Prepaid Smart Meters : మీ..ఠార్!
ABN , First Publish Date - 2022-10-26T01:45:25+05:30 IST
అటు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు... ఇటు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు! రెండూ కలిపి వినియోగదారుల ‘మీటర్ల’ను గిర్రున తిప్పేయడం ఖాయం!
జనానికి జగన్ ‘స్మార్ట్’ దెబ్బలు
ఒక్కో మీటరుపై రూ.35వేలు వ్యయం
వ్యవసాయ పంపుసెట్లు,
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల
మొత్తం ఖర్చు 4,512 కోట్లు
మార్పిడి భారం ప్రజలపైనే
ట్రూఅప్ చార్జీల రూపంలో షాక్
25 కేవీ లోడ్ దాటితే ప్రీపెయిడ్
అటు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు... ఇటు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు! రెండూ కలిపి వినియోగదారుల ‘మీటర్ల’ను గిర్రున తిప్పేయడం ఖాయం!
అవసరం, ప్రయోజనాలు, అస్మదీయులకు అందే ‘స్వలాభం’ సంగతులు ఎలా ఉన్నా... ఈ మీటర్ల కోసం రూ.4512 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా డిస్కమ్‌లు పెడుతున్న వ్యయమే! అంటే... ట్రూఅప్ చార్జీల పేరుతో ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
గతంలో.. నెలకు 500 యూనిట్లకు పైబడి మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లను మారుస్తామని డిస్కమ్‌లు చెప్పాయి. ఇప్పుడు కనెక్షన్ లోడ్ 25 కేవీ దాటిన వారందరికీ ఈ మీటర్లను బిగిస్తామని చెబుతున్నాయి. అంటే దాదాపుగా వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల పరిధిలోకి తెస్తున్నట్టే! అంటే.. గతంలో మాదిరిగా నెలవారీ బిల్లులు రావు. టెలికాం సంస్థల తరహాలో ముందస్తుగా డబ్బులు చెల్లించి విద్యుత్తును కొనుక్కోవాలి. దానికి కూడా ఒకే ధర ఉంటుందన్న గ్యారెంటీ డిస్కమ్‌లు ఇవ్వడం లేదు. ఒక ధర చెల్లిస్తే దానికి తగినన్ని యూనిట్లను కేటాయిస్తామని డిస్కమ్‌లు చెప్పడం లేదు. ప్రజలకు ప్రీపెయిడ్ మీటర్ల పనితీరును వివరించడం సంగతెలా ఉన్నప్పటికీ.. వీటి పనితీరును రాష్ట్ర విద్యుత్తు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి కూడా విధివిధానాలు వివరించకపోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో.. డిస్కమ్‌లకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులు బాధ్యతలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లకూ నాన్ ఐఏఎ్‌సలే సీఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల టర్నోవరు సహా.. విధానపరమైన నిర్ణయాలతో ముడిపడిన వ్యవస్థలు మార్గదర్శకాన్ని కోల్పోతున్నాయన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లోనే మొత్తానికి మొత్తం ఒకేసారి .. వినియోగదారుపై మోయలేనంత ట్రూఅప్ చార్జీల భారాన్ని వేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి.
అది నేతిబీరలో నెయ్యే...
వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగిస్తే.. కరెంటు వాడకం లెక్క కచ్చితంగా తెలుస్తుందంటూ సీఎం జగన్ తరచూ బహిరంగ సభల్లో చెబుతున్నారు. ఎనిమిదేళ్ల కిందట కొనుగోలుచేసిన స్మార్ట్ విద్యుత్తు మీటర్లు కచ్చితమైన రీడింగ్‌ను చూపిస్తున్నా.. మరింత ఆత్యాధునిక వ్యవస్థ కావాలంటూ, డిస్కమ్‌లు కొత్త పల్లవి ఎత్తుకున్నాయి. ఆ మీటర్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు కొత్త మీటర్లు ఏర్పాటుచేస్తామని చెబుతున్నాయి. ఈ విధానం అమలుచేయడం వల్ల కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని డిస్కమ్‌లు.. వినియోగదారులను నమ్మబలుకుతున్నాయి. నేతిబీరలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ మాటల్లో విశ్వసనీయత కూడా అంతేనని వామపక్ష వాదులు పెదవి విరుస్తున్నారు.
