ఉగ్ర సింహం దేనికి చిహ్నం?
ABN , First Publish Date - 2022-07-19T06:17:02+05:30 IST
ఎవరూ సాధించనిదీ, లేదా అతితక్కువగా సాధించేదీ సాధిస్తే గర్వపడటం మనిషికైనా, సమాజానికైనా సహజ లక్షణమే. అయితే అనారోగ్యకరమైన గర్వంతోనే చిక్కంతా....
ఎవరూ సాధించనిదీ, లేదా అతితక్కువగా సాధించేదీ సాధిస్తే గర్వపడటం మనిషికైనా, సమాజానికైనా సహజ లక్షణమే. అయితే అనారోగ్యకరమైన గర్వంతోనే చిక్కంతా. ఇలాంటి గర్వానికుండే ఒక ప్రధాన లక్షణం– ఎదుటి మనుష్యులతో ఉన్న సంబంధాలను కొంత హీనపరచడానికి వెనక్కు తగ్గకపోవడమే. ఆరోగ్యకరమైన గర్వం ‘‘నీవు కూడా చేయగలవు’’, ‘‘నీవు కూడా నాలానే సాధించగలవు’’ అనే ఒక పాజిటివ్ ధ్వనిని కలిగి ఉంటుంది. కానీ ఈ నెగెటివ్ గర్వం ఒక అహం నుంచి పుట్టుకొస్తుంది. ‘‘నేను మెజారిటీ, నేను అనుకున్నది చెల్లుతుంది’’ అనే ఒక భావన నుంచి వస్తుంది. ఇప్పుడు మన దేశ చిహ్నమైన మూడు సింహాల బొమ్మను, గర్జించే సింహాలుగా మార్చి చూపడంలో ఇలాంటి గర్వమే వ్యక్తమవుతోంది. ఆ చిహ్నంలో శాంతంగా ఉండే సింహాల ఆకృతిలోకి, గర్జించడం వంటి ఒక అగ్రెషన్‍ను ఎందుకు చొప్పించారు? ఈ గర్వం ఎవరికి చూపించడానికి?
మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే– ఈ ఎంబ్లమ్‌లో జరిగిన మార్పును అర్థం చేసుకోడానికి ఇంకో కోణం కూడా ఊహించవచ్చు. ఈ మార్పు ఒక ఆత్మవిశ్వాసాన్ని సూచించేందుకు అని కూడా అనుకోవచ్చు. కానీ ఆ కోణంలో చూస్తే అసలు సింహం అన్నదే ఆత్మవిశ్వాసాన్ని సూచించే చిహ్నం కదా. మరి అందులో మళ్లా అగ్రెషన్‌ను చొప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని బట్టి ఇది కేవలం ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం కాదు అని అర్థమవుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం చిహ్నం కూడా సింహమే! అది గర్జించే సింహం కాదు, పడుకున్న సింహం కాదు. నడుస్తున్న సింహం. పోనీ అది ఒక ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది అనుకోవచ్చు. అదే సింహం పంజా విసురుతున్నట్టు గానో, జూలు విదుల్చుకొని గర్జిస్తున్నట్టు గానో ఉంటే చాలా అసంబద్ధంగా ఉండేది. అలాగే ఒక బ్రాండ్‌లోని మార్పు వేరు, దేశ చిహ్నంలోనే చేసే మార్పు వేరు.
సింహం గర్జించడం అంటే అదో ప్రగతికాంక్షలా కూడా చూడలేం. అదే నిజమైతే ఇక్కడ ప్రతి ఆర్థికవేత్తకు, ప్రతి రాజకీయ నాయకుడికి ఈ దేశ వ్యవస్థ గమనం ఎలా ఉందో తెలుసు. నిరుద్యోగం, దేశవాసులపై పెరుగుతున్న అప్పు, భారమౌతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న డీజిలు, పెట్రోలు ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, తరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు, పెరిగిపోతున్న వ్యాపార ద్రవ్య లోటు, కొత్త ఉద్యోగాలూ సృష్టించలేని పరిశ్రమలు, 15 కోట్లు దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే సుమారు అదే సంఖ్యలో బొటాబొటిగా జీవితాన్ని గడుపుతున్న కోట్ల మంది దేశవాసులు, కథువాలో రేప్ జరిగితే గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం బాడీని తగులబెట్టడం, ముసలివాడైన స్టాన్ స్వామిని జైలులో మగ్గబెట్టి చంపే పరిస్థితి ఉండడం, ప్రశ్నించిన వారిపైన ఉపా ప్రయోగం... ఇవన్నీ ఇండియాలో జరుగుతున్నాయని తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి లేదు.
