పరాయి పంచన అంగన్‌వాడీలు
ABN , First Publish Date - 2022-10-26T00:52:40+05:30 IST
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక పరాయి పంచన నడుపుతున్నారు.
కొన్ని పాడుబడిన భవనాల్లో కొనసాగుతున్న వైనం
స్థల సమస్యలతో కొత్త భవనాల నిర్మాణానికి ఆటంకం
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
నర్సీపట్నం, అక్టోబరు 21: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక పరాయి పంచన నడుపుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వాటిలో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ఇక్కడ చిన్నారులకు ప్రాథమిక విద్య, పౌష్టికాహారం అందిస్తారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, కిశోర బాలికలకు టీకాలు వేయించడం వంటి సేవలు అందిస్తారు. ఇంతటి కీలమైన అంగన్‌వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంధులు ఎదుర్కొంటున్నారు.
నర్సీపట్నం ప్రాజెక్ట్ పరిధిలోని నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట మండలాలలో 232 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో పక్కా భవనాలు 108, అద్దె భవనాల్లో 98 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరో 26 కేంద్రాలు సామాజిక భవనాలు, ప్రభుత్వ పాఠశాలలలో నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.వెయ్యి, అర్బన్‌లో రూ.4వేలు ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్నది. అద్దె భవనం 600 చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు గదులు, ఖాళీ స్థలం ఉండాలి. వంట గది, స్టాక్ రూమ్, తరగతి గది, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు ఉండాలి. మునిసిపాలిటీలో అద్దెలు ఎక్కువగా ఉండడం వలన ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడం లేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తల చేతి చమురు వదిలించుకుంటున్నారు. దీనికి తోడు అద్దె భవనాల్లో సరైన సౌకర్యాలు, ఆట స్థలాలు ఉండడం లేదు.
శిథిలావస్థలో అంగన్‌వాడీ కేంద్రాలు
నర్సీపట్నం మండలంలో మొండికండి, బుచ్చన్నపాలెం, లింగాలపాలెం అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నట్టు గత సీడీపీవో జీవీ రమణ ఎంపీడీవోకి నివేదిక ఇచ్చారు. దీంతో బుచ్చన్నపాలెం, మొండికండి కేంద్రాలను ఖాళీ చేయించి అద్దె భవనాల్లో తరలించారు. లింగాలపాలెం సెంటర్ ఇంకా పాడుబడిన భవనంలోనే నడుపుతున్నారు. నర్సీపట్నం మండలంలో వేములపూడి-3, శ్రీరాంపురం, బంగారయ్యపేట, చినఉప్పరగూడెం, కసిరెడ్డిపాలెం, అప్పన్నపాలెం, మెట్టపాలెం-1 అంగన్‌వాడీ భవనాల శ్లాబులు లీక్ అవుతుండడంతో మరమ్మతులకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రోలుగంట మండలం కె.అడ్డసారంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సామాజిక భవనంలోను, దిబ్బలపాలెంలో మహిళా మండలి భవనంలోనూ నడుపుతున్నారు. గొలుగొండలో చాలావరకు పాడు పడిన భవనాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు పడుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించడంతో చిన్నారులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన సమస్యలు ఇవీ
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక సమీపంలోని పాఠశాలలోని గదుల్లోనో, గ్రామాల్లో ఉన్న సామాజిక భవనాల్లోనో నడుతున్నారు. సామాజిక భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించడం వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా పౌష్టికాహారం వండించడం, సరుకులు నిల్వ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. అద్దె భవనాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సీడీపీవో సువార్తను వివరణ కోరగా.. కొన్ని భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. నర్సీపట్నంలో 2, గొలుగొండలో 2, రోలుగుంటలో 1 నాడు-నేడులో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.