విచ్ఛిన్నం దిశగా వికేంద్రీకరణ!
ABN , First Publish Date - 2022-04-12T05:58:55+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి వికేంద్రీకరణ దిశగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. మొదటగా– 2019 ఆగస్టులో, ప్రభుత్వ సేవలను పథకాలను గ్రామీణ–పట్టణ ప్రాంత ప్రజలకి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి వికేంద్రీకరణ దిశగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. మొదటగా– 2019 ఆగస్టులో, ప్రభుత్వ సేవలను పథకాలను గ్రామీణ–పట్టణ ప్రాంత ప్రజలకి అందజేయాలనే ఆలోచనతో గ్రామ–వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టింది. ఒక సంవత్సరం తర్వాత, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ప్రవేశపెట్టింది. రెండవది– ఆగస్టు 2020లో, ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం 2020’ ద్వారా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తూ మూడు రాజధానులను ప్రకటించింది. అయితే, నవంబర్ 2021లో ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని, మెరుగైన సమగ్రమైన చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. మూడవది– జనవరి 2022లో, ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది.
ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఈ మూడు వికేంద్రీకృత విధానాలు అభివృద్ధిపరంగా, పాలనాపరంగా ప్రజలకు ఎంతవరకూ మేలు చేయగలవు అనే విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ, పాలన, ఇంకా ఆర్థిక అధికారాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న వ్యవస్థలకు బదిలీ చేయడాన్ని వికేంద్రీకరణ అంటారని నిపుణులు చెబుతున్నారు. నిర్ణయాధికారంలోనూ, సమాజ సాధికారతలోనూ, ప్రజాస్వామ్యీకరణ ప్రక్రియలోనూ ప్రజలని భాగస్వామ్యులు చేయడం వికేంద్రీకరణలో కీలకమయిన అంశం. ఎందుకంటే, అధికారాల బదలాయింపు సమాజ ప్రయోజనాల కోసం, మరీ ముఖ్యంగా అట్టడుగున ఉన్న మహిళలు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల వారి ప్రయోజనాల కోసం జరుగుతుంది.
ఏపీ ప్రభుత్వం గ్రామ–వార్డు సచివాలయాలను ఒక స్వతంత్ర, సమాంతర వ్యవస్థగా రూపొందించింది. ఎందుకంటే, ఇది ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కౌన్సిళ్లకు బాధ్యత వహించదు. ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. విద్య, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, మహిళా రక్షణ, సాంఘిక సంక్షేమం మొదలైన రంగాల్లో పౌరులకు సేవలను అందించడానికి 15,005 సచివాలయాలకి గాను 1.25 లక్షల మంది గ్రామ సచివాలయ సిబ్బందిని ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరు స్థానికంగా ఎన్నికైన సంస్థలకి కాకుండా, నేరుగా ముఖ్యమంత్రి పేషీకి బాధ్యత వహిస్తారు. గుర్తింపు కార్డులు, సంతకాలు, పింఛను సొమ్ము పంపిణీకి సంబంధించిన ఫిర్యాదులు, రికార్డుల వెరిఫికేషన్ మొదలైన వాటి కోసం ప్రజలు ఇప్పుడు స్థానిక రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, రెవెన్యూ తదితర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇది మంచి పరిణామం. అయితే, ఇది ప్రజలకు సాధికారతని కల్పించే విధంగానూ, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపుకి దోహదపడే విధంగానూ ఉందా? లేదు.
ఇక రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాను సులభతరం చేయడం కంటే మరిన్ని కొత్త అడ్డంకులను సృష్టిస్తున్నాయి. ఎందుకంటే, ఈ కేంద్రాలు ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని కంపెనీల వ్యవసాయ ఇన్పుట్లను మాత్రమే నిల్వ చేస్తున్నాయి. రైతులు వీటిని మాత్రమే కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా రైతులు మాకు వెల్లడించారు. ఇంతకుముందు, స్థానిక డీలర్లు ఈ ఇన్పుట్లను అప్పు రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా నిర్దిష్ట కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నది. పైగా నగదు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఇన్పుట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందువల్ల చిన్న, సన్నకారు, కౌలు రైతులకి ఈ కేంద్రాల వద్ద ఇన్పుట్ ఎంపికకు పెద్దగా ఆస్కారంగానీ, కొనుగోలుకి వెసులుబాటుగానీ లేకుండాపోయింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికీ, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల్లో ఎంట్రప్రెన్యూర్షిప్నీ ప్రోత్సహించడానికి రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, పీ అండ్ జీ, ఐటిసి వంటి కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా, రిలయన్స్ కంపెనీ తన కొన్ని సర్వీసులని గ్రామ సచివాలయాల ద్వారా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి గమనిస్తుంటే, ఈ విధానాలన్నీ కార్పొరేట్లు సునాయాసంగా పల్లెల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసేందుకా అన్న ప్రశ్న తలెత్తకమానదు.
