛన్ కూడా రాకుండా చేశారని వాపోయారు. తనకు సొంత ఇల్లే లేదని, కారు ఎక్కడి నుంచి వస్తుందని నిలదీశారు. రేషన్ బియ్యం రాక, పింఛన్ అందక దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నానని ఆవేదన చెందారు. తనగోడు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తన ముగ్గురు కుమారులు బెంగళూరుకు వలస వెళ్లి, కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారన్నారు. తన కార్డులో పదేళ్ల కుమార్తె ఉన్నట్లు పేర్కొంటున్నారంటూ పలుసార్లు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని తెలిపారు.