IT Layoffs: ఒకేరోజు ఉద్యోగాలు కోల్పోయిన భార్యాభర్త.. అమెరికాలో మనవాళ్లకు ఎంత కష్టంగా ఉందంటే..
ABN , First Publish Date - 2022-11-22T21:25:58+05:30 IST
2009లో తీవ్ర ఆర్థిక మాంద్యం (Recession) ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ ఉద్యోగులపై (IT Employees) మాంద్యం ప్రభావం..
2009లో తీవ్ర ఆర్థిక మాంద్యం (Recession) ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ ఉద్యోగులపై (IT Employees) మాంద్యం ప్రభావం తీవ్రంగా పడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో (IT Sector) పనిచేస్తున్న వేల మంది భారతీయులు ఉపాధి కోల్పోయారు. మళ్లీ దాదాపు అప్పటి పరిస్థితులే పునరావృతం కానున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter), మెటా (Meta) లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన (Massive Layoffs) పలుకుతుండటంతో ఐటీ ఉద్యోగులు కలవరపాటుకు గురవుతున్న పరిస్థితులున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే.. వీకెండ్ సెలవులు, లక్షల్లో జీతాలు, లగ్జరీ లైఫ్‌స్టైల్ ఉంటుందని సమాజంలో ఒక భావన ఉంది. కానీ.. మాంద్యం లాంటి పరిస్థితులు తలెత్తితే ఇతర రంగాల్లో ఉద్యోగం చేసే వారి కంటే ఐటీలో ఉద్యోగం చేస్తున్న వారే ముందుగా నష్టపోతున్నారనేది జగమెరిగిన సత్యం. ఐటీలో లే-ఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. అగ్ర రాజ్యంగానే చెప్పుకునే అమెరికాలో.. మరీ ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఈ లే-ఆఫ్‌ల కారణంగా ఎక్కువగా నష్టపోతున్నారు. H-1B వీసా కలిగిన భారతీయులు ట్విటర్, మెటా, అమెజాన్ సంస్థల్లో చెప్పుకోతగిన సంఖ్యలోనే అమెరికాలో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం మాంద్యం కారణంగా అమెరికాలో ఐటీ జాబ్ చేస్తున్న కొందరు భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. దురదృష్టకరం ఏంటంటే.. ఉద్యోగంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాళ్లు కూడా ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. అలా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తుల్లో ఒకరు మెటాలో పనిచేసి లే-ఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయిన సురభి గుప్తా. 2009 నుంచి అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆమె ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెలలో మెటాలో జరిగిన లే-ఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం కోల్పోయారు. తాను మంచి పని తీరు కనబర్చినప్పటికీ ఉద్యోగం నుంచి తొలగించడం విస్మయానికి గురిచేసిందని సురభి గుప్తా వాపోయారు. గత పదిహేనేళ్లుగా అమెరికాలో స్థిరపడటం కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. కానీ ఇప్పుడు మరో ఉద్యోగం లభించని పక్షంలో భారత్‌కు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా టెక్ కంపెనీలు ఈ లే-ఆఫ్ బాటను ఎంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారని Layoffs.fyi (జాబ్ కట్స్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్) అనే వెబ్‌సైట్ పేర్కొంది. అమెరికాకు చెందిన Lyft అనే Ride-Sharing App సంస్థలో Lead Product Designer గా సౌమ్య అయ్యర్ అనే భారతీయురాలు పనిచేసేవారు. ఆమెతో పాటు కొన్ని వందల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఈ పరిణామాన్ని అస్సలు అంచనా వేయలేకపోయామని ఆమె చెప్పారు. ఇంతపెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తీరు చూస్తుంటే.. "Tech Pandemic" తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. తన స్నేహితుడు, అతని భార్య ఒకేరోజు ఉద్యోగాలను కోల్పోయారని.. దాదాపు తమలో చాలామంది ఒకరినొకరు ఓదార్చుకునే దయనీయ పరిస్థితి ఉందని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు.