రాష్ట్రంలో మందగించిన ‘జల్ జీవన్ మిషన్’
ABN , First Publish Date - 2022-12-31T01:18:27+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో రెండవ దఫా విజయం సాధించిన తరువాత గ్రామీణ భారతదేశంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీరు అందించాలనే దృఢ సంకల్పంతో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో రెండవ దఫా విజయం సాధించిన తరువాత గ్రామీణ భారతదేశంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఆగస్టు 15, 2019న జల్ జీవన్ మిషన్‌ని ప్రకటించారు. దేశంలోని గ్రామాలలో ఉన్న ప్రతి గృహానికి కుళాయి ద్వారా నేరుగా సురక్షిత తాగు నీరు 2024 చివరికి అందించాలని ‘హర్ ఘర్ జల్’ నినాదాన్ని విధానంగా భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. ఈ పథకం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి 50:50 సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో దేశమంతా పూర్తి కావడానికి అంచనా వ్యయం 3.50 లక్షల కోట్ల రూపాయలు. ఈ పథకం ప్రారంభించే నాటికి దేశంలోని గ్రామీణ భారతంలో 19.36 కోట్ల గృహాలు ఉండగా, అందులో 3.24 కోట్ల గృహాలకు అంటే 16.72 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 95.69 లక్షల గృహాలుండగా, అందులో ౩౦.74 లక్షల గృహాలకు అంటే 32.13 శాతం అంటే దేశ సగటుకు దాదాపు రెండు రెట్లు అధికంగా గ్రామాల్లో కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ఇప్పటివరకు దేశంలోని గ్రామాల్లో తాగునీటి కుళాయి లేని 16.12 కోట్ల గృహాలు, అందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన 64.94 లక్షల గృహాలకు 2024 సంవత్సరానికల్లా సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం మహోన్నతమైనది.
ప్రతిష్ఠాత్మక ‘జల్ జీవన్ మిషన్ – హర్ ఘర్ జల్’ కార్యక్రమం ప్రారంభమై 40 నెలలు సమయం పూర్తి అయిన సందర్భంగా దేశంలోను, మన రాష్ట్రంలో ఈ పథకం ప్రగతి ఏ విధంగా సాగుతున్నదో సమీక్షించడానికి సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని డాష్ బోర్డు సమాచారాన్ని డిసెంబర్ 10న సేకరించగా అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు బహిర్గతమయ్యాయి. ఇప్పటివరకు దేశం మొత్తం గ్రామాల్లో 10.65 కోట్ల గృహాలకు, అందులో ఆంధ్రప్రదేశ్ లో 32.99 లక్షల గృహాలకు సురక్షిత తాగునీరు కుళాయి ద్వారా అందుతున్నది. ఆశ్చర్యకరంగా 2019 సంవత్సరంలో పథకం ప్రారంభించే నాటికి దేశంలో 16.72 శాతం గృహాలకి మాత్రమే కుళాయి ద్వారా సురక్షిత మంచి నీరు అందుతుంటే, నేడు అదనంగా 7.45 కోట్ల గృహాలకు ఇప్పటివరకు ఇవ్వడం ద్వారా 55.23 శాతం గ్రామీణ గృహాలకు దేశం మొత్తం మీద ఈ పథకం లక్ష్యం వైపు దూసుకువెడుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఈ పథకం ప్రారంభం అయ్యేనాటికి ఉన్న ౩౦.74 లక్షల గృహాలకు అంటే 32.13 శాతానికి అదనంగా కేవలం 2.43 లక్షల గృహాలకు మాత్రమే సురక్షిత తాగునీరు ఇవ్వడం ద్వారా అది 34.66 శాతానికి చేరింది. 2019లో ఈ పథకం అమలు చేశాక ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఇవ్వవలసిన కనెక్షన్లలో 7.46 కోట్లు అంటే 46.25శాతం ఇస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2.43 లక్షల అదనపు కనెక్షన్లు ఇచ్చారంటే అది కేవలం 3.74శాతం మాత్రమే. ఈ పథకం ప్రారంభంలో జాతీయ సగటుకు రెండు రెట్లు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జాతీయ స్థాయితో పోలిస్తే ఈ పథకం అమలులో బాగా వెనుకపడిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులలో ‘హర్ ఘర్ జల్’ పథకం అమలును విశ్లేషిస్తే వాస్తవాలు బహిర్గతం అవుతాయి. క్షేత్ర స్థాయిలో 100 శాతం పూర్తి కావలసిన మొత్తం గ్రామాలు 18,578 అయితే, ఇప్పటివరకు పూర్తయిన గ్రామాలు కేవలం 3,544. అంటే 19.07శాతం మాత్రమే. అలాగే పనులు జరుగుతున్న గ్రామాలు 9,357 అంటే 50.37శాతం, పనులు అసలు మొదలు కానీ గ్రామాలు 5,677 అంటే 30.56శాతం ఉన్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాల్లో వేగంగా ఈ పథకం పనులు పూర్తి అవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల అసంపూర్ణ ప్రణాళిక, మందగమన కార్యాచరణ ప్రజలకు శాపంగా మారింది. దీనిని బట్టి గ్రామాల్లో గృహాలకు కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుంది.
