Amazon: అమెజాన్ బ్యాడ్‌న్యూస్.. పాపం ఆ 20 వేల మంది పరిస్థితి ఏంటో!
ABN , First Publish Date - 2022-12-04T20:24:05+05:30 IST
గ్లోబల్ టెక్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) షాకింగ్ నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. గతంలో ప్రకటించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులపై వేటు (Employees layoff) వేయబోతోందని తాజాగా రిపోర్టులు వెలువడుతున్నాయి.
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) షాకింగ్ నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. గతంలో ప్రకటించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులపై వేటు (Employees layoff) వేయబోతోందని తాజాగా రిపోర్టులు వెలువడుతున్నాయి. త్వరలోనే 20 వేల మందికి ఉద్వాసన పలకబోతోందని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ తొలగింపులు ఉండబోతున్నాయని, డిస్ట్రిబ్యూటర్ వర్కర్స్, టెక్నాలజీ స్టాఫ్‌తోపాటు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ జాబితాలో ఉండనున్నారని సమాచారం. రానున్న నెలల వ్యవధిలోనే ఈ తొలగింపులు ఉండనున్నాయని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ప్రత్యక్ష వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ‘కంప్యూటర్ వరల్డ్’ (Computer World) ఒక రిపోర్టును ప్రచురించింది.
ఇక సీనియర్ స్థాయి ఉద్యోగుల నుంచి అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులపై వేటు ఉండబోతోందని రిపోర్టులు పేర్కొన్నాయి. కార్పొరేటు సిబ్బందిలో 6 శాతం మందిపై వేటువేయబోతోందని సమాచారం. కాగా అమెజాన్‌లో మొత్తం 1.5 మిలియన్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఏమంత ఆశ్చర్యానికి గురిచేయడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపునకు సన్నద్ధమవుతున్నామని ఇటివలే అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ నిర్ధారించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాగా అమెజాన్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతోదంటూ ‘ది న్యూయార్క్ టైమ్స్’ నవంబర్ నెలలో ఒక కథనాన్ని ప్రచుచరించిన విషయం తెలిసిందే.