పాత్రికేయంలో సోక్రటిక్ సంవాదం
ABN , First Publish Date - 2022-11-05T01:15:53+05:30 IST
నాజీవనయానంలో పలువురు ప్రముఖులను కలుసుకున్నాను. విద్వజ్ఞులు, సాహితీవేత్తలు, కళాభిజ్ఞులు, క్రీడాకారులు, వైజ్ఞానికులు, వ్యవస్థా నిర్మాణ దక్షులు, రాజకీయ నాయకులు, ప్రజాహిత క్రియాశీలురుగా..
నాజీవనయానంలో పలువురు ప్రముఖులను కలుసుకున్నాను. విద్వజ్ఞులు, సాహితీవేత్తలు, కళాభిజ్ఞులు, క్రీడాకారులు, వైజ్ఞానికులు, వ్యవస్థా నిర్మాణ దక్షులు, రాజకీయ నాయకులు, ప్రజాహిత క్రియాశీలురుగా తమను తాము ప్రసిద్ధపరచుకున్న వారెందరో నాకు సుపరిచితులు. తమకొక విశిష్ట ప్రాధాన్యమున్నదని విశ్వసించని వ్యక్తి వారిలో ఒక్కరూ లేరు. జీవితంలో తమ పురోగతి గురించి వారిలో కొంతమంది చాలా గొప్పగా చెప్పుకోవడం కద్దు. మరికొంత మంది వినయంగానే ప్రగల్భాలకు పోతారు లేదా ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారు. మీరు కలిసిన తొలిసారే తమ స్వీయ ప్రాముఖ్యతను చాటుకోవడం వారిలో ప్రతి ఒక్కరికీ అలవాటు. నాకు తెలిసిన వందలాది విఖ్యాతులలో ఇద్దరు మాత్రమే అందుకు మినహాయింపు. వారిలో ఒకరు క్రికెటర్ జి.ఆర్. విశ్వనాథ్ కాగా మరొకరు గత నెల 28న కీర్తిశేషుడైన బ్రిటిష్ జర్నలిస్ట్ ఇయాన్ జాక్.
విశ్వనాథ్ వలే అద్భుతమైన వృత్తి నైపుణ్యాన్ని వ్యక్తిగత సౌశీల్యంతో మేళవించిన వ్యక్తి ఇయాన్. తన తరంలో గొప్ప కాలమిస్ట్, విశిష్ట సాహితీ సంపాదకుడు అయిన ఇయాన్ మంచి స్నేహశీలి, దయా గుణ సంపన్నుడు. ఇయాన్ జాక్‌ను చదవడం ఒక అపరిమిత ఆహ్లాదకర అనుభవం; ఆయన తెలిసి ఉండడం ఒక ఆనందప్రదమైన విషయమూ అంతకు మించి ఒక గౌరవమూ; కుటుంబ నేపథ్యంతో స్కాటిష్ జాతీయుడూ స్వభావ రీత్యా బ్రిటిష్ బుద్ధిజీవి. భారత్‌తో ఆయనకొక విలక్షణ అనుబంధం ఉన్నది. భారతీయ సంస్కృతిలో ఇయాన్ శ్రద్ధాసక్తులు ప్రత్యేకమైనవీ విస్తృతమైనవీనూ. 1970లలో ‘సండే టైమ్స్’ విలేఖరిగా ఇయాన్ తొలిసారి ఈ దేశానికి వచ్చారు. తదాది ఆయన మళ్లీ మళ్లీ ఇక్కడకు వచ్చారు.
ఇయాన్ సన్నిహిత స్నేహితులలో ఇరువురు భారతీయులు ఉన్నారు. ఒకరు– ఫెమినిస్ట్ పబ్లిషర్ ఊర్వశీ భూటాలియా కాగా మరొకరు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ నస్రీన్ మున్నీ కబీర్. బెంగాల్ అన్నా, బెంగాలీలు అన్నా ఆయనకు ఎంతో అపేక్ష. భారతీయ రైళ్లలో ప్రయాణించేందుకు ఇయాన్ ఉత్సాహపడేవారు. పలు భారతీయ పట్టణాలను ఆయన సందర్శించారు. అయినప్పటికీ కలకత్తా అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.
