adani ambani: టాప్ సంపన్నుల జాబితాలో తమ స్థానాలు కోల్పోయిన అదానీ, అంబానీ.. ఇలా ఎందుకు జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-09-27T19:24:22+05:30 IST
దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం భారతదేశ సంపన్నులు గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీలకు ఊహించని పరిణామాన్ని తెచ్చిపెట్టింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం భారతదేశ సంపన్నులు గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీల సంపద వ్యాల్యూని కరిగించేస్తోంది. ప్రపంచ టాప్ సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ (adani group) సంస్థల అధినేత గౌతమ్ అదానీ (Gautham adani) అనతి కాలంలోనే 2వ ర్యాంకును కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల(bloomberg billionires) సూచీలో ఆయన మూడవ స్థానానికి దిగజారారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) తిరిగి రెండవ స్థానానికి చేరుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతుండడం అదానీ ఆస్తి విలువ పడిపోవడానికి కారణంగా ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో పయనిస్తుండడంతో అదానీ సంపద విలువ తగ్గింది. సోమవారం అదానీ గ్రూపు కంపెనీల స్టాక్స్ గణనీయంగా నష్టాలను చవిచూశాయి. దీంతో ఆయన ఆస్తి విలువ 6.91 బిలియన్ డాలర్ల మేర తగ్గి 135 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో బెఫ్ బెజోస్ ఆస్తి విలువ 138 బిలియన్ డాలర్లకు పెరిగింది. బెజోష్ రెండవ స్థానానికి చేరుకున్నారు. మరోవైపు ప్రపంచ సంపన్నుల టాప్ - 10 జాబితాలో ముకేష్ అంబానీ చోటు కోల్పోయారు. ఇటివల మార్కెట్ల వరుస పతనం ముకేష్ అంబానీ ఆస్తి విలువ తగ్గుదలకు కారణంగా ఉంది. ప్రస్తుతం 82.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానానికి పడిపోయారు.
కాగా ఈ నెల ఆరంభంలోనే గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మైలురాయికి చేరుకున్న తొలి భారతీయుడిగా, ఆసియా వ్యక్తిగా ఆయన నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ఈ ఏడాది గౌతమ్ అదానీ ఆస్తి విలువ 58.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా ఇదే ఏడాది ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల ఆస్తి విలువ 25.1 బిలియన్ డాలర్లు, 54.3 బిలియన్ డాలర్ల చొప్పున క్షీణించింది. ఈ ఏడాది ప్రపంచ టాప్ -14 బిలియనీర్స్‌లో కేవలం గౌతమ్ అదానీ సంపద విలువ మాత్రమే పెరిగింది. మిగతావారందరి ఆస్తి విలువ తగ్గింది. ఐఐఎఫ్ఎల్ హరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 రిపోర్ట్ ప్రకారం.. అదానీ రోజు ఆదాయం రూ.1600 కోట్లుపైగా ఉన్న విషయం తెలిసిందే.