కేఎల్‌యూలో తానా చైతన్య స్రవంతి
ABN , First Publish Date - 2022-12-20T03:24:09+05:30 IST
అంతరించిపోతున్న భారతీయ కళలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నెలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు.
హాజరైన తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి
తాడేపల్లి, డిసెంబరు 19: అంతరించిపోతున్న భారతీయ కళలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నెలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో సోమవారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు అంజయ్య మాట్లాడుతూ... కనుమరుగవుతున్న కళలను, కళారూపాలను కాపాడేందుకు, భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని, భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే దృఢసంకల్పంతో చైతన్య స్రవంతి పేరుతో తానా వినూత్న కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. తానా కోఆర్డినేటర్ రాజా కసుపతి మాట్లాడుతూ ఆధునిక యుగంలో తెలుగు వారి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రజలను చైతన్యపరచడానికి తానా చర్యలు తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, డప్పు కళాకారులు, నృత్య కళాకారిణులు కోలాటం, చెక్కభజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎల్‌యూ వీసీ డాక్టర్ జి పార్థసారధివర్మ, రిజిస్ట్రార్ జగదీష్, కేఆర్‌ఎస్ ప్రసాద్, అసోసియేట్ డీన్ రూతు రమ్య, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమే్‌షబాబు, తానా మహిళా కోఆర్డినేటర్ ఉమాపతి, ఆలిండియా మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జేబీఆర్, ఆంధ్ర ఆర్ట్స్ అధినేత గోనా నారాయణరావు, ఆలిండియా హెల్త్ కేర్ సభ్యులు కళ్యాణి, కోఆర్డినేటర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.