గత శతాబ్ది తుది సంవత్సరాలలో మున్నీ కబీర్ తొలిసారి నన్ను, ఇయాన్ జాక్, ఆయన భార్య లిండీ షర్పేకు పరిచయం చేసింది. ఆ తరువాత లండన్, బెంగలూరులలో మేము చాలాసార్లు కలుసుకున్నాము. తరచు ఉత్తరప్రత్యుత్తరాలు రాసుకునే వాళ్లం. 2014 అక్టోబర్‌లో గాంధీ జీవిత చరిత్ర రచనలో ఉన్న తరుణంలో ఆయనకు ఒక లేఖ రాశాను: ‘గాంధీ 1921లో తన తొలి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించినప్పుడు బ్రిటిష్ పత్రికలు ఆ ఉద్యమ లక్ష్యాలను సంశయించాయి. గాంధీని నానా దుర్భాషలాడాయి. ఒక్క ‘గ్లాస్గో హెరాల్డ్’లో మాత్రమే గాంధీ ఉద్యమం పట్ల సదవగాహనతో కూడిన వార్తలు, వ్యాఖ్యానాలు వచ్చాయి. గ్లాస్గో హెరాల్డ్ ఉదారవాద పత్రికా లేక వామపక్ష భావజాల పత్రికా?’
నా ప్రశ్నకు ప్రతిస్పందనగా ఇయాన్ ఒక సుదీర్ఘ, ఆలోచనాత్మక ప్రత్యుత్తరం రాశారు. తాను 1965లో గ్లాస్గో హెరాల్డ్‌లో చేరినప్పుడు అది మితవాద పత్రికగా ఉండేదని ఆయన అన్నారు. వ్యాపార వర్గాలకు అనుకూలవైఖరి వహించేదని, గ్లాస్గో పారిశ్రామిక గతాన్ని గర్వకారణంగా భావించేదని ఇయాన్ తెలిపారు. ఆ నగరంలోని నౌకా నిర్మాణ పరిశ్రమ వార్తల నివేదనకు ఇద్దరు కరస్పాండెంట్లు ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఆ కాలంలో కార్మిక సంఘాల పట్ల గ్లాస్గో హెరాల్డ్ సానుకూలంగా ఉండేదికాదని తెలుపుతూ పత్రిక సంపాదకీయ రచయితలలో ఒకరు కన్జర్వేటివ్ పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికయ్యాడని పేర్కొన్నారు. డిప్యూటీ ఎడిటర్ జార్జి మాక్ డోనాల్డ్ ఫేజెర్ నవలా రచనలో కీర్తి కనకాలను ఆర్జించిన ప్రముఖుడని ఇయాన్ తెలిపారు. అయితే 1921లో గ్లాస్గో హెరాల్డ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండేవని, నాటి ఎడిటర్ సర్ రాబర్ట్ బ్రూస్, లిబరల్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి డేవిడ్ లాయడ్ జార్జికి స్నేహితుడని ఇయాన్ తెలిపారు. లాయడ్ జార్జి కారణంగానే బ్రూస్‌కు నైట్ హుడ్ లభించిందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ అంతర్గత రాజకీయాల మీద మాత్రమే బ్రూస్‌కు ఆసక్తి ఉండేదని, విశాల ప్రపంచంలో పరిణామాలపై వార్తల నివేదన, వ్యాఖ్యానాలు చేసే బాధ్యతను ఇతరులకు వదిలివేశాడని తెలుపుతూ అలా స్వేచ్ఛ పొందిన సంపాదక వర్గ సభ్యులలో ఒకరు గాంధీ గురించి విశాల దృక్పథంతో రాసి ఉంటారని ఇయాన్ తెలిపాడు. అయితే నాటి గ్లాస్గో హెరాల్డ్ విధానాలు సాధారణంగా వలస రాజ్యాలలో స్వాతంత్రోద్యమాల పట్ల సానుభూతి చూపేవి కావని ఇయాన్ జాక్ వివరించారు.
