‘జూన్‌’లో పెట్రో బాంబ్ ?

ABN , First Publish Date - 2022-05-31T21:18:44+05:30 IST

పెట్రో రేట్లు తగ్గిన నేపథ్యంలో... ఆ ఉపశమనం నుంచి ఇంకా బయటపడనే లేదు... అప్పుడే మళ్ళీ పెట్రో ధరలు పెరగనున్నాయన్న వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి.

‘జూన్‌’లో పెట్రో బాంబ్ ?

న్యూఢిల్లీ/ముంబై : పెట్రో రేట్లు తగ్గిన నేపథ్యంలో... ఆ ఉపశమనం నుంచి ఇంకా బయటపడనే లేదు... అప్పుడే మళ్ళీ పెట్రో ధరలు పెరగనున్నాయన్న వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి. మొత్తంమీద ఇంధన ధరలు పెరిగే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కేంద్రం చర్యలతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ... అది ఎంతోకాలం నిలిచే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పని పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నెలలోనే ఇంధన ధరల పెంపుదలకు ముహూర్తం పెట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. ఈ ప్రభావం దేశీయ ఇంధన  అమ్మకాలపై పడుతోంది. వాటి రేట్లను ప్రభావితం చేస్తోంది.


బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ పెరిగింది. కిందటి రోజు బ్యారెల్ ఒక్కింటికి 119.89 డాలర్లను నమోదు చేసిన ధర... ఇప్పుడు ఆ మార్క్‌ను దాటిపోయి, 124 డాలర్లకు చేరింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 125 డాలర్లకు చేరువ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అదనపు భారాన్ని భరిస్తున్నాయి. రికార్డులు బ్రేక్ చేస్తోన్న క్రూడాయిల్ ధర... రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు సమ్మతించిన విషయం తెలిసిందే.  యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఈ దిశగా తమ అంగీకారాన్ని తెలిపిన కొన్ని గంటల వ్యవధిలోనే క్రూడాయిల్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యాపై ఆరో ప్యాకేజీ కింద మరిన్ని ఆంక్షలను విధించాయి. నిషేధాజ్ఞల తీవ్రతను పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌పై ఈ ప్రభావం తారస్థాయిలో పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 124 డాలర్లకు చేరడానికి ఈ పరిణామాలు దారి తీశాయి. బ్రెంట్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లోనూ క్రూడ్ ధరల్లో భారీ తేడా నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి... దేశీయ ఇంధన అమ్మకాలపై పడే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-05-31T21:18:44+05:30 IST