అసమానతలకు వ్యవస్థల దన్ను

ABN , First Publish Date - 2022-12-17T01:24:19+05:30 IST

సమాజంలో స్థిరత్వం, సమతుల్యత, సామాజిక క్రమశిక్షణ కోసం వ్యవస్థలు అవసరం. ఈ వ్యవస్థలను నిర్మించే బృహత్ బాధ్యత వ్యక్తులదే.

అసమానతలకు వ్యవస్థల దన్ను

సమాజంలో స్థిరత్వం, సమతుల్యత, సామాజిక క్రమశిక్షణ కోసం వ్యవస్థలు అవసరం. ఈ వ్యవస్థలను నిర్మించే బృహత్ బాధ్యత వ్యక్తులదే. ఆ క్రమంలో వ్యవస్థలను తయారు చేసే పనిలో కొందరు, వాటి అడుగుజాడల్లో మెలిగే పనిలో మిగతా కొందరు మిగిలిపోతారు.

ఈ వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలు: ఫార్మల్, ఇన్ఫార్మల్. కులం, వివాహం, కుటుంబం, మతం మొదలైన ఇన్ఫార్మల్ వ్యవస్థలు స్థూలంగా సమాజం నుంచి ఉద్భవించినవి. కట్టుబాట్లు వీటికి ప్రాతిపదిక. నిర్దిష్ట కట్టుబాట్లను నిర్దేశించి వాటిని ఆచరించే ప్రక్రియలను కొందరి చేతులలో పెడుతుంది. ఇక్కడే మనకు సమాజం రెండుగా చీలిన పరిస్థితి కనిపిస్తుంది. అణచివేత మూలాలు ఈ కట్టుబాట్లలో కనిపిస్తాయి. ఎవరైతే వాటికి రూపకల్పన చేసారో చివరకు అవి వారిని కూడా మించినవిగా పరిణమిస్తాయి. దరిమిలా సమాజం ఇంకా చీలుతూనే ఉంది. అర్థం చేసుకోవల్సిన విషయం ఏమిటంటే, చీలిపోవడం అనేది మన చేతుల్లో లేదు. అయితే చీలి సహజీవనం ఎలా చేయాలి అనే చర్చ మనం చెయ్యట్లేదు. చీలకుండా ఏం చేయాలి అనే ఇంకా ఆలోచిస్తున్నాం.

రాజ్యాంగం ద్వారా నిర్మితమైన వ్యవస్థలు ఫార్మల్ వ్యవస్థలు. ఇవి రాజకీయ, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించినవి. రెవెన్యూ, న్యాయ, పోలీస్ విభాగాలు మొదలైనవి. ఈ వ్యవస్థల ఆవిర్భావ ఉద్దేశాన్ని పక్కన పెడితే, ఈ ఫార్మల్ వ్యవస్థలు చేస్తున్న పని ఏమిటంటే గ్రామ స్థాయిలో భూస్వామ్య వ్యవస్థను చెక్కుచెదరకుండా ఉంచడమే. ఆధునిక పరిపాలనా వ్యవహారాలలోకి భూస్వామ్య వ్యవస్థను అవి చాకచక్యంగా, అలవోకగా తీసుకువచ్చాయి. ఊరిలోని ‘కింది కులాల’ వారిలో వచ్చే వివాదాలు, కుటుంబ కలహాలు, దాయాదుల గొడవలు... ఇలా ఎలాంటి తగవులనైనా తీర్చుకోవడానికి తొలుత ఊరిలోని భూస్వామిని కలవడం జరిగేది. ప్రాంతాన్ని బట్టి ఈ భూస్వామి కులం మారుతుంది. ఇలా ‘మధ్యస్థాలు’ చేసే కులాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు అలా కాదు. మెుదటి మెట్టు టౌన్ పోలీస్ స్టేషనే.

ఈ మార్పు ఎలా జరిగింది? కింది కులాల వాళ్ళు క్రమంగా చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయంలో పనులు తగ్గడం... ఇత్యాది కారణాలతో ఊరు నుంచి బయటకు వెళ్లుతున్నారు. ఫలితంగా వాళ్ళ పరిధి పక్కనే ఉన్నటౌన్ వరకు పెరిగింది. పోలీసు, రెవెన్యూ, హాస్పిటల్, కోర్టు లాంటి కొత్త వ్యవస్థలతో పరిచయాలు పెరిగాయి. ఈ కొత్తగా వచ్చిన జ్ఞానం మూలాన ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీస్ స్టేషనుకు, ఎమ్మార్వో దగ్గరకు పరుగెత్తడం అలవాటు చేసుకున్నారు.