ఈ వ్యక్తిగత లేఖలో, ఇయాన్ జాక్ పత్రికా రచన వ్యాసంగ విశిష్టతలు– సామాజిక, రాజకీయ చరిత్రను మిళితం చేసే నేర్పు, సాంకేతికతల పట్ల అవగాహనతో కూడిన ఆకర్షణ, మానవ వ్యక్తిత్వంలోని విపరీత ధోరణుల పట్ల ఆసక్తి, విశాల ప్రపంచంతో బ్రిటన్ జటిల సంబంధాల విశ్లేషణ – అన్నీ ప్రస్ఫుటమయ్యాయి.
‘సమకాలీన సోక్రటిక్ సంవాదాన్ని తీర్చిదిద్దిన పాత్రికేయుడుగా ఇయాన్ జాక్ సదా దయా భావంతో పరిశీలిస్తూ, అదే సమయంలో ‘‘మరి దానిగురించి ఏమిటి?’’ అని ప్రతి అంశాన్ని లోతుగా పరిశోధించడం ద్వారా గంభీర సత్యాలను వెల్లడించి కొత్త ఆలోచనలను పురికొల్పేవాడు’ అని ఆయన సన్నిహిత సమకాలీన పాత్రికేయుడు జాన్ లాయడ్ నివాళి అర్పించారు. ‘గార్డియన్’లో వెలువడిన లాయడ్ నివాళి వ్యాసానికి పలువురు పాఠకులు ప్రతిస్పందిస్తూ ఆ ప్రముఖ పత్రిక శనివారం సంచికలో తొలుత తాము ఇయాన్ జాక్ కాలమ్ చదివిన తరువాతనే ఇతర వ్యాసాలు, వార్తలు చదువుతామని విస్పష్టంగా పేర్కొన్నారు. ఆయన వ్యాసాలు ‘ఏ కంట్రీ ఫార్మర్లీ నేమ్డ్ గ్రేట్ బ్రిటన్’, ‘మఫ్యుసిల్ జంక్షన్’గా సంకలితమయ్యాయి. ఒక అంశం పై పుస్తకం రాయడానికి ఆయన చాలా కాలం విముఖత చూపారు. అయితే రైల్వే ప్రయాణాల (ఇది ఆయనకు మొదటినుంచీ ఎంతో అభిమాన విషయం)పై పుస్తకం రాయమని ప్రచురణకర్తలు, స్కాట్‌లాండ్‌లో తన బాల్యం, తొలి యవ్వనం గురించిన జ్ఞాపకాలు రాయమని స్నేహితులు అడుగుతూ వచ్చారు. చివరకు తన తుది సంవత్సరాలలో క్లైడె నది, దాని పరిసర ప్రాంతాల సామాజిక చరిత్ర రాయడానికి ఆయన పూనుకున్నారు. దానిలోని రెండు అధ్యాయాలను చదివే అవకాశం నాకు లభించింది. వ్యక్తిగత జ్ఞాపకాలను చారిత్రక, సాంకేతికతల వివరాలతో మిళితం చేయడంలో ఆయన ప్రతిభ ఆ అధ్యాయాలలో నిండుగా వ్యక్తమయింది (పారిశ్రామిక విప్లవ నిర్మాతలలో ఒకరైన జేమ్స్ వాట్ గురించిన ప్రశస్త పదచిత్రం ఆ అధ్యాయాలలో ఉన్నది).
