నవ భావాలు రగిలించిన నల్లనయ్య
ABN , First Publish Date - 2022-12-31T01:33:32+05:30 IST
భావాలను బట్వాడా చేయడంలో వార్తాపత్రికల కాలమిస్ట్‌లకు సాధారణంగా స్వేచ్ఛ ఉంటుంది. చెప్పదలచిన విషయాన్ని సులభంగా, సుబోధకంగా చెప్పేందుకు వారు తమ సొంత మాటలను ఎంపిక చేసుకుంటారు.
భావాలను బట్వాడా చేయడంలో వార్తాపత్రికల కాలమిస్ట్‌లకు సాధారణంగా స్వేచ్ఛ ఉంటుంది. చెప్పదలచిన విషయాన్ని సులభంగా, సుబోధకంగా చెప్పేందుకు వారు తమ సొంత మాటలను ఎంపిక చేసుకుంటారు. అయితే ఆ మాటల సమాహారానికి శీర్షిక అరుదుగా మాత్రమే రచయిత నిర్ణయించినదై ఉంటుంది! ఒక వ్యాసానికి శీర్షికను నిర్ణయించడమనేది వార్తాపత్రిక సంపాదక వర్గ సభ్యుల విశేషాధికారం. ఆ వ్యాసాన్ని చదివేలా పాఠకులలో ఉత్సుకతను కలిగించేందుకై వ్యాస మకుటం ఎలా ఉండాలనే విషయమై మెరుగైన అవగాహన తమకు మాత్రమే సొంతమని పాత్రికేయులు భావిస్తారు. వారి విశ్వాసం నిరాధారమైనదేమీ కాదు. నాలుగు దశాబ్దాల నా పత్రికా రచన వ్యాసంగంలో నేను అమితంగా ఇష్టపడిన ఒక శీర్షికను (ఇప్పుడు ఆగిపోయిన) ‘సండే అబ్జర్వర్’లో ఒక సబ్–ఎడిటర్ పెట్టాడు. ట్రినిడాడియన్ రచయిత, రాజకీయ క్రియాశీలి సిరిల్ లియోనల్ రాబర్ట్ జేమ్స్ గురించిన వ్యాసమది. దానికి ఆ సబ్–ఎడిటర్ పెట్టిన శీర్షిక ‘బ్లాక్ ఈజ్ బౌంటిఫుల్’.
సిఎల్ఆర్ జేమ్స్ 89 ఏళ్ల వయస్సులో లండన్‌లో చనిపోయిన అనంతరం 1989 జూన్‌లో ఆ వ్యాసం ప్రచురితమయింది. జేమ్స్ రచనలు, అమెరికన్ చరిత్రకారుడు పాల్ బహ్లే రచించిన ఆయన జీవిత చరిత్ర ఆధారంగా నేను ఆ వ్యాసాన్ని రాశాను. క్రికెట్ సామాజిక చరిత్రపై జేమ్స్ అద్భుత పుస్తకం ‘బియాండ్ ఎ బౌండరీ’ ద్వారా నేను ఆ వెస్టీండీస్ నల్లనయ్యను కనుగొన్నాను. నేను ఆ పుస్తకాన్ని తొలుత మా కళాశాల గ్రంథాలయంలో చదివాను. ఆ తరువాత 1978 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ద్వితీయ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో దాన్ని చూశాను. మీరు నమ్ముతారో లేదో గానీ కేవలం నాలుగంటే నాలుగు రూపాయలకే ఆ పుస్తకాన్ని స్వంతం చేసుకున్నాను. ఆ ప్రతి ఇప్పటికీ నా వద్ద ఉన్నది. అదేమీ తొలి ఎడిషన్ ప్రతి కాదు. అయినప్పటికీ నా బుక్ సెల్ఫ్ మీద ఉన్న పుస్తకాలు చాలా వాటి కంటే జేమ్స్ ‘బౌండరీ’కే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను.
