అవమానించి అడ్డగోలు సమర్థన
ABN , First Publish Date - 2022-11-11T03:42:40+05:30 IST
సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చిన యోగివేమన పేరిట కడపలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యూనివర్సిటీని ఏర్పాటుచేస్తే అంతా వేనోళ్ల హర్షించారు.
వేమన విగ్రహ మార్పుపై తీవ్ర దుమారం
వైఎస్‌ను గద్దెనెక్కించి.. వేమనను తీసేయాలా?
ద్వారం వద్ద మరో వేమన విగ్రహం పెట్టలేరా?
విద్యార్థులు, విపక్షాల తీవ్ర నిరసన
(కడప - ఆంధ్రజ్యోతి): సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చిన యోగివేమన పేరిట కడపలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యూనివర్సిటీని ఏర్పాటుచేస్తే అంతా వేనోళ్ల హర్షించారు. కానీ, ఆ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన వేమన విగ్రహం తొలగించి ఇప్పుడు ఆ స్థానంలో వైఎస్ విగ్రహం స్థాపించడాన్ని అవే నోళ్లు తెగనాడుతున్నాయి. ఈ వ్యవహారం దుమారం రేపడంతో వైసీపీ వర్గాలు ఇరుకునపడ్డాయి. వేమన విగ్రహం మార్పిడిని సమర్థించుకోవడానికి సతమతమవుతున్నాయి. ‘యూనివర్సిటీలో ఎక్కడో ఉండే వేమన విగ్రహాన్ని ముఖద్వారం బయట బాగా తెలిసేలా ఏర్పాటుచేశాం’ అని వాదించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా... వేమనను మరింత గౌరవించాలనుకుంటే, గద్దెపైన ఉన్న విగ్రహాన్ని అలాగే ఉంచి, ముఖద్వారం వద్ద అంతే ప్రాధాన్యంతో మరో విగ్రహాన్ని పెట్టవచ్చు. కానీ... అలా చేయలేదు. పెద్ద పీఠంపై ఎత్తుగా కనిపించే వేమన విగ్రహాన్ని తొలగించారు. దానిని ముఖద్వారం ముందు టీవీ స్టాండు తరహాలో ఒక నిర్మాణం చేసి, దానిపైన పెట్టారు. నిజంగా వేమనపై అంత ప్రేమ ఉంటే రెండో విగ్రహాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా అంటే మాత్రం సమాధానం లేదు. వైఎస్ విగ్రహం వాడకొకటి, వీధికొకటి చొప్పున ఏర్పాటు చేశారు. మరి మహనీయుడు వేమన విగ్రహాలు యూనివర్శిటీలో రెండు ఏర్పాటు చేస్తే తప్పేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో యూనివర్శిటీకి గుండెకాయలాంటి వీసీ పరిపాలన భవనం ఎదుట వేమన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్ మరణానంతరం ఆయన విగ్రహాన్ని సీవీ రామన్ విభాగం ఎదుట ఏర్పాటుచేశారు. ఇదిలాఉండగా వారం క్రితం అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తెల్లారేసరికి వేమన విగ్రహాన్ని గేటు బయటకు తరలించేశారు. వేమన ఉన్న పీఠంపై వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. గేటు బయట రోడ్డు పక్కన మూడు అడుగుల ఎత్తులో కనిపించని విధంగా వేమన ఏర్పాటుచేయడాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై వీసీని నిలదీశారు.
ఇంకెన్ని పెడతారు?
వేమన విగ్రహం తొలగింపును ఖండిస్తూ శుక్రవారం వర్సిటీలో ఆందోళన చేపడతామని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి హెచ్చరించారు. కడపలో 50 డివిజన్లు ఉంటే, దాదాపు 60 వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని, వర్సిటీలో ఉన్నచోటు నుంచి వేమన విగ్రహాన్ని తొలగించి బయట ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. విగ్రహం తొలగింపును సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ ఖండించారు.
బాగా కనిపించాలనే...: వీసీ సూర్యకళావతి
‘‘యోగివేమన విగ్రహాన్ని యూనివర్సిటీకి ప్రధాన ద్వారం ఆర్చ్ కలిగి ఉన్న పీఠంపై ఉంచడం ద్వారా మంచి ఎలివేషన్ దొరుకుతుంది. విగ్రహ ప్రతిష్ఠాపనపై మా విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నారు.
విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించేవారు, ప్రధాన రహదారి ద్వారా వెళ్లే వారు ఆయన విగ్రహాన్ని చూసి స్మరించుకునే వీలుంటుంది. న్యాక్ సందర్శనను దృష్టిలో ఉంచుకుని కొత్త విగ్రహాలను కొనుగోలు చేయలేదు’’ అని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.సూర్యకళావతి తెలిపారు.
విద్యలేనివాడు: పవన్ ట్వీట్
వేమన విగ్రహం తరలింపుపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పందించారు. వేమన రాసిన పద్యం, దానికి తాత్పర్యం రెండూ ట్వీట్ చేశారు.
‘విద్యలేనివాడు విద్వాంసుచేరువ/నుండగానే పండితుండు కాడు/కొలని హంసలకదా గొక్కెరలున్నట్లు/విశ్వదాభిరామ వినురవేమ..’
తాత్పర్యం: విద్య లేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవ్వదు కదా!
పిచ్చికి పరాకాష్ఠ: నిమ్మల
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): వేమన విశ్వ విద్యాలయంలో వేమన విగ్రహాన్ని తొలగించి, వైఎస్ విగ్రహం పెట్టడం సీఎం జగన్ పిచ్చి చేష్టలకు పరాకాష్ఠ అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ చేష్టలు చూస్తుంటే రేపోమాపో గుళ్లలో దేవతల విగ్రహాలు కూడా మారుస్తారేమో అని అనుమానం కలుగుతోందన్నారు.
విధ్వంసకుడు: తులసిరెడ్డి
వేంపల్లె, నవంబరు 10: ‘‘ఆంగ్లేయుడైన సీపీ బ్రౌన్ వేమన పద్యాలు సేకరిస్తే... తెలుగువాడైన సీఎం జగన్ తెలుగు భాషా విధ్వంసకుడిగా తయారు కావడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలో జరిగిన సీపీ బ్రౌన్ 224వ జయంతి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిగ్గుండాలి: సీపీఐ
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సంస్థలు,పథకాలకు పెట్టిన మహనీయుల పేర్లు తొలగించి వైఎ్‌సఆర్, జగన్‌ల పేర్లు పెట్టుకోవడానికి సిగ్గుండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు.వెంటనే యోగి వేమన విగ్రహాన్ని యథాస్థానంలో తిరిగి ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు.
బ్రౌన్ ఆత్మఘోష: సన్నిధానం శాస్త్రి
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 10: కడప వేమన విశ్వవిద్యాలయంలో కేంద్ర స్థానం నుంచి వేమన విగ్రహాన్ని తొలగించడంతో బ్రౌన్ ఆత్మ ఘోషిస్తున్నదని బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిదానం శాస్త్రి అన్నారు.వేమన విశ్వవిద్యాలయంలోని ఘటనపై గవర్నర్ స్పందించి వేమన విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.