దేశ చిహ్నం దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుంది. మనకు ఇంతవరకూ ఉన్న చిహ్నం ఎవరో తయారుచేస్తే రాలేదు. అది సారనాథ్ లోని అశోక స్తూపం మీద ఉన్నది. కాబట్టి దాన్ని ఎవరు పడితే వారు, ఎలా పడితే అలా వ్యక్తీకరించలేరు, ప్రభుత్వంతో సహా! ఈ అశోక స్తూపం మీది ఈ చిహ్నం సుమారు క్రీ.పూ.200కు ముందు నుండే ఉంది. దీనికి ఇప్పుడు సరికొత్త భాష్యాన్ని చెప్పాలనుకోవడం మూర్ఖత్వం. ఈ జాతీయ చిహ్నంలో సింహంతో పాటు, ఎద్దు, గుర్రం, ఏనుగు కూడా ఉంటాయి. ఇవి గౌతమ బుద్ధుడి జీవిత చక్రంలో ఒక్కో దశను వివరిస్తాయని అంటారు. ఆ ఉద్దేశ్యంతోటే, ఆ మార్గదర్శకత్వంలోనే తయారైన ఈ చిహ్నాన్ని మనకి ఇష్టమొచ్చిన రీతిగా మార్చుకోవడం వీలు కాదు. అలా మారిస్తే అప్పుడు అది అశోక స్తూపం మీది చిహ్నం కాదు, ఇంకోటి ఏదో అవుతుంది. మన రాజ్యాంగం, మన నేషనల్ ఎంబ్లమ్ యాక్ట్ – 2005 స్వీకరించిన ఎంబ్లమ్ ఇది కాదు. సింహాలు గర్జిస్తున్నట్టు, ఎద్దు గడ్డి తింటున్నట్టు, ఏనుగు చెట్లు కొమ్మలను విరిచి తింటున్నట్టు... జాతీయ చిహ్నంలో ఇలాంటి మార్పులు చేయడం అనాలోచితమైన చర్య.
అసంబద్ధంగా చేసిన ఈ మార్పులపై ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యానాన్ని ప్రకటించ లేదు. రాజసంగా ఉన్న సింహాల స్థానంలో, ఆగ్రహంగా ఉన్న సింహాల్ని మార్చి ఊరుకుంది. ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యను కాకతాళీయంగా చేసిందీ అనుకోలేం. ఇది ఎవరినో ఉద్దేశించి మాత్రమే చేసింది. రాజసంగా ఉండడం ఒక బలహీనత అన్నది సంఘ్ పరివార శక్తులు అప్పటికీ, ఇప్పటికీ చేస్తున్న ప్రాపగాండా. ఈ దేశంలో సెక్యులరిజం మనం చేకూర్చుకున్న రాజసభావంగా కాకుండా, ఒక బలహీనతగా మారిందన్న ప్రచారాన్ని ఆరెస్సెస్, భజరంగ దళ్ లాంటి శక్తులు ఎప్పటి నుంచో చేస్తున్నాయి.
జాతీయ చిహ్నం, జాతీయ జెండా ఇవన్నీ మన సామూహిక మనోవాంఛలను, మనోభావాలను ప్రతిబింబిస్తాయి. ఇందులో అగ్రెషన్ అనే మూడ్ చొప్పించడం ఏమాత్రం సరైనది కాదు. జాతీయ చిహ్నం ‘జాతీయ భావం’తో ముడిపడిన విషయం. దేశప్రజల్లో ‘నేషనలిజం’ చొప్పించడం మంచిదే. కాని ‘మిలిటరీ నేషనలిజం’ వంటి భావనలను ప్రజల్లో చొప్పిస్తే అది దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే దిశగా తీసుకెళ్తుంది. ఈ దేశంలో సృష్టింపబడుతున్న ఈ నేషనలిజం అనే భావన ఎప్పుడూ ఎవరినో అటాక్ చేద్దాం అనే దిశలో ఎక్కుబెట్టి ఉండడం దురదృష్టకరం. అది నెహ్రూ, గాంధీ, అంబేడ్కర్, క్రైస్తవులు, ముస్లిములు, ప్రాంతీయ భాషలు, స్త్రీల వస్త్రధారణ... ఇలా ఎవరైతేనేం, ఏదైతేనేం ప్రతి విషయం పట్ల ఒక మిలిటరీ/పోలీస్ అప్రోచ్ కలిగి ఉండడం జరుగుతోంది. సెక్యులరుగా ఉండడం, బహుళత్వాన్ని మనలో ఇముడ్చుకోవటం ఒక రాజసమైన, మానవీయమైన సహజ లక్షణాలుగా కాకుండా, మానసిక బలహీనతలుగా ప్రచారం కాబడటం, ఆ దిశగా వాటిని వ్యవస్థాగతం చేయడం పట్ల దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అందునా ఇలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన మన వారసత్వ చిహ్నాల్లో ‘అగ్రెషన్’ చొప్పించటం వల్ల ఎటువంటి మేలూ జరుగదు.
ఇందులో ప్రధానంగా గమనించాల్సిందేమంటే – దేశ సార్వభౌమత్వం కొద్దిమంది వ్యక్తుల, కొద్దిమంది పార్టీల సొత్తు కాదు. ఇది ప్రజల సొత్తు. ఇటువంటి మార్పులను పార్లమెంటులో ఆమోదానికి ప్రవేశపెట్టాలి. బహిరంగ చర్చ నిర్వహించాలి. అప్పుడే ప్రభుత్వం చెప్పే మాటలకు క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేతప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అమలు చేయటం అహంకార పూరితమైన చర్య మాత్రమే అవుతుంది. అలాంటి నిర్ణయంలో ‘గ్రేస్’ ఉండదు, ఈ చిహ్నంలో కూడా అదే కరువయ్యింది.
పి. విక్టర్ విజయ్‌కుమార్