జేమ్స్ కేవలం క్రికెట్ రచయిత మాత్రమే కాదు సుమా! సామాజిక చరిత్ర రచనలో ఆయన ఒక నవభావ పథ నిర్దేశకుడు. ఫ్రెంచ్ విప్లవం వెన్వెంటనే హైతీలో సంభవించిన బానిసల తిరుగుబాటుపై ఒక సుప్రసిద్ధ పుస్తకాన్ని ఆయన వెలయించారు. ట్రినిడాడ్‌లో పుట్టి పెరిగిన జేమ్స్ చాలా సంవత్సరాలు అమెరికాలో గడిపాడు. మార్క్సిస్టు రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేవారు బ్రిటన్‌లోనూ ఆయన చాలాకాలం నివసించారు. ఆఫ్రికాలో స్వాతంత్ర్యోద్యమాలను ఆయన నిశితంగా గమనిస్తుండేవారు.
ఐదు దశాబ్దాలుగా సిఎల్ఆర్ జేమ్స్‌ను చదువుతున్నాను, ఆయన గురించీ చదువుతున్నాను. జేమ్స్ జీవితంలో అమెరికా దశ గురించి పాల్ బహ్లే చాలా ఆలోచనాత్మకంగా రాశారు. అయితే జేమ్స్ క్రికెట్ రచనా వ్యాసంగంపై బహ్లే విశ్లేషణ చాలా పేలవంగా ఉన్నది (ఇది సహజం, ఎందుకంటే బహ్లే అమెరికన్ కదా). జేమ్స్ మేధో కృషిపై పలువురు విద్యావేత్తలు రాసిన పుస్తకాలు, వ్యాసాలు కూడా ఎన్నో చదివాను. ‘వలసపాలనయుగానంతర విమర్శకుడు’గా జేమ్స్‌ను అభివర్ణిస్తున్న ఆ పుస్తకాలు, వ్యాసాలు చాలవరకు పడికట్టు పదజాలంతో నిండిపోయినవే. మరింత స్పష్టంగా చెప్పాలంటే నిస్సారమైనవి. ఒకే ఒక్క భారతీయుడు –ఫరూఖ్ ధోండే– రాసిన పుస్తకం కూడా స్ఫూర్తిదాయకంగా లేదు.
జేమ్స్ వ్యక్తిగత జీవితం, మేధో వ్యాసంగాలు, ప్రజాహిత కార్యకలాపాల గురించి సమగ్రమైన పుస్తకం ఒకటి ఎట్టకేలకు ఇటీవలే ప్రచురితమయింది. ఆ ప్రతిభావంతుడికి పూర్తి న్యాయం చేసిన ఆ జీవిత చరిత్ర రచయిత జాన్ విలియమ్స్. ఇంగ్లాండ్, అమెరికాలలోని చారిత్రక పత్రాల భాండాగారాలలో విస్తృతంగా పరిశోధించడంతో పాటు, సజీవులుగా ఉన్న జేమ్స్ సమకాలికులను ఇంటర్వ్యూ చేసి సమకూర్చుకున్న అపార సమాచారం ఆధారంగా ‘సిఎల్ఆర్ జేమ్స్ : ఎ లైఫ్ బియాండ్ ది బౌండరీస్’ అనే పుస్తకాన్ని వెలువరించిన విలియమ్స్ అన్ని విధాల అభినందనీయుడు.
విశేషమేమిటంటే జేమ్స్ జీవిత కథలోని ప్రతి ఒక్కరి గురించి విలియమ్స్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ట్రినిడాడ్‌లో యవ్వనకాలపు స్నేహితులతో పాటు ప్రేయసీమణులు, భార్యలు, రాజకీయ సహచరులు, ఇంగ్లాండ్, అమెరికా, ఆఫ్రికా, వెస్టీండీస్‌లో విరోధుల గురించి కూడా విలియమ్స్ వివరంగా రాశారు. క్రికెటర్ లీయరీ కాన్ స్టాంటైన్, విప్లవకారుడు లియోన్ ట్రాట్‌స్కీ, ట్రినిడాడ్ రాజనీతిజ్ఙుడు ఎరిక్ విలియమ్స్ గురించి సంవేదన శీలతతో విలియమ్స్ రాశారు. జేమ్స్ పట్ల ఆయన జీవిత చరిత్రకారుడికి అపార సానుభూతి ఉన్నది. అయితే వీరారాధన ఎంత మాత్రం లేదు. అమెరికాలో ఉండగా జేమ్స్ సభ్యుడుగా ఉన్న వామపక్ష సంఘాల పాక్షికతత్వం గురించి ఆయన తీవ్రంగా విమర్శించారు. పలువురు మహిళలతో జేమ్స్ సన్నిహిత సంబంధాల గురించి కూడా ఆయన నిర్మొహమాటంగా రాశాడు.
జేమ్స్ ప్రతిభావంతుడు అయిన రచయిత మాత్రమే కాదు, మంచి వక్త కూడా. 1930ల్లో లండన్‌లోని కమ్యూనిస్ట్ సర్కిల్ వ్యవహారాల గురించి జేమ్స్ సన్నిహితురాలు ఒకరు ఇలా రాశారు: ‘జేమ్స్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ప్రతీ ఒక్కరూ మంత్రముగ్ధులై మౌనం వహించి శ్రద్ధగా వినేవారు. ఆయన ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి’. ప్రచురణకర్త ఫ్రెడరిఖ్ వార్బర్గ్ తన రచయిత (ఇంకెవరు? జేమ్స్!) గురించి ఇలా రాశారు: ‘నాకు తెలిసిన వారిలోకెల్లా జేమ్స్ చాలా ప్రతిభావంతుడు. అందరినీ ఆకట్టుకునేవాడు. సదా సంతోషంగా ఉండేవాడు. ఇతరులనూ ఆనందపరిచేవాడు. జేమ్స్ జ్ఞాపకశక్తి అసాధారణమైనది. మార్క్సిస్టు సిద్ధాంత మూలగ్రంథాల నుంచి పేరాలకు పేరాలు ఉటంకించడమే కాదు, షేక్‌స్పియర్ నాటకాల నుంచి కూడా సుదీర్ఘ ఉటంకింపులు చేసేవాడు. మంచి బట్టలు, రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడేవాడు. అందగత్తెల విషయంలో ప్రత్యేక ఆసక్తిచూపేవాడు. వర్గపోరాట యోధుడు, సందేహం లేదు. అయితే తన విశ్వాసాలకు విరుద్ధంగా వ్యవహరించేవాడు. తన వ్యక్తిత్వంలోని ఈ వైరుధ్యంపై అతడిలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తమయ్యేదికాదు’.
1934 మార్చిలో ఇంగ్లాండ్‌లోని నెల్సన్ అనే పట్టణంలో జేమ్స్ ఒక ఉపన్యాసాన్ని వెలువరించాడు. అందులో నల్ల జాతి వారిపట్ల ఫ్రెంచ్, బ్రిటిష్ ప్రజల వైఖరులను నిశితంగా విశ్లేషించాడు. బ్రిటిషర్ల వైఖరికంటే ఫ్రెంచ్ ప్రజల దృక్పథం మానవతాపూర్వకమైనదని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘బ్రిటన్‌లో సామాన్య ప్రజలు నీగ్రోను అర్థం చేసుకోలేదు. నల్లజాతివారు తమకంటే తక్కువ స్థాయివారు అని వారు భావిస్తారు. ఫ్రాన్స్‌లో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నం. ఫ్రెంచ్ కేబినెట్‌లో నీగ్రోలు ఉన్నారు. రిటైర్డ్ జనరల్స్, అడ్మిరల్స్‌లో కూడా వారు ఉన్నారు. విశ్వవిద్యాలయాలు, వివిధ వృత్తులలో కూడా నల్లజాతివారు పెద్దసంఖ్యలో ఉన్నారు’. తొమ్మిది దశాబ్దాల అనంతరం ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఒకనాడు తమ సామ్రాజ్య ప్రజలుగా ఉన్న ఆఫ్రికన్, ఆసియా దేశాల వారిని తమ సమాజంలో సమ్మిళితపరచుకోవడంలో ఫ్రాన్స్ కంటే బ్రిటనే చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు.
