దళితుడి భూమిలో ‘ఆర్బీకే’!

ABN , First Publish Date - 2022-08-20T08:03:59+05:30 IST

దళితుడి భూమిలో ‘ఆర్బీకే’!

దళితుడి భూమిలో ‘ఆర్బీకే’!

15 సెంట్లు తీసుకుంటామన్న వైసీపీ నేతలు

మిగిలిన భూమికైనా పట్టా ఇప్పించాలన్న బాధిత కుటుంబం

హామీ ఇవ్వకపోగా బలవంతంగా శంకుస్థాపన

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న బంధువులు

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌


కంచికచర్ల, ఆగస్టు 19: రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) భవనం కోసం భూమి లాక్కోవడం తట్టుకోలేని ఓ దళిత కుటుం బం ఆత్మహత్యా యత్నం చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలివీ.. కీసర గ్రామంలో 68సెంట్ల ప్రభుత్వ పొరంబోకు భూమిని కొన్నేళ్లుగా కొంగల శ్యాంబాబు కుటుంబం సాగు చేసుకుంటోంది. ఈ భూమిలో రైతు భరోసా కేంద్రం భవనం నిర్మించేందుకు 15 సెంట్లు తీసుకుంటామని గ్రామానికి చెందిన వైసీపీ నేతలు శ్యాంబాబుకు చెప్పారు. దానికి ఆయన అంగీకరించి, మిగతా భూమిని తన పేరుతో రికార్డుల్లోకి మార్పించి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని కోరారు. దానికి వైసీపీ నేతలు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ భూమిలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శుక్రవారం ఉదయం శంకుస్థాపనకు సిద్ధం చేశారు. దీనిని నిరసిస్తూ శ్యాంబాబు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగినా.. నందిగామ ఎమ్మెల్యే ఎం.జగన్మోహనరావు శంకుస్థాపన పూర్తిచేశారు. దీంతో తమకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన శ్యాంబాబు కుటుంబ రాత్రి పొద్దుపోయాక ఆత్మహత్యకు ప్రయత్నించింది. అన్నంలో గడ్డిమందు కలిపి, ఆయనతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు తినేందుకు ప్రయత్నించారు. తమకు ఎవరూ న్యాయం చేయటం లేదని, తమకు చావే శరణ్యమంటూ బిగ్గరగా ఏడుస్తుండగా గమనించిన బంధువులు అడ్డుకున్నారు. ఈ ఘటనను ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టటంతో వైరల్‌ అయింది. శుక్రవారం ఉదయం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారించారు. శ్యాంబాబు మాట్లాడు తూ, 50ఏళ్ల నుంచి తమ కుటుంబానికి ఆధారంగా ఉన్న భూమిని ఆర్‌బీకే పేరుతో కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.

Updated Date - 2022-08-20T08:03:59+05:30 IST