Byreddy Vs Gouru: ఒక్కసారిగా హీటెక్కిన పాణ్యం పాలిటిక్స్

ABN , First Publish Date - 2022-08-15T23:23:45+05:30 IST

రాయలసీమ రాజకీయాల్లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి గౌరు వెంకటరెడ్డి పరిచయం అక్కర లేని నేతలు. ఇరువురూ..

Byreddy Vs Gouru: ఒక్కసారిగా హీటెక్కిన పాణ్యం పాలిటిక్స్

కర్నూలు: రాయలసీమ (Rayalaseema) రాజకీయాల్లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (Byreddy Rajashekar Reddy), గౌరు వెంకటరెడ్డి (Gouru Venkat Rreddy).. పరిచయం అక్కర లేని నేతలు. ఇరువురూ నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందినవారే. తండ్రి వారసత్వ రాజకీయంతో బైరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ (Congress) సీనియర్‌ నేత మద్దూరు సుబ్బారెడ్డి పిలుపుతో గౌరు వెంకటరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1994, 1999లో బైరెడ్డి నందికొట్కూరు టీడీపీ (Tdp) ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక.. గౌరు వెంకటరెడ్డి సతీమణి గౌరు చరితారెడ్డి 2004 ఎన్నికల్లో బైరెడ్డిని ఓడించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలో.. బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య దాదాపు దశాబ్ద కాలానికి పైగా రాజకీయం రసవత్తరంగా సాగింది. 


2009 ఎన్నికలప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు జనరల్ నుంచి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో.. బైరెడ్డి, గౌరు కుటుంబాలు.. నందికొట్కూరు నుంచి పాణ్యం నియోజకవర్గానికి మకాం మార్చాయి. నువ్వా నేనా అన్నట్లుగా గౌరు, బైరెడ్డి రాజకీయాలు సాగిస్తుండగా.. 2019 ఎన్నికల ముందు వీరిద్దరిని చంద్రబాబు (Chandrababu) ఒకటి చేశారు. దీంతో.. 2019 ఎలక్షన్స్‌లో గౌరు వెంకటరెడ్డి బావ మాండ్ర శివానందరెడ్డి నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయగా.. బైరెడ్డి మద్దతు తెలిపారు. పొలిటికల్‌గా బద్ద శత్రువులైన బైరెడ్డి, గౌరు ఒకటై.. ఆయన తరుపున ప్రచారం చేశారు. అయితే.. ఫ్యాన్‌ గాలి గట్టిగా వీచిన క్రమంలో మాండ్ర ఓటమి చెందారు. 


ఇదిలావుంటే... ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో తలెత్తిన పరిస్థితులతో బైరెడ్డి, ఆయన కూతురు శబరి బీజేపీ(Bjp)లో చేరారు. అటు.. 2019 ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి ఓడిపోయారు. ఓటమి చెందినప్పటికీ గౌరు ఫ్యామిలీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. మూడేళ్ల నుంచి బైరెడ్డి, గౌరు.. ఎవరి పార్టీ కార్యక్రమాల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. అయితే.. రీసెంట్‌గా పిన్నాపురంలో నెలకొన్న సమస్యలపై బైరెడ్డి సీరియస్‌గా స్పందించారు. గ్రీన్ కో కంపెనీ నిర్మించే పవర్ ప్రాజెక్టులతో పిన్నాపురానికి ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా.. రిజర్వాయర్ ఆనకట్ట గ్రామానికి అతి సమీపంలో ఉందని.. దీంతో.. ఏదో ఒక రోజు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని బైరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్ కో ప్రాజెక్టుపై గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి (Panyam Mla Katasani RamBhupal Reddy), నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డి.. కంపెనీ ఇచ్చే కమీషన్ల కోసం సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇద్దరి మధ్య 60-40 ఒప్పందం కుదిరిందని బైరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్ష నేతలు.. పోలీసుల చేత ముందే హౌస్ అరెస్టులు చేయించుకుని. ఆందోళనలు చేస్తున్నట్లు నటిస్తున్నారని బైరెడ్డి విమర్శించారు. 


ఇక.. బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గౌరు వెంకటరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరెంత సంపాదించుకున్నారో చర్చించుకుందామా.. అని.. బైరెడ్డికి సవాల్ విసిరారు. పాణ్యంలోని పరిశ్రమల యజమానులు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్‌ చేశారు. 


అయితే.. బైరెడ్డికి గౌరు.. ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో పాణ్యం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అంతేకాదు.. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లోనూ ఇరువురి విమర్శలు, ప్రతి విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా... బైరెడ్డి-గౌరు.. సవాళ్లు విసురుకుంటే.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి మాత్రం బైరెడ్డి ఏమాత్రం స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. మొత్తంగా మూడేళ్ల పాటు మౌనంగా ఉన్న ఇరువురు నేతలు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విమర్శలతో బుసలు కొడుతున్నారు. ఈ నేతల సవాళ్లు ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని పాణ్యం పాలిటిక్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.    


Updated Date - 2022-08-15T23:23:45+05:30 IST