రాష్ట్ర ఇంధన శాఖ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన ప్రతిసారీ.. ఉద్యోగుల జీతభత్యాలపై డిస్కమ్‌లు పడతాయి. వారికి అత్యధికంగా చేస్తున్న చెల్లింపుల వల్లే నిర్వహణావ్యయాలు భారీగా పెరిగిపోయాయని ఆడిపోసుకుంటున్నాయి. వాస్తవానికి ఎన్‌టీపీసీ తదితర కేంద్ర సంస్థల్లోనే రాష్ట్ర విద్యుత్తురంగ ఉద్యోగులకంటే జీతభత్యాలు భారీగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నాయి. అలాగని కేంద్ర సంస్థలకు లాభాలు తగ్గడం లేదని వాదిస్తున్నారు. 2019లో అధికారంలోకి రాగానే వైసీపీ... కృష్ణపట్నంతో సహా.. విజయవాడ, రాయలసీమ థర్మల్ విద్యుత్కేంద్రాలను షట్‌డౌన్ చేసి.. బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీర్ఘదృష్టితో ఆలోచించకుండా ఒకటి రెండు వారాలకు.. తాత్కాలికంగా ప్రయోజనం కలిగించే ఈ విధానం వల్ల .. రాష్ట్ర ఇంధన రంగం ఘోరంగా దెబ్బతింది. రాష్ట్ర థర్మల్ విద్యుత్కేంద్రాలలో విద్యుదుత్పత్తిని నిలిపివేయడం వల్ల బొగ్గు కొనుగోళ్ల ప్రక్రియకూ విరామం ఇచ్చారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్తు ధరలకు రెక్కలు వచ్చాయి. యూనిట్ రూ.4.65గా ఉన్న ధర కాస్తా రూ.25కు చేరుకుంది. ఈ ధరలు ఇప్పటికీ దిగిరావడం లేదు. వచ్చే వేసవి కోసం ఇప్పటి నుంచే బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేసుకునేందుకు డిస్కమ్‌లు సిద్ధపడుతుంటే.. రూ.11.50కు తక్కువగా దొరకడం లేదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.
విపక్షంలో ఉండగా యాగీ...
జగన్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో 18.61 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గతంలో రైతులకు ఎలాంటి జంఝాటం లేకుండా ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు కేంద్ర సంస్థ.. వ్యవసాయ పంప్‌సెట్లకు ఐఎ్‌సఐ మార్కు కలిగిన పంప్‌సెట్లను బిగించింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దాదాపు 20000కు పైగా పంప్‌సెట్లను బిగించింది. అప్పట్లో ఇలా వ్యవసాయ పంప్‌సెట్లకు ఐఎ్‌సఐ మోటార్లను బిగించడమే నేరమన్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గగ్గోలు పెట్టింది. కానీ.. ఇప్పుడు.. ప్రతి పంపుకూ మీటరు బిగిస్తానంటూ జగన్ సర్కారు నడుంకట్టింది. మరోవైపు, రాష్ట్ర ఇంధనశాఖకు దాదాపు 70 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయి. నెలనెలా వాటికి వడ్డీ సహా కిస్తీలు కట్టేందుకు రకరకాల కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. రాష్ట్ర థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు రోజువారీనిర్వహణలో భాగంగా ప్రధాన ముడిసరుకు బొగ్గును కొనుగోలు చేసేందుకే కటకటలాడుతున్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంది. ఈ వాయిదాలను ప్రతినెలా మొదటివారంలో నేరుగా అప్పులు ఇచ్చిన సంస్థలకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెల్లించేలా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ చేస్తోంది. మరోవైపు డిస్కమ్‌లు దాదాపు రూ.38000 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రభుత్వకార్యాలయాల విద్యుత్తు బిల్లులు రాబట్టుకోవడంలో విఫలం కావడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
‘మీటరు’లో మతలబు
పంపుసెట్లకు మీటర్ల వ్యవహారం ఇంధన శాఖను కొత్త వివాదంలోకి నెడుతోంది. మార్కెట్‌లో రూ.6వేలలోపే దొరికే మీటరుకు ఇంధనరంగ సంస్థలు రూ.35,000 వరకు చెల్లించేందుకు ఉబలాటపడడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఈ మీటర్ల వ్యవహారంలో జగన్ సొంత జిల్లాకు చెందిన ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారని ఇంధనశాఖకు చెందిన కార్యాలయ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. అయినా.. కొత్త మీటర్లపై రూ.4512.38 కోట్లను వ్యయం చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇందులో సీపీడీసీఎల్ రూ.947.10 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ. 1657.66 కోట్లు, సీపీడీసీఎల్ రూ.1507.62 కోట్లు వ్యయం చేయనున్నాయి. సీపీడీసీఎల్ రూ.983 కోట్లతో మీటర్లు బిగించేందుకు టెండర్లను పిలిచేందుకు సిద్ధమైంది. ఇదే తరహాలో.. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ కూడా పాత మీటర్లు తీసేసి.. కొత్తవి బిగించేందుకు కార్యాచరణను సిద్ధంచేశాయి. సంబంధించిన ముసాయిదా టెండరు ప్రతిపాదనలను జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీకి డిస్కమ్‌లు పంపాయి.