SBI credit card rules: జనవరి నుంచి మారుతున్న ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు రూల్స్.. తెలుసుకోకుంటే కష్టమే!
ABN , First Publish Date - 2022-12-15T20:24:23+05:30 IST
భారతీయ స్టేట్‌బ్యాంకు కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ దాని ‘సింప్లిక్లిక్’ (SimplyCLICK) కార్డుదారులకు సంబంధించి కొన్ని నిబంధనలను సవరించింది.
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌బ్యాంకు కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ దాని ‘సింప్లిక్లిక్’ (SimplyCLICK) కార్డుదారులకు సంబంధించి కొన్ని నిబంధనలను సవరించింది. నిర్దిష్ట కార్డుదారులకు సంబంధించి జనవరి నుంచి క్రెడిట్ కార్డు (Credit Card) నిబంధనలు మారనున్నాయి. బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రకారం.. వోచర్లు, రివార్డు పాయింట్‌లను ఉపయోగించుకోవడానికి సంబంధించి రెండు ముఖ్యమైన మార్పులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
ఆన్‌లైన్ ఖర్చులు నిర్ణీత పరిమితికి చేరిన తర్వాత ‘సింప్లిక్లిక్’ కార్డుదారులకు లభించే వోచర్ల (voucher)ను తప్పనిసరిగా ఒక లావాదేవీలో మాత్రమే రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని మరో ఆఫర్‌తో కానీ, లేదంటే మరో వోచర్‌తో కానీ కలపడం కుదరదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. జనవరి 6 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. వోచర్/ కూపన్ కోడ్ (coupon code) ద్వారా వినియోగదారులు గరిష్ఠంగా రూ. 2 వేల తగ్గింపును పొందొచ్చు.
అమెజాన్‌లో సింప్లిక్లిక్/సింప్లిక్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డుతో జరిపే లావాదేవీలపై లభించే 10X రివార్డు పాయింట్లు ఇకపై 5X పాయింట్లకు తగ్గుతాయి. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, క్లియర్‌ట్రిప్, ఈజీ డిన్నర్, అపోలో 24X7, బుక్‌మై షో, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్‌పై జరిపే లావాదేవీలకు మాత్రం 10X రివార్డు పాయింట్లు లభిస్తాయి.
క్లియర్‌ట్రిప్ వోచర్/కూపన్ కోడ్స్‌కు సంబంధించిన నియమనిబంధనలు
* కూపన్ కోడ్/వోచర్ పోయినా, దొంగిలించబడినా, దుర్వినియోగమైనా అందుకు క్లియర్‌ట్రిప్ కానీ, ఎస్‌బీఐ కానీ బాధ్యత వహించదు.
* క్లియర్‌ట్రిప్ వెబ్‌సైట్ ద్వారా కానీ, మొబైల్ యాప్ ద్వారా కానీ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల ఆన్‌లైన్ బుకింగ్‌లకు మాత్రమే వోచర్/కూపన్ కోడ్ చెల్లుబాటు అవుతుంది.
* రెండేళ్లలోపు చిన్నారుల టికెట్ బుకింగ్స్‌కు వోచర్/కూపన్ కోడ్ ఆప్షన్ వర్తించదు.
* కూపన్/వోచర్ కోడ్ అది అందిన రోజు నుంచి నాలుగు నెలలు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.
* ఆఫర్‌ను వినియోగదారులు దుర్వినియోగం చేస్తే ఆ ఆఫర్‌ను తిరస్కరించే, బుకింగ్‌ను రద్దు చేసే హక్కు క్లియర్‌ట్రిప్‌కు ఉంది.
* వోచర్/కూపన్ కోడ్‌ను రిఫండ్ చేయడం కానీ, రీప్లేస్ చేయడం కానీ, కాలపరిమితి మార్చడం కానీ, దానిని నగదుగా మార్చుకోవడం కానీ కుదరదు.