Wedding Season: నవంబర్ 30 వరకు మూఢం.. డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తాలు ఎప్పుడున్నాయంటే..
ABN , First Publish Date - 2022-11-27T18:28:16+05:30 IST
డిసెంబర్ నెలలో పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. మూఢం కారణంగా మూడు నెలల పాటు ఎక్కడా పెద్దగా వివాహాలు జరగలేదు. అయితే, కార్తీక మాసం పోయి గురువారం మార్గశిర మాసం..
డిసెంబర్ నెలలో పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. మూఢం కారణంగా మూడు నెలల పాటు ఎక్కడా పెద్దగా వివాహాలు జరగలేదు. అయితే, కార్తీక మాసం పోయి గురువారం మార్గశిర మాసం అడుగుపెట్టింది. ఈ నెల 30వ తేదీ వరకు మూఢం ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. వచ్చే నెల డిసెంబరు 2 నుంచి 21వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18, 21వ తేదీలలో వేల సంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టులో పెళ్లిళ్లు జరగ్గా, ఆ తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో మూఢం వల్ల ముహూర్తాలు లేవు.
పెళ్లిళ్ల సీజన ప్రారంభం కానుండటంతో వస్త్ర, బంగారం వ్యాపారం ఊపందుకుంది. క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. గృహోపకరణ వస్తువుల అమ్మకాలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒకేసారి ముహూర్తాలు అధికంగా ఉండడంతో పురోహితులు దొరకని పరిస్థితి. దక్షిణాది సన్నాయి మేళం, బ్యాండ్‌లకు కూడా గిరాకీ ఏర్పడింది. కొన్ని ముఖ్యమైన రోజుల్లో సౌండ్, లైటింగ్స్, షామియానా, వీడియోగ్రాఫర్‌లు దొరకడం లేదంటున్నారు. కల్యాణ మండపాలను కూడా నెలల ముందే బుక్ చేసుకున్నారు. వంట మనుషులకు ముందే బెత్తాయింపులు చేసుకున్నారు. రవాణాకు సంబంధించి కార్లు, క్యాబులు, జీపులకు అడ్వాన్సులు చెల్లించుకున్నారు.