అదానీ చేతికి డీబీ పవర్‌

ABN , First Publish Date - 2022-08-20T06:12:36+05:30 IST

దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌నకు చెందిన డీబీ పవర్‌ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు భారత కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ పవర్‌ శుక్రవారం

అదానీ చేతికి డీబీ పవర్‌

ఒప్పందం విలువ రూ.7,017 కోట్లు 


న్యూఢిల్లీ: దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌నకు చెందిన డీబీ పవర్‌ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు భారత కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ పవర్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరగనుంది. డీబీ పవర్‌కు చత్తీ్‌సగఢ్‌లోని జంజ్‌గిర్‌ చంపా జిల్లాలో 600 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు థర్మల్‌ విద్యుత్‌ యూనిట్లున్నాయి. ఈ ప్లాంట్లు 923.5 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు దీర్ఘకాలిక, మధ్యకాలిక పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)తోపాటు కోల్‌ ఇండియా నుంచి బొగ్గు సరఫరా కాంట్రాక్టును కలిగి ఉన్నాయి.


ఈ ఏడాది అక్టోబరు 31కల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అవసరమైతే గడువును ఇరువర్గాల సమ్మతం ద్వారా పొడిగించుకోనున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. చత్తీ్‌సగఢ్‌లో అదానీ పవర్‌ కార్యకలాపాల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ఈ డీల్‌ దోహదపడనుంది. 2006 అక్టోబరులో ఏర్పాటైన డీబీ పవర్‌.. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) రూ.3,488 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2020-21లో టర్నోవర్‌ రూ.2,930 కోట్లు, 2019-20లో రూ.3,126 కోట్లుగా నమోదైంది. డీబీ పవర్‌ ప్రస్తుత రుణ భారం రూ.5,500 కోట్ల స్థాయిలో ఉంది. 


అదానీ రూ.31,139 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌

అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో మిగిలిన ఈక్విటీ వాటాల కొనుగోలుకు అదానీ గ్రూప్‌ చేసిన  390 కోట్ల డాలర్ల (దాదాపు రూ.31,139 కోట్లు) ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంబుజా సిమెంట్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 51.63 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ రూ.385 చొప్పున కొనుగోలుకు అదానీ కుటుంబానికి చెందిన మారిషస్‌ కంపెనీ ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రూ.19,880 కోట్లు చెల్లించనుంది. ఇక ఏసీసీలో 26 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ రూ.2,300 చొప్పున కొనుగోలు చేసేందుకు అదానీ కుటుంబం రూ.11,259 కోట్లు వెచ్చించనుంది. ప్రతిపాదిత ఓపెన్‌ ఆఫర్‌ పూర్తయ్యాక అంబుజా సిమెంట్స్‌లో అదానీ గ్రూప్‌ వాటా 89.11 శాతానికి చేరుకోనుంది. ఏసీసీలో 80.53 శాతానికి పెరగనుంది.


ప్రపంచ సిమెంట్‌ దిగ్గజం హోల్సిమ్‌ తన భారత విభాగ ఆస్తులైన అంబుజా సిమెంట్స్‌, ఏసీసీని అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ సిమెంట్స్‌కు విక్రయించేందుకు ఈ ఏడాది మే నెలలో అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా అదానీ సిమెంట్స్‌.. అంబుజా సిమెంట్స్‌లో 63 శాతం వాటాతో పాటు ఏసీసీలో అంబుజా సిమెంట్స్‌, హోల్సిమ్‌లకు చెందిన వాటాలను దక్కించుకుంది. సెబీ నిబంధనల ప్రకారం.. ఏదైనా లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం లేదా అంతకు పైగా వాటా కొనుగోలు చేసినప్పుడు, తప్పనిసరిగా ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-08-20T06:12:36+05:30 IST