విజ్ఞానఖని గోటేటి

ABN , First Publish Date - 2022-10-29T02:00:25+05:30 IST

ఈ నెల 26న కన్నుమూసిన గోటేటి రామచంద్రరావుతో, నేను ఇంటెలిజెన్స్‌ యస్‌.పి.గా ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది.

విజ్ఞానఖని గోటేటి

ఈ నెల 26న కన్నుమూసిన గోటేటి రామచంద్రరావుతో, నేను ఇంటెలిజెన్స్‌ యస్‌.పి.గా ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది. మండలాల ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు గారితో ఇంటెలిజెన్స్‌ విభాగం తరఫున కోఆర్డినేట్‌ చేసే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ అధిపతిగా ఉన్న హెచ్‌.జె.దొర నాకు అప్పచెప్పారు. సరిగా జ్ఞాపకం లేదు కానీ, ఎన్‌.టి.ఆర్‌ నివసిస్తున్న నాచారంలోనో గండిపేటలోనో దూరంగా ఒక చెట్టు క్రింద సిగరెట్టు కాలుస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కూడా, అటువైపు వెళ్తున్న నన్ను ‘మీరేనా ఎస్పీ సీతారాంరావు’ అని నన్ను పలకరించారు గోటేటి. ఈయన ఎవరా అని ఆశ్చర్యపోతూ నేను అవునంటూ దగ్గరగా వెళ్ళాను. ‘నా పేరు గోటేటి రామచంద్ర రావు, సి.యం. గారి పి.ఆర్‌.వోను’ అని పరిచయం చేసుకోవటంతో ఏర్పడిన మా ఇద్దరి ప్రగాఢ స్నేహం మొన్నటివరకూ సాగుతూనే ఉంది. గోటేటి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయనలో అంత విద్వత్తు, పాండిత్యం, అవగాహనా శక్తి ఉందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయనను బాగా అర్థం చేసుకొని విలువైన స్నేహాన్ని పంచినవారిలో అప్పటి సి.యం. కార్యదర్శి రాఘవేంద్రరావు, సి.యం. సమాచార శాఖ కార్యదర్శి యస్‌.వి.ప్రసాద్‌, రిటైర్డ్‌ డి.జి.పి హెచ్‌.జె.దొర ముఖ్యులు. మా పరిచయం బహుముఖంగా వృద్ధి చెందటానికి కారణం మండలాల ఎన్నికల్లో నేనూ, గోటేటి, చక్రపాణి, నర్సయ్య ఒక టీమ్‌గా ఉండటమే.

