తాంబరంలో నకిలీ ఈ-సేవా కేంద్రం
ABN , First Publish Date - 2022-12-17T08:12:40+05:30 IST
తాంబరం ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద నకిలీ ఈ- సేవాకేంద్రం(Fake e-service center) నడిపి సుమారు ఐదువందల మందిని మోసగించిన
- ప్రభుత్వ డాక్టర్ సంతకాల ఫోర్జరీ
- 500 మందిని మోసగించిన మహిళ అరెస్టు
చెన్నై, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తాంబరం ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద నకిలీ ఈ- సేవాకేంద్రం(Fake e-service center) నడిపి సుమారు ఐదువందల మందిని మోసగించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళ క్రోంపేట ప్రభుత్వాసుపత్రి డాక్టర్ పేరిట సంతకాలు చేసి ఆధార్‌కార్డులు మంజూరు చేయించినట్లు తేలడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్‌కార్డులు పొందినవారి వివరాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాలిలా వున్నాయి... మూడు రోజుల క్రితం షణ్ముగం, శివకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తమ సందేహాన్ని తీర్చుకునేందుకు క్రోంపేట ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కామేష్ బాలాజీ(Dr. Kamesh Balaji) వద్దకెళ్లి పత్రాలను చూపించారు. ఆ దరఖాస్తు ఫారాల్లో తాము రాసింది సరిగ్గానే వుందా అని అడిగారు. అయితే ఆ పత్రాలను చూసిన డాక్టర్ కామేష్ బాలాజీ అవాక్కయ్యారు. ఆ దరఖాస్తు ఫారాలపై తన సంతకం, సీలు వున్నాయి. వాటిపై వున్న సంతకం తనది కాదని, వాటిని ఎవరిచ్చారని డాక్టర్ ఎదురు ప్రశ్నించగా, తాంబరం ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద ఈ-సేవా కేంద్రం నడుపుతున్న శశికళ (34) ఇచ్చినట్లు షణ్ముగం, శివకుమార్ బదులిచ్చారు. అన్ని వివరాలను తెలుసుకున్న డాక్టర్ కామేష్ బాలాజీ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆధార్‌కార్డులు జారీ చేస్తున్న వైనం గురించి తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ-సేవాకేంద్రం నడుపుతున్న శశికళను అరెస్టు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో శశికళ గతంలో క్రోంపేటలోని సిటీ యూనియన్ బ్యాంక్‌లో ఆధార్ ఆపరేటర్‌గా పనిచేసిందని, ఆ అనుభవంతో తన కుమారుడు సిజో పేరుతో నకిలీ ఈ- సేవాకేంద్రాన్ని నడుపుతోందని తేలింది. సుమారు 500 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసగించిందని కూడా వెల్లడైంది. ప్రభుత్వ డాక్టర్ కామేష్ బాలాజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సీలు ఉపయోగించి ఈ మోసాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. అరెస్టయిన శశికళను కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.