ఉడకని అన్నం.. నీళ్లచారు మాకొద్దు!
ABN , First Publish Date - 2022-12-31T05:47:05+05:30 IST
‘రోజూ ఉడకని అన్నం, నీళ్ల చారు పెడుతున్నారు. ఫ్యాన్లు తిరగడం లేదు..
నిజాంపట్నం-రేపల్లె రహదారిపై 2 గంటల సేపు విద్యార్థుల ధర్నా
రేపల్లె, డిసెంబరు 30: ‘‘రోజూ ఉడకని అన్నం, నీళ్ల చారు పెడుతున్నారు. ఫ్యాన్లు తిరగడం లేదు.. దోమలతో అల్లాడుతున్నాం.. కిటికీలకు తలుపులు లేవు.. నీళ్లు పచ్చ గా ఉంటున్నాయి.. ఇన్ని సమస్యల మధ్య మేం ఎలా చదువుకోవాలి?’’ అంటూ బాపట్ల జిల్లా నిజాంపట్నం మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. 110మంది ఇంటర్ విద్యార్థులు ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందడం లేదంటూ వీరు నిజాంపట్నం రేపల్లె రహదారిపై సుమారు 2గంటల సేపు ధర్నా చేశారు. ఉడకని అన్నం, నీళ్ల చారు వద్దని నినదించారు. ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ వార్డెన్ శౌరికి ఎన్నిసార్లు సమస్యలు చెప్పినా పట్టించుకోలేదని, పైగా.. తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు.