Pinipe Viswarup: మంత్రి విశ్వరూప్‌కు నుంచి నిరసన సెగ
ABN , First Publish Date - 2022-12-19T20:29:57+05:30 IST
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (Pinipe Viswarup) సోమవారం ప్రారంభించిన గడపగడపకు కార్యక్రమంలో ఓ మహిళ నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో విశ్వరూప్ తన కుమారుడు...
అమలాపురం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (Pinipe Viswarup) సోమవారం ప్రారంభించిన గడపగడపకు కార్యక్రమంలో ఓ మహిళ నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో విశ్వరూప్ తన కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌తో కలిసి సోమవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. గ్రామంలో వైసీపీ (YCP)కి చెందిన ఓ మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లేసరికి సదరు మహిళ మంత్రి విశ్వరూప్‌తో పాటు ఆయన అనుచరులపై తీవ్ర స్వరంతో విరుచుకుపడింది. అమలాపురం (Amalapuram) అల్లర్ల కేసులో వైసీపీ జెండా మోసి పార్టీ కోసమే పనిచేసే తన కుమారుడిని అక్రమంగా ఇరికించి తమ కుటుంబానికి ఉపాధి లేకుండా చేశారంటూ ఆరోపిస్తూ మంత్రి విశ్వరూప్, తనయుడు శ్రీకాంత్ తదితరులపై విరుచుకుపడడంతో వెంటనే వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. తన కుమారుడిని అక్రమంగా కేసుల్లో ఇరికించి ఉద్యోగం లేకుండా చేశారంటూ ఆవేదన చెందారు. ఆమెను స్థానిక వైసీపీ నాయకులు సముదాయించేందుకు విఫలయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో నేతలంతా అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా: మంత్రి విశ్వరూప్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని విశ్వరూప్ వానపల్లిపాలెంలో స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్ ఆమోదంతో తన కుమారుడైన డాక్టర్ శ్రీకాంత్‌తో కలిసి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని పునఃప్రారంభించామని.... మరో కుమారుడైన కృష్ణారావు కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటాడని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని చెబుతూనే తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చారు. అయితే సోమవారం వానపల్లిపాలెంలో జరిగిన గడపగడపకు కార్యక్రమానికి ఇద్దరు కుమారులు హాజరైనప్పటికీ శ్రీకాంత్‌తోనే కలిసి మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు.