Zomato layoffs: జొమాటో షాకింగ్ నిర్ణయం.. పాపం ఎంతమందంటే..

ABN , First Publish Date - 2022-11-21T20:05:05+05:30 IST

ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు ఉద్యోగుల తొలగింపు (layoffs) ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునేందుకు చిన్నచిన్న కంపెనీలు ప్రయత్నించడం సాధారణమే. కానీ దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల ఉద్వాసన పలుకుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Zomato layoffs: జొమాటో షాకింగ్ నిర్ణయం.. పాపం ఎంతమందంటే..

న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు ఉద్యోగుల తొలగింపు (layoffs) ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునేందుకు చిన్నచిన్న కంపెనీలు ప్రయత్నించడం సాధారణమే. కానీ దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల ఉద్వాసన పలుకుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మెటా (META), అమెజాన్‌(Amazon)తోపాటు పలు కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించగా.. ఆ జాబితాలో తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) కూడా చేరింది. కంపెనీని వీడాలంటూ అన్ని విభాగాల్లోని కొందరు ఉద్యోగులను కోరింది. 3 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని జొమాటో భావిస్తున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో వేర్వేరు విభాగాల్లో పనిచేసే కొందరి ఉద్యోగాలు ఊడనున్నాయి. టెక్నాలజీ, ప్రొడక్ట్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోత ఉండనుందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రదర్శన ఆధారిత వడపోతలో భాగమే ఈ ఉద్యోగాల కోత అని, ప్రదర్శనను బట్టి 3 శాతం మందిని తొలగించడం రెగ్యులర్ ప్రక్రియ అని, అంతకుమించి కొత్తగా ఏమీలేదని జొమాటో ప్రతినిధి ఒకరు చెప్పారు.

తాజా రౌండ్‌లో 3800 మందిని తొలగించినట్టు సమాచారం. ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీసు మాజీ హెడ్‌లు రాహుల్ గంజో, సిద్ధార్థ జవార్‌లను కూడా తొలగించడం గమనార్హం. వీరిద్దరినీ తొలగించడాన్ని నిరసిస్తూ దాదాపు నాలుగున్నరేళ్లపాటు పనిచేసిన జొమాటో సహవ్యవస్థాపకుడు మొహిత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ స్పందించారు. ‘‘ ఎంజీ (మోహిత్ గుప్తా) కొన్నేళ్లుగా సోదరుడిగా, స్నేహితుడిగా మెలిగావు. కంపెనీ కోసం అద్భుతంగా కృషి చేశావు. కంపెనీని పతన అంచుల నుంచి నిలబెట్టావు. జొమాటో వ్యాపారాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చావు. కంపెనీని లాభదాయకంగా మార్చావు. ఇంత వ్యాపారాన్ని సృష్టించేందుకు నాకు శిక్షణ ఇచ్చావు’’ అని అన్నారు. కాగా మే 2020లో 520 మంది ఉద్యోగులను జొమాటో తొలగించింది. ఆ సమయంలో మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం మంది పక్కనపెట్టింది. కరోనా మహమ్మారి సమయంలో ఫుడ్ డెలివరీ వ్యాపారం నెమ్మదించడంతో ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-21T20:05:31+05:30 IST