‘ఆర్థిక’ ఉష్ట్ర పక్షులు
ABN , First Publish Date - 2022-10-29T02:09:12+05:30 IST
మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులపై ఒక వ్యాసం రాయమని మిమ్ములను ఆహ్వానిస్తే మీరు ఏ అంశాలను ఎంపిక చేసుకుంటారు?
మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులపై ఒక వ్యాసం రాయమని మిమ్ములను ఆహ్వానిస్తే మీరు ఏ అంశాలను ఎంపిక చేసుకుంటారు? ప్రజలను అమితంగా కలవరపరుస్తున్న సమస్యల పైనే మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేసి, వాటికి పరిష్కారాలు కూడా తప్పక సూచిస్తారు కదా. మరి ఇప్పుడు మన ఆమ్ ఆద్మీలను ఎనలేని ఆందోళనకు గురి చేస్తున్నవేమిటో మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవి: నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.
ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తున్న పరిణామాలపై భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలా నెలా ఒక సమీక్షను ప్రచురిస్తుంది. ఆ సమీక్షకు ఒక వ్యాసాన్ని రాయమని ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానాన్ని అందుకున్న ఆరుగురు యువ, ఉత్సాహపూరిత ఆర్థికవేత్తలు నిరుద్యోగం, పోషకాహార లోపం, ఆకలి, పేదరికం ఇత్యాది పదాలను ఉపయోగించక పోవడమనేది తమ మేధో కర్తవ్యాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడమే. ఈ విషయం ఆ యువ ఆర్థికవేత్తలకూ బాగా తెలుసు. అయితే వారు ఆ విషయాన్ని బాహాటంగా అంగీకరించరు.
నెలవారీ ఆర్థిక సమీక్ష ఒక విలువైన పత్రం. 2022 సెప్టెంబర్ ‘సమీక్ష ’ (అక్టోబర్ 22న విడుదల చేశారు) ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతుల గురించి నిష్పాక్షికంగా విశ్లేషించి, ఆర్థిక వ్యవస్థ బల దౌర్బల్యాలను విపులీకరించగలదని; రాబోయే 6 నుంచి 12 నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని సూచించగలదని; దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించగలదని; ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తాజా ధోరణులు, పరిణామాలపై దృష్టి సారించి, దేశీయ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని అంచనా వేయగలదని నేను భావించాను. 33 పేజీల సెప్టెంబర్ ‘సమీక్ష’లో అనేక చార్ట్‌లు, గ్రాఫ్‌లు మూడు పేజీల డేటా ఉన్నది. ఆరు భాగాలుగా ఉన్న సమీక్షను ఆర్థిక వ్యవస్థ భావి గమనంపై దృక్పథంతో ముగించారు. ‘సమీక్ష’లోని ఆరుభాగాలు : కోశ పరిస్థితి, పరిశ్రమలు, సేవలు, పరపతి డిమాండ్, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం. ప్రస్తావిత అంశాలపై ప్రభుత్వ ఆందోళనలను ‘సమీక్ష’ వెల్లడించింది. ఈ ‘సమీక్ష’ నుంచి మనం గ్రహించేది ఏమిటి? ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తున్న సమస్యలలో నిరుద్యోగం, పోషకాహారలోపం, ఆకలి, పేదరికం లేవనే కాదూ?
పన్నుల రాబడి ఉల్లాసకరంగా ఉందని, మూలధన వ్యయాలు పెరుగుతున్నాయని, వ్యయాల నాణ్యత మెరుగుపడిందని, కోశ పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని ఆ ‘సమీక్ష’ పేర్కొంది. ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ప్రజా రుణాన్ని భారీ స్థాయిలో పెరిగిపోవడానికి దారితీస్తుందనే సత్యాన్ని అనిష్టంగానే అయినప్పటికీ అంగీకరించక తప్పలేదు. పరిశ్రమల విషయమై పలు సూచీలను ఈ ‘సమీక్ష’ సూచించింది పిఎమ్ఐ మాన్యుఫాక్చరింగ్, ఎస్ అండ్ పిజిఎస్‌సిఐ ఇండస్ట్రియల్ మెటల్ ఇండెక్స్, బిజినెస్ అస్సెస్మెంట్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మొదలైన వాటిని ఉటంకించి మొత్తం మీద బిజినెస్ సెంటిమెంట్ బాగా మెరుగుపడిందని ముక్తాయింపు నిచ్చింది. సేవల విషయానికి వస్తే అంతర్ రాష్ట్ర వాణిజ్యం, పర్యాటకం, హోటల్ ఇండస్ట్రీ, పౌర విమానయానం, రవాణా, రియల్ ఎస్టేట్ మొదలైన రంగాల పురోగమనం ప్రశస్తంగా ఉందని ‘సమీక్ష’ పేర్కొంది. సేవల రంగం దేశ ఆర్థికాభివృద్ధి చోదక శక్తిగా ఆవిర్భవించనున్నదని జోస్యం చెప్పింది.