మూడు ప్రాంతాల అభివృద్ధి, మరీ ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి పేరిట, ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల వికేంద్రీకరణ ప్రక్రియను సమర్థించుకుంది. అయితే, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూసమీకరణలో భాగమై ఉన్న చిన్న సన్నకారు రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందో ప్రస్తుత ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పడంలేదు. ఈ పరిస్థితుల వలన, రాజధాని ప్రాంతంలో ఉన్న కౌలుదార్లు, భూముల్లేని దళితులు, వ్యవసాయ కూలీలైన స్త్రీలు ఎక్కువగా నష్టపోయారు. ఇప్పటికే నిర్వాసితులైన రైతులు, జీవనోపాధి కోల్పోయిన రోజువారీ కూలీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోగా, వారి నిరసనల్ని అణచివేయడం ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులకి సంకేతం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో భూ బదిలీలకు– అంటే అమ్మకాలకు, ఆక్రమణలకు, కొనుగోళ్లు, తనఖాలకు, భూ సమీకరణకు విశాఖపట్నం కేంద్రంగా మారింది. ఏపీ ప్రభుత్వం కొండలను దూకుడుగా ఆక్రమించుకోవడం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టడం, విశాఖపట్నం కొత్త గ్రోత్ ఇంజనుగా మారుతున్నదనే సాకుతో భూ లావాదేవీలను సులభతరం చేయడం చూస్తుంటే, టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు దూరమైన వారంతా ఇప్పుడు విశాఖపట్నాన్ని ప్రత్యామ్నాయ ‘అభివృద్ధి నమూనా’గా ఎంచుకున్నారా అన్న అనుమానం కలగక మానదు. అంతేగాక– ఉపాధి కల్పించే కార్యకలాపాలపై, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూరేలా భూ ఒప్పందాలు చేయడం, ‘పేదలకు ఇళ్ల స్థలాల’ పేరుతో దళితుల నుంచి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలన్నీ ప్రభుత్వ అసమగ్ర ఆర్థిక విధానాలకు అద్దం పడుతున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు విధానంలో కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలనే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదికగా చేసుకోవడమే ఒక ప్రధాన తప్పిదం. విస్తృత ప్రజా సంప్రదింపులతో, ప్రతి ప్రాంత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతలు, సహజ వనరులు, నీటిపారుదల సౌకర్యాలను పరిగణించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేసి ఉండాల్సింది. అలాగే, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అందరికీ భౌగోళిక సామీప్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాల ప్రధాన కార్యాలయాన్ని నిర్ణయించాల్సింది. ఇప్పుడు ఎంచుకున్న విధాన ఫలితంగా రాష్ట్రంలో అనేక ప్రదేశాలు ప్రతిపాదిత జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి గణనీయమైన దూరంలో ఉన్నాయి. పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 (పెసా), అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన గ్రామసభలకు ఉన్న సార్వభౌమాధికారాన్ని కొత్త జిల్లాల ప్రక్రియలో పరిగణలోకి తీసుకోలేదు. అందుకే, కొత్త జిల్లాల ఏర్పాటు తమ హక్కులను కాలరాస్తుందని ఆదివాసీలు భయపడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకోసం అవసరమయ్యే కొత్త కొత్త నిర్మాణాల వలన భూ సేకరణలు, రియల్ ఎస్టేట్ మార్కెట్, భూమి విలువ పెరగడం వంటివి ఊపందుకుంటాయి. పర్యవసానంగా, ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురవుతాయి. ఇది మరో సమస్య.
ప్రజాస్వామ్యయుతంగా వికేంద్రీకరణ జరపటమన్నది ఖచ్చితంగా అవసరం. అది సాధ్యమే కూడా. అయితే అది ప్రాంతీయ అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ సమతుల్యతని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పరిచే ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కార్పొరేట్లకు, రియల్ ఎస్టేట్ వ్యక్తులకి, రాజకీయంగా లబ్ధిపొందాలని చూసే ఉన్నత కులాల, వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడే అభివృద్ధి నమూనాల వల్ల ప్రయోజనం లేదు. అన్ని వర్గాల, కులాల, ప్రాంతాల ప్రజలను కలుపుకుపోయే విధంగా ప్రణాళికలు రచిస్తే అది మాత్రమే సరైన వికేంద్రీకరణకు దోహదం చేస్తుంది.
పురేంద్ర ప్రసాద్, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్
వంశీ వకుళాభరణం, యూనివర్సిటీ అఫ్ మాస్సాచుసెట్స్