పొగ చంపేసింది!

ABN , First Publish Date - 2022-11-21T02:27:44+05:30 IST

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌సర్య్యూట్‌తో సంభవించిన

పొగ చంపేసింది!

నగల వ్యాపారి ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌

ఊపిరాడక తండ్రీకొడుకు మృతి .. భార్య, కుమార్తె పరిస్థితి విషమం

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా), నవంబరు 20: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌సర్య్యూట్‌తో సంభవించిన అగ్నిప్రమాదంలో నగల వ్యాపారితోపాటు ఆయన కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భార్య, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, మృతుడి సోదరుడు కథనం మేరకు.. నర్సీపట్నం కృష్ణాబజార్‌ సమీపంలో ‘అంబికా జ్యూవెలరీస్‌’ పేరుతో నవర మల్లేశ్వరరావు ఉరఫ్‌ నానాజీ (45) నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. డూప్లెక్స్‌ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణం ఉండగా, పైన రెండు అంతస్థుల్లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. మల్లేశ్వరరావుకు భార్య సుజాత, కుమార్తె జాహ్నవి(20), కుమారుడు మౌలిష్‌ (19) ఉన్నారు. శనివారం రాత్రి మొదటి అంతస్థులోని బెడ్‌రూమ్‌లో జాహ్నవి, రెండో అంతస్థులోని బెడ్‌రూమ్‌లో నానాజీ, భార్య, కుమారుడు నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మొదటి అంతస్థులో మంట లు చెలరేగాయి. ఫర్నిచర్‌, కర్టెన్లు, ఇతర సామగ్రికి మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు రెండో అంతస్థులోకి కూడా పాకడంతో నానాజీకి మెలకువ వచ్చి, సోదరుడు అప్పారావుకు ఫోన్‌ చేశాడు. అప్పారావు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చి, ఇరుగుపొరుగు వారితో తమ్ముడి ఇంటివద్దకు వచ్చాడు. అయితే ఇంటికి అన్ని వైపులా గేట్లకు తాళాలు వేసి ఉండడంతో లోపలకు వెళ్లలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. గేట్ల తాళాలు పగులగొట్టి నలుగురినీ ఏరియా ఆస్పత్రికి తరలించగా నానాజీ, మౌలిష్‌ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. సుజాత, జాహ్నవిలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-21T02:27:46+05:30 IST