జేమ్స్ గొప్ప రచనలలో ఒకటైన ‘బ్లాక్ జాకోబిన్స్’ గురించి విలియమ్స్ ఇలా వ్యాఖ్యానించాడు: ‘హైతియన్ విప్లవం గురించిన తన కథనాన్ని ఒక చరిత్రగానూ, భావి విప్లవాలకు ఒక నమూనాగానూ జేమ్స్ ఉద్దేశించాడు’. ఇక ‘బియాండ్ ఎ బౌండరీ’ గురించి రాస్తూ ఆ పుస్తక రచనా సంకల్పం, అది ఏమి చెప్పదలిచిందీ, పాఠకులు ఎలా ఆదరించిందీ మొదలైన విషయాలను విపులంగా వివరించాడు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు సాహిత్యంలా కంటే పాత్రికేయంగా ఉంటాయని విలియమ్స్ అభిప్రాయపడ్డాడు. అయితే భావాలే ఆ పుస్తకం విశిష్టత అని అంగీకరించాడు. ‘ఒక మహోపన్యాసం లేదా ఒక ధార్మిక ప్రవచనం ప్రభావాన్ని అది పాఠకులపై నెరపుతుందనడంలో సందేహం లేదు. రచయిత ప్రతిభకు అది ఒక ఉత్కృష్ట తార్కాణం. జేమ్స్ హృదయమూ, ఆత్మా అందులో పరిపూర్ణంగా వ్యక్తమయ్యాయని’ విలియమ్స్ రాశాడు.
విలియమ్స్ తన పుస్తక రచన ముగిస్తున్న సమయంలోనే అమెరికాలోనూ, ఇతర దేశాలలోనూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఆరంభమయింది. జేమ్స్ భవిష్య జ్ఞానానికి ఆ ఉద్యమం ఒక యాదృచ్ఛిక రుజువు అని విలియమ్స్ పేర్కొన్నాడు. వర్గభావనతో పాటు అస్తిత్వాల ప్రాధాన్యం, వ్యవస్థపై నిమ్న వర్గాల నుంచి వచ్చే తిరుగుబాటు, రాజకీయ పోరాటాలలో నల్లజాతి ప్రజలు, మహిళలు, యువజనులు నాయకత్వ పాత్ర వహించడం మొదలైన అంశాలపై జేమ్స్ ప్రతిపాదించిన భావాలు క్రమంగా రాజకీయ చింతనలో అగ్ర ప్రాధాన్యం పొందాయని’ విలియమ్స్ అన్నారు. సిఎల్ఆర్ జేమ్స్ జీవితంపై జాన్ ఎల్ విలియమ్స్ ప్రతిభావంతమైన రచన, అంతకుముందు ఆ ట్రినిడాడియన్‌పై వచ్చిన మరే పుస్తకం కంటే ఉత్కృష్టమైనది. ఇక, భవిష్యత్తులో వచ్చే మరే జేమ్స్ జీవితచరిత్రను నేను చదవాల్సిన అవసరం ఉంటుందని కూడా భావించడం లేదు. అయితే ‘బియాండ్ ఎ బౌండరీ’ని ఇంతకు ముందు వలే ఇకపై కూడా ప్రతి సంవత్సరమూ తప్పక చదువుతూనే ఉంటాను.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)