ఎయిరిండియాకు కొత్త రెక్కలు!

ABN , First Publish Date - 2022-12-11T01:34:35+05:30 IST

టాటా గ్రూప్‌ గూటికి చేరిన ఎయిరిండియా భారీగా విమానాలు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను తొలుత 50 కొనుగోలు చేసేందుకు...

ఎయిరిండియాకు కొత్త రెక్కలు!

150 విమానాల కొనుగోలుకు త్వరలో ఒప్పందం!!

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ గూటికి చేరిన ఎయిరిండియా భారీగా విమానాలు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను తొలుత 50 కొనుగోలు చేసేందుకు త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనుందంటూ ఎకనామిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. భవిష్యత్‌లో ఈ విమానాల ఆర్డర్ల సంఖ్యను 150 వరకు పెంచుకునే ఆప్షన్‌తో ఒప్పందం చేసుకోనుందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు ఇరువర్గాలు నిరాకరించాయి. ప్రైవేటీకరణ తర్వాత ఎయిరిండియాకు ఇదే తొలి విమానాల ఆర్డర్‌ కానుంది. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వరకు వాటా ఇంధన ఖర్చులదే. కాబట్టి, ఇంధన ఆదాకు దోహదపడే 737 మ్యాక్స్‌ విమానాల కొనుగోలు ద్వారా నిర్వహణ సమర్థతతోపాటు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో మార్కెట్‌ వాటాను సైతం పెంచుకోవాలని ఎయిరిండియా భావిస్తున్నట్లు తెలిసింది.

‘చిప్‌’ల తయారీలోకి టాటా: మున్ముందు సంవత్సరాల్లో దేశీయంగానే సెమీకండక్టర్లను తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు టాటా గ్రూప్‌ ప్రకటించింది. దేశీయంగా చిప్‌ల తయారీలో భాగస్వామ్యం కోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు నిక్కీ ఏషియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ఇప్పటికే ‘చిప్‌’లు తయారు చేస్తున్న కంపెనీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. టాటా ఎలకా్ట్రనిక్స్‌ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్‌ వ్యాపారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్‌ వెల్లడించారు. ఇందుకోసం కంపెనీ జపాన్‌కు చెందిన రెనెసాస్‌ ఎలకా్ట్రనిక్స్‌తో ఈ ఏడాది జూన్‌లోనే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుత చిప్‌ల తయారీదారుల్లో ఎవరితోనైనా జట్టు కట్టి దేశీయంగానే వాటి తయారీని ప్రారంభించాలనుకుంటున్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ చెప్పారు.

Updated Date - 2022-12-11T01:34:43+05:30 IST