పరపతి డిమాండ్ ఆరోగ్యకరంగా పెరుగుతోందని, అయితే ద్రవ్య విధానం, మందగించిన ఆర్థికాభివృద్ధి ఆ పెరుగుదలకు ఆటంకమయ్యే అవకాశముందని ‘సమీక్ష’ పేర్కొంది. ద్రవ్యోల్బణం విషయమై ‘సమీక్ష’ పక్షపాత వైఖరి తేటతెల్లంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదని, ‘అంతర్జాతీయ రాజకీయ పరిణామాలే’ అందుకు ప్రధాన కారణమని పేర్కొంది. విదేశీ వాణిజ్యం విషయంలో ‘సమీక్ష’ మిశ్రమంగా ఉంది. ఎగుమతులు నిలకడగా ఉన్నాయంటూ తనను తాను అభినందించుకుంది. దిగుమతులు సుస్థిరంగా ఉన్నాయంటూ నిస్సహాయత్వాన్ని వ్యక్తీకరించింది. కరెంట్ ఖాతా లోటు పెరుగుదలను నిలువరించాలని, స్థూల దేశియోత్పత్తిలో అది 3 శాతంగా ఉండగలదని అంచనా వేసింది. అయితే జీడీపీలో 3.4 శాతం మేరకు కరెంట్ ఖాతాలోటు పెరిగిపోవచ్చని అభిప్రాయపడింది.
పక్షపాత వైఖరితోను, స్వీయ అభినందనలతో నిండిపోయి ఉన్న ఈ ‘సమీక్ష’ను క్షమించవచ్చు. ఎందుకంటే అది మరికొద్ది వారాల్లో చరిత్రలో కలిసిపోతుంది. అయితే కోట్లాది ప్రజల జీవితాలకు సంబంధించిన విషయాలపై నిర్లక్ష్య వైఖరి చూడం ఎంతైనా ఆగ్రహాన్ని కలిగిస్తోంది. బ్రిటన్ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన రోజునే రిషి సునాక్ ‘తీవ్ర ఆర్థిక సంక్షోభం’ విరుచుకుపడనున్నదని హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ సైతం చైనా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత సజావుగా లేదని చెప్పారు.
2020 సంవత్సరంలో భారతదేశ జనాభాలో 22.80 కోట్ల మంది ‘పేద ప్రజలు’ అని ఈ నెల 17న విడుదల అయిన యుఎన్‌డిపి మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది (కొవిడ్ ఉపద్రవంలో ఆ పేదల సంఖ్య మరింతగా పెరిగిపోయిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు). గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకున్న 121 దేశాలలో భారత్ 107వ స్థానంలో ఉంది. మొత్తం భారతీయులలో 16.3 శాతం మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. 35.5 శాతం మంది బాలల ఎదుగుదల వయస్సుకు అనుగుణంగా లేదు.
నిరుద్యోగిత 8.2 శాతం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఐదు వేల లోపు ఉన్న గ్రేడ్ ‘సి’ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షలాది అభ్యర్థులు పోటీపడ్డారు. లిఖిత పరీక్ష రోజున పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. కేవలం ఒక్క రాష్ట్రంలోనే పట్టభద్రులలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఇది తెలియజేస్తోంది. నిరుద్యోగ భూతం నుంచి లక్షలాది మందికి భద్రత కల్పించింది గ్రామీణ ఉపాధి హామీ పథకం. మరి 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఉపాధికోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 40 శాతం మందికి ఒక్క రోజు పని కూడా కల్పించలేకపోయారు. నిరుద్యోగం, పోషకాహారలోపం, ఆకలి, పేదరికం సమస్యల భారినపడి విల విల లాడిపోతున్న వారిపట్ల ఈ సమీక్ష’ నామమాత్ర సానుభూతి కూడా చూపలేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, సంరక్షణ విధానాలు, వడ్డీరేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలతో దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నాయనే వాస్తవాన్ని సైతం అది అంగీకరించలేదు.
గత శనివారం నాడు (అక్టోబర్ 22) దేశ ఆర్థిక వ్యవస్థ గురించి హెచ్చరిస్తూ ‘వేడుకలకు, నిశ్చింతకు ఇది సమయం కాదని’ ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అయితే ‘సమీక్ష’ ఇందుకు పూర్తిగా విరుద్ధ వైఖరి ప్రదర్శించింది. అక్టోబర్ 22 ఉదయం, సాయంత్రం మధ్య ఏం జరిగింది? ఏ మార్పు సంభవించింది? నా ఆశ్చర్యానికి అంతు లేదు.
పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)