15 ఆగష్టు, 2019 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్‌కి కేంద్రం, రాష్ట్రం కలిపి ఖర్చు చేయాల్సిన నిధులు మొత్తం 18,004.70 కోట్లు అని అంచనా వేస్తే, ఇదే సమయంలో కేంద్రం 1,084.99 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రం 563.14 కోట్లు ఖర్చు చేసింది. అంటే మొత్తం వ్యయం: 1,648.13 కోట్లు మాత్రమే. ఈ పథకం అమలుకు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించకుండా, మొత్తం అవసరమైన నిధులలో కనీసం 10శాతం కూడా ఖర్చు చేయడం లేదు. ఇలా అయితే ప్రధానమంత్రి ఆశించిన విధంగా ఈ పథకం పురోగతి ఏ విధంగా సాధ్యం అవుతుంది?
వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించే నాటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాలకన్నా మెరుగైన స్థానంలో ఉన్నది. మూడు సంవత్సరాల తరువాత నేడు అది కేవలం 34.66శాతం వరకు మాత్రమే చేరింది, ఇదే కాలానికి దేశ సగటు 55.23శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు వేగంగా అందిస్తుంటే ఆ అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకొని వృద్ధి సాధిస్తున్నాయి... కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఈ పథకం కనీస స్థాయిలో అమలు చేయలేక చతికిలపడడం వల్ల రాష్ట్రంలో శ్రీకాకుళంతోబాటు కృష్ణా నది జలాలు కూతవేటు దూరం నుండి అందించే అవకాశం ఉన్న పల్నాడు, గుంటూరు, కృష్ణా, మచిలీపట్టణం, బాపట్ల, కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో కుళాయి ద్వారా తాగునీరు అందించే పథకం అమలులో దిగువ స్థానంలో ఉన్నాయన్నది కటిక వాస్తవం.
ఈ పథకం అమలులో దేశంలో ముందు వరుసలో ఉండవలసిన స్థానం నుండి మన రాష్ట్రం దారుణంగా వెనుకబడి పోవడానికి కారణాలు : 1) రాష్ట్ర ప్రభుత్వానికి పథకం అమలుపై చిత్తశుద్ధి లేకపోవడం. 2) కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో ఈ పథకం అమలుకు తన వాటా నుంచి 8,956.౩౦ కోట్ల రూపాయలలో 7,804.20 కోట్ల రూపాయిలను కేటాయించగా, రాష్ట్రం తన వాటాగా చేసిన కేటాయింపులు శూన్యం కావడం. 3) కేంద్ర ప్రభుత్వ నిధులు పుష్కలంగా ఉన్నా, ఇప్పటివరకు జరిగిన పనుల కోసం కేవలం 1,648.13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం. 4) రాష్ట్రంలో ప్రభుత్వ లోపభూయిష్టమైన ఆర్థిక నిర్వహణ. 5) పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక లోపం. 6) రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రతి పనిలో అవినీతితో సొమ్ము వెనకేసుకోవాలనే తాపత్రయం. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం మేలుకుని లక్ష్యం సాధించే దిశగా జల్ జీవన్ మిషన్‌కు తగు విధంగా నిధులు కేటాయించి చిత్తశుద్ధితో పనిచేయాలి.
లంకా దినకర్