దీనివల్ల, కింది కులాలలో, ముఖ్యంగా మాదిగ, మాల, యానాది, ఎరుకుల, ఇంకా చేతి వృత్తుల వాళ్లలో చైతన్య శీలత పెరగడంతో పాటు, పోలీస్ స్టేషన్లు, రెవిన్యూ కార్యాలయాలలో పనిచేసే చాలామంది పై కులాలకు సంబంధించిన వాళ్లేనన్న అవగాహన కూడా ఏర్పడింది. దీనివలన వచ్చిన సమస్య ఏమిటో కూడా చూద్దాం. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన వెంకయ్య ఎదురుగానే ఎస్ఐ, ఆ వెంకయ్య ఊరిలో ఉన్న భూస్వామికి ఫోన్ చేసి, సమస్య పరిష్కారానికి వెంకయ్యని మళ్లీ వాళ్ళ ఊరికే పంపిస్తాడు. అంటే సమస్య పోలీస్ స్టేషన్ పరిధిలో పరిష్కారమవ్వకుండా తిరిగి గ్రామానికే వెళ్లుతుంది. అన్ని కేసుల్లోనూ కాకున్నా, 99శాతం ఇలాగే జరుగుతాయి. తిరిగి ఊరికి వెళ్లిన వెంకయ్యని ఉద్దేశించి ఆ భూస్వామి –‘ఎందుకురా, నన్ను కాదని స్టేషన్ల దాకా పోవడం, నేను తెగ్గొట్లేని సమస్యా ఏమిటీ’ అని ప్రశ్నించి ‘పోయి రెడ్డమ్మ సద్దన్నం పోస్తాది తాగి, అట్నే ఆ బర్రె గుడ్డుకు కుడితి పెట్టుబో’ అని ఒక పనిని విసిరేస్తాడు. ఆ విధంగా అతను, బాలగోపాల్ ఒక సందర్భంలో అన్నట్టు, ‘దొడ్డ దొర’ అయిపోతాడు. విధేయత, ప్యాట్రన్–క్లయింట్ సంబంధాలు మరింత శక్తిమంతంగా తయారవుతాయి. భూస్వామ్య పద్ధతులు పదిలంగా ఎందుకు వర్ధిల్లుతున్నాయి అంటే కులం అనే సామాజిక వ్యవస్థ, ఫార్మల్ వ్యవస్థల్లో భాగమైన రెవెన్యూ, పోలీస్, కోర్టుల నిరంతర కృషి వలనే. కుల వ్యవస్థను, కుల అసమానతలను ప్రామాణీకరించడంలో లాయర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు (ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు) ఎలాగైతే తోడ్పడుతున్నారో, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అగ్రకులాల్లో పేదలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించి కులవ్యవస్థను సుస్థిరపరిచే పనిని చేసింది. కుల అసమానతలను పెంచడానికి కావలిసిన శక్తిని 103వ రాజ్యాంగ సవరణ అగ్ర కులస్తులకు ఇచ్చింది. రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు తీర్పులు చాల సందర్భాలలో అసాధారణంగా ఉంటాయి. రాజ్యాంగం ప్రజలందరికి సమానత్వాన్ని, సమాన అవకాశాలను, సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేస్తే, న్యాయ వ్యవస్థ దాన్ని ఎప్పుడు సరిగా అర్ధం చేసుకోలేదు. సమాజంలో అన్ని వనరులు అగ్ర కులస్తుల చేతులలోనే ఉన్నాయి. అయినా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరిచింది.

రిజర్వేషన్ల కల్పన అనేది ఆర్థిక అంతరాలను కాకుండా సామాజిక అసమానతలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. ఆర్థిక సమస్యకు రిజర్వేషన్లు సమాధానం కానేకాదు. రిజర్వేషన్ల అంశాన్ని దానిపై సుప్రీంకోర్టు వైఖరికి సంబంధించి వివిధ సందర్భాలలో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించి, రిజర్వేషన్లను ప్రజాస్వామిక, సామాజిక కోణంలో చూసిన ఉద్యమకర్త–న్యాయవాది బాలగోపాల్ ‘ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు ఒకవేళ అగ్రకులాలలో పేదరికం ఉందని అనుకుంటే, ఆర్థికపరమైన సహాయం చేయాలి గాని రిజర్వేషన్ ఇవ్వడం పరిష్కారం కాదు’ అన్నారు. ‘కూటికి పేదనైనా కులానికి కాదు’ అనే నానుడి అగ్రకులస్తులలో ఇప్పటికీ బలంగా ఉంది. ప్రభుత్వోద్యోగి అయిన ఒక మాలకులస్తుని ముందు ఏమి లేని (ఉద్యోగం+సెంటు భూమి) ఒక రెడ్డి అజమాయిషీ చలాయిస్తాడు. ఇది ఎలా సాధ్యం అంటే పేరు వెనుక రెడ్డి ఉంది కాబట్టి. 10శాతం రిజర్వేషన్ ఇవ్వడం వలన అత్యున్నత న్యాయస్థానం అగ్రకుల అహంకారాన్ని పరిరక్షించిందని చెప్పాలి. అంటరానితనం, అసమానతలు, వివక్షలను ప్రామాణీకరించడంలో తగు రీతులలో వ్యవస్థల సహాయం తీసుకోవడం జరుగుతోంది. గ్రామాలలో ఉన్న అగ్రకులాల వ్యక్తులు అలాగే టౌన్లో ఉన్న ఉద్యోగులు, భూస్వామ్య పద్ధతులను, కుల కట్టుబాట్లను బలపరిచే ప్రక్రియలో భాగంగా వ్యవస్థల సహకారం తీసుకుంటారు. సుప్రీంకోర్టు నిర్ణయంలో మనం చూస్తున్నది ఇక్కడ వ్యవస్థే తనకు తానుగా ముందుకు వచ్చి సహాయం చేయడం. ఐదుగురు సభ్యుల బెంచిలో మాజీ చీఫ్ జస్టిస్ లలిత్, ఇంకొకరు కలిసి మైనారిటీ తీర్పును ఇవ్వడం కొంతలో కొంత నయం. వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు కొంతవరకు ఆశని కల్పించాయి.

సతీష్ చెన్నూర్

Updated Date - 2022-12-17T01:24:20+05:30 IST