IT sector: మీరు రెండు చోట్ల ఉద్యోగం చేస్తున్నారా?.. మరి ఈ విషయం తెలుసా..
ABN , First Publish Date - 2022-11-05T17:46:44+05:30 IST
మూన్‌లైటింగ్ అంశం ఇటివల హాట్ టాపిక్‌గా మారింది. పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించాయి. మరి మూన్‌లైటింగ్ విధానంపై ఆదాయ పన్ను చట్టాలు (Income tax laws) ఏం చెబుతున్నాయి?. నిబంధనలు ఏంటి ? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం..
ఐటీ రంగంలో (IT Sector) ఇటివల తరచుగా వినిపిస్తున్న పదం ‘మూన్‌లైటింగ్’ (Moonlighting). ఎవరైనా ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగిగా కొనసాగుతూనే అదనపు ఆదాయం కోసం మరో కంపెనీకి పనిచేయడాన్ని ‘మూన్‌లైటింగ్’గా వ్యవహరిస్తున్నారు. ఈ అంశమే ఐటీ రంగంలో ఇటివల హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారనే కారణంతో విప్రో (Wipro) కంపెనీ ఏకంగా 300 మంది ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. ప్రధాన ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను హెచ్చరించాయి. అయితే తొలగిస్తామంటూ కంపెనీలు హెచ్చరించడం వరకు అంతా బాగానే ఉంది. మరి మూన్‌లైటింగ్ విధానంపై ఆదాయ పన్ను చట్టాలు (Income tax laws) ఏం చెబుతున్నాయి?. నిబంధనలు ఏంటి ? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం..
మూన్‌లైటింగ్ ద్వారా ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. కాబట్టి వారంతా ఆదాయ పన్ను (Income tax) పరిధిలోకి వస్తారని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక కంపెనీ పేరోల్‌లో (Payroll) ఉండి వేరే కంపెనీకి పనిచేస్తే పన్ను నిబంధనలు వర్తిస్తాయని అంటున్నారు. ఏదైనా కంపెనీ లేదా వ్యక్తి మరో వ్యక్తికి కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా ప్రొఫెసనల్ ఫీజు కింద నెలకు రూ.30 వేల కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తే టీడీఎస్ (TDS) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ చెప్పారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194సీ ప్రకారం.. కాంట్రాక్ట్ వర్క్ కింద ఎవరైనా ఓ వ్యక్తికి ఫీజు లేదా జీతం చెల్లిస్తుంటే ఖచ్చితంగా టీడీఎస్ (TDS) వర్తిస్తుందని వివరించారు. పేమెంట్ చెల్లిస్తున్నవారు ఒక సంస్థ, ట్రస్ట్, కంపెనీ లేదా లోకల్ అథారిటీ ఎవరైనా సరే పన్ను పరిధిలోకి వస్తారని వివరించారు. ఈ చెల్లింపు నగదు, చెక్ లేదా డ్రాఫ్ట్, ఇతర ఏ రూపాల్లో నగదు చెల్లించినా ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి వస్తారని వివరించారు. రూ.30 వేల కంటే ఎక్కువ చెల్లిస్తుంటే 10 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లింపు మొత్తం రూ.1 లక్ష దాటినా టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ, ప్రొఫెసినల్ సర్వీసెస్ ఫీజు, టెక్నికల్ సర్వీసు ఫీజు, నాన్-కంపీట్ ఫీజు ఇలా చెల్లింపు ఏ రూపంలో ఉన్నా టీడీఎస్ వర్తిస్తుంది. అందుకే ఉద్యోగులు తమ అదనపు ఆదాయాన్ని ట్యాక్స్ రిటర్న్స్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. వర్తించే పన్నులన్నీ చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.