low pressure: రేపు అల్పపీడనం.. ఏడో తేదీ నుంచి వర్షాలు

ABN , First Publish Date - 2022-12-04T19:28:38+05:30 IST

గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌ల్యాండ్‌ నుంచి ఆదివారం ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది.

low pressure: రేపు అల్పపీడనం.. ఏడో తేదీ నుంచి వర్షాలు

విశాఖపట్నం: గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌ల్యాండ్‌ నుంచి ఆదివారం ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం (Low pressure) ఏర్పడనున్నది. అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి ఏడో తేదీ ఉదయంకల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనున్నది. ఇది ఎనిమిదో తేదీన ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అల్పపీడనం ఆరో తేదీకి వాయుగుండంగా, ఏడో తేదీకి తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. తుఫాన్‌ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో తీవ్ర వాయుగుండం.. వాయుగుండంగా బలహీనపడి తొమ్మిదో తేదీ రాత్రి లేదా పదో తేదీ ఉదయం ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేశారు.

దీని ప్రభావంతో ఏడో తేదీ రాత్రి నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు ప్రారంభమై ఎనిమిది, తొమ్మిది తేదీల్లో పెరుగుతాయి. ఎనిమిది, తొమ్మిది తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల భారీవర్షాలు, ఉత్తరకోస్తాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం (Nellore Prakasam), చిత్తూరు కడప జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయన్నారు. వాయుగుండం నేపథ్యంలో ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తూర్పుగాలుల ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Updated Date - 2022-12-04T19:28:39+05:30 IST