ఇయాన్ జాక్ నాకు రాసిన లేఖల నుంచి కొన్ని ఉటంకింపులతో ఈ నివాళిని ముగించాలని నేను అభిలషిస్తున్నాను. సహ స్కాటిష్ జాతీయుడు గార్డన్ బ్రౌన్ బ్రిటన్ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన గురించి మీ అభిప్రాయమేమిటో తెలపాలని కోరాను. ఇయాన్ ఇలా సమాధానమిచ్చాడు: ‘గార్డన్ బ్రౌన్ ఎల్ల వేళలా తనకు తెలిసిన సమాచారమంతటినీ వెల్లడిస్తూనే ఉంటాడు. ఇది ఆయన ముఖ్య లక్షణం. ఒక ప్రధానమంత్రికి ఉండవల్సిన సద్గుణాలలో ఇది కూడా ఒకటా అనేది వేరే ప్రశ్న. అయితే చిరాకు కలిగించే సర్కోజీ (నాటి ఫ్రెంచ్ అధ్యక్షుడు) కంటే గార్డన్ బ్రౌన్ చాలా మెరుగు’. నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన రచయితల రచనా పాటవం ఆ తరువాత వేగంగా క్షీణించిపోతుందని వాదిస్తూ 2008లో నేను రాసిన ఒక కాలమ్‌ను ఇయాన్‌కు పంపాను. ‘1913 తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశస్త రచనలు చేశాడా? మీరు ఇటువంటి ప్రశ్న మీ మెయిల్ బ్యాగ్‌ను నింపివేస్తుందని ప్రతిస్పందిస్తూ ఇయాన్ తన అభిప్రాయాలను ఇలా వివరించాడు: ఒక రచయిత తనరచనా వ్యాసంగాన్ని నిలిపివేయవలసిన సమయం వస్తుందని విఎస్ నైపాల్ నిరూపించాడు. ఫిలిప్‌రాత్ ఇందుకొక మినహాయింపు. బహుశా సాల్‌బెల్లో కూడా కావచ్చు. రచయితలు, ముఖ్యంగా నవలాకర్తలు చెప్పడానికి ఏమీ లేని స్థితికి వస్తారు. రచనా జీవితపు ప్రముఖ లక్షణమేమిటంటే డబ్బు కోసం, ఆత్మ గౌరవం కోసం రాస్తూ ఉండాల్సిన అవసరం. నోబెల్ పురస్కారాన్ని పొందిన సాహితీవేత్తలలో రచనోత్సాహం క్షీణించడమనేది బహుశా వయస్సుపరమైన విషయంకావచ్చు. అయితే ఆ అవార్డు ప్రభావమూ తప్పక ఉంటుంది. ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును పొందినప్పుడు రచయితలు సాధారణంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తారు. ఒర్హాన్ పాముక్ చిన్న వయస్సులో ఆ పురస్కారాన్ని పొందినందున ఆయన్ని రచనా వ్యాసంగం ఎలా సాగుతుందనేది గమనించాల్సి ఉన్నది’.
సృజనాత్మక రచయితల తీరే పాత్రికేయులది కూడా. అటు బ్రిటన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ కాలమిస్ట్‌ల వయస్సు పైబడుతున్న కొద్దీ పదాడంబరాన్ని ప్రదర్శిస్తుండడం కద్దు. అంతేకాకుండా వారు చెప్పేదానిని పాఠకులు ముందుగానే ఊహించే విధంగా ఉండడం పరిపాటి. అయితే ఇయాన్ జాక్ ఇందుకొక మినహాయింపు. ఆయన తన 30లలో ఎలా నవ నవంగా, విశదంగా రాశారో తన 70లలో కూడా అంతే వినూత్నంగా, స్ఫుటంగా రాశారు. క్లైబె నదిపై సంకల్పించిన పుస్తకాన్ని ఆయన పూర్తి చేయనేలేదు. అయితే సంపుటీకరించవలసిన ఆయన వ్యాసాలు అనేకమున్నాయి. బహుశా, ఎంపిక చేసిన ఆయన ఉత్తరాల సంకలనం నొకదాన్ని కూడా ప్రచురించవలసిన అవసరమున్నది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)