Explosion: కోవైలో పేలుడు: రెండు ముక్కలైన కారు

ABN , First Publish Date - 2022-10-24T09:53:11+05:30 IST

వాణిజ్యనగరం కోయంబత్తూరు(Coimbatore)లో ఆదివారం వేకువజామున వేగంగా వెళుతున్న మారుతీ కారులో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది.

Explosion: కోవైలో పేలుడు: రెండు ముక్కలైన కారు

- మంటల్లో ఒకరి మృతి

- ఉగ్రవాదుల పనా?

- ఘటనా స్థలాన్ని సందర్శించిన డీజీపీ

చెన్నై, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వాణిజ్యనగరం కోయంబత్తూరు(Coimbatore)లో ఆదివారం వేకువజామున వేగంగా వెళుతున్న మారుతీ కారులో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు కారు రెండు ముక్కలైంది. కారు నడిపిన వ్యక్తి మంటల్లో త్రీవంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఆ కారులోని గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఈ పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమోనన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలియగానే డీజీపీ శైలేంద్రబాబు హుటిహుటిన కోయంబత్తూరు వెళ్ళి స్వయంగా విచారణ జరిపారు. ఇదే విధంగా చెన్నై నుంచి వెళ్ళిన ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలను సేకరించి శోధిస్తున్నారు. దీపావళి పండుగను ఘనంగా చేసుకునేందుకు కోయంబత్తూరు వాసులంతా సిద్ధమవుతున్న వేళ అనుమానాస్పదంగా కారులో పేలుడు సంభవింగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటనతో పేలుడు జరిగిన ప్రాంతం చుట్టూ దుకాణాలను మూసివేశారు. రహదారుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇటీవల కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నేతల ఇళ్లపై పెట్రోలు బాంబు దాడులు జరిగాయి. వాటి అలజడి సద్దుమణగకముందే కారులో పేలుడు సంభవించడంతో కోయంబత్తూరు వాసులు భీతిల్లుతున్నారు.

గుడి సమీపంలో పేలుడు....

కోయంబత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలో కోట్టై ఈశ్వరన్‌ ఆలయం వద్ద ఆదివారం వేకువజామున 4.10 గంటలకు మారుతీ కారు వేగంగా వెళ్తూ స్పీడ్‌ బ్రేకర్‌పై ఎక్కిదిగింది. ఆ కుదుపులకు కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి క్షణాల్లో పేలుడు సంభవించింది. ఆ ధాటికి కారు రెండు ముక్కలై ఎగిరిపడింది. కారును నడుపుతున్న వ్యక్తి గుర్తుపట్టలేనంతగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో ధ్వంసమైన కారు చెన్నై రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక కారులో రెండు గ్యాస్‌ సిలిండర్లుండటంతో వాటిలో ఒకదాని నుంచి గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో పేలుడు సంభవించడం చూసి స్థానికులు అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసినప్పటికే ఆ కారు పూర్తిగా కాలిపోయింది.

డీజీపీ పరిశీలన...

ఈ ప్రమాదం గురించి తెలియగానే డీజీపీ శైలేంద్రబాబు చెన్నై(Chennai) నుంచి విమానంలో కోయంబత్తూరుకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కోవై సిటీ పోలీసు కమిషనర్‌ బాలకృష్ణన్‌, ఏడీజీపీ తామరైకన్నన్‌తో కలిసి డీజీపీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు కారణంగా దెబ్బతిన్న కోట్టై ఈశ్వరన్‌ ఆలయ ముందుభాగం కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కారులో ఉన్న రెండు సిలిండర్లలో ఒకదానిలో గ్యాస్‌ లీకై పేలుడు సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నామని చెప్పారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్‌ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. స్థానిక బాంబ్‌ స్క్వాడ్‌ దళాలు కూడా పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నాయని వెల్లడించారు. పేలుడు ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ కూడా సేకరించి పోలీసులు ధర్యాప్తు చేస్తున్నట్టు డీజీపీ వివరించారు.

మృతుడి గుర్తింపు

కారులో పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. మారుతీ కారు నడిపింది ఉక్కడం ప్రాంతానికి చెందిన జమేషా ముబిన్‌ అని తెలిపారు. 2019లో ఎన్‌ఐఏ అధికారులు అతడి నివాసంలో తనిఖీలు కూడా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనితో అతడి కుటుంబీకులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-10-24T09:53:16+05:30 IST