ఎన్‌.టి.ఆర్‌. అంటే గోటేటికి ప్రాణం. సినిమాల్లో ఎన్‌.టి.ఆర్‌ తిరుగులేని హీరోగా ఉన్నప్పుడు, గోటేటి విద్యార్థిగా కాలేజీ లెక్చరర్‌గా పనిగట్టుకొని చెన్నై పోయి తీరిక సమయాల్లో ఎన్‌.టి.ఆర్‌తో చాలాసార్లు, గంటలసేపు గడిపేవారట. ఎన్‌.టి.ఆర్‌ సి.యం అయిన కొన్ని రోజుల తర్వాత అప్పటి సి.పి.ఆర్‌.వో భండారు పర్వతాలరావు వేరే పోస్టులోకి వెళ్ళినప్పుడు, ఎక్కడో నర్సాపురంలో ఉన్న గోటేటిని ప్రత్యేకంగా పిలిపించి, సి.పి.ఆర్‌.వోగా నియమించుకున్నారు ఎన్టీఆర్. ప్రభుత్వంలో లేని వ్యక్తిని ఆ పదవిలో నియమించటం ఎన్‌.టి.ఆర్‌కు ఆయనపట్ల ఉన్న నమ్మకానికీ, అభిమానానికీ నిదర్శనం. ఆ నమ్మకానికి తగినట్టుగానే, లో ప్రొఫైల్‌తో ఎన్‌.టి.ఆర్‌ అధికారంలో ఉన్నంతవరకూ సి.పి.ఆర్‌.వోగానో, ఒ.యస్‌.డీ గానో కొనసాగడం చిన్నవిషయం కాదు. ఎప్పటికప్పుడు ఆలోచనలకు పదును పెడుతూ, ఎన్‌.టి.ఆర్‌కు ఎన్నో ముఖ్యమైన విషయాల్లో తోడ్పడిన అతిముఖ్యుల్లో ఆయన ఒకరు. మండలాల ఎన్నికల్లో ఎన్‌.టి.ఆర్‌తో ఖమ్మం జిల్లాలో టూర్‌ చేస్తున్నప్పుడు నేలకొండపల్లి దరిదాపుల్లోకి వచ్చాం. రామదాసు పుట్టిన ఊరు అని నేను గోటేటితో అనగానే ‘మీరు అర్జెంటుగా వారితో చెప్పండి, మిగతా విషయం నేను చూసుకుంటాను’ అన్నారాయన. చైతన్యరథంలో ఎన్‌.టి.ఆర్‌తో ఆ ప్రస్తావన చేయగానే, ‘సార్‌, భక్త రామదాసు పుట్టిన నేల, భద్రాచలం ఆయన నిర్మితమే కదా, మీరు నాగయ్య గారు తీసిన సినిమాలో శ్రీరాముడిగా నటించారు గూడా, మీకు ఆ విషయాలన్నీ తెలుసుగదా సార్‌!’ అని గోటేటి చాలా కాజువల్‌గా చెప్పారు. ఎన్‌.టి.ఆర్‌ సాలోచనగా చూసారు కానీ, నేలకొండపల్లి రాగానే చైతన్య రథం ఎక్కి రామదాసు ప్రస్తావన తీసుకొనివచ్చి తన వాగ్ధాటితో నేలకొండపల్లి ప్రజలను మైమరిపించారు. గమ్మతేమిటంటే ఆయన మండలాల ఎన్నికలూ, ఓట్ల ప్రస్తావన తేకుండానే ఉపన్యాసం ముగించారు. ఎన్‌.టి.ఆర్‌ రామదాసుతో మమేకం కావటంతో బహుశా ఆ ఊరి ఓటర్లు గంపగుత్తగా ఆయన పార్టీకే ఓట్లు వేసివుండొచ్చు. గోటేటి ఆలోచనా పరిథి అలాంటిది. ఏ విషయమైనా క్షణాల్లో చెప్పగలిగిన మేథావి. రాజకీయాలు, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, సినిమా రంగాలు, అన్ని భాషల్లోని విషయాలు ఒకటేమిటి అనేకాంశాలు అలవోకగా చెప్పగలిగిన నేర్పరి.

చెన్నైలో రాజాజీ అవసానదశలో ఉన్నప్పుడు విద్యార్థిగా ఆయనను చూడాలని అభిలషించి అతికష్టం మీద రెండు నిముషాల ఇంటర్వ్యూ పొంది, దాదాపు అర్ధగంటకు పైగా గడపటమే గాకుండా ప్రత్యేకంగా రాజాజీ ఉత్తరం రూపంలో గోటేటికి ఇచ్చిన కితాబు చాలామంది సన్నిహితులు చూసే ఉంటారు. సంభాషణా చతురత, సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి గోటేటి. ఆయన మరణవార్త మాలాంటి స్నేహితులనేకులను కలిచివేసింది. ఎంతోమంది ముఖ్యులతో, ముఖ్యంగా ఎన్‌.టి.ఆర్‌తో ఉన్న అనుభవాలను పుస్తకరూపంలో తేవాలని కోరినప్పుడు, ‘కొన్ని బయటకు చెప్పగూడదు, నాతోనే ఉండిపోవటం శ్రేయస్కరం’ అనేవారాయన. అందరి శ్రేయస్సును ఆశించే పెద్దమనసు ఉన్నవాడు కాబట్టే గోటేటి కలకాలం జ్ఞాపకం ఉంచుకొనే మంచివాడిగా చాలామంది మదిలో ఎన్నటికీ నిలిచిపోతారు.

– రావులపాటి సీతారాంరావు

Updated Date - 2022-10-29T02:00:37+05:30 IST