యూనిఫాం పోస్టులకు బంపర్ ఆఫర్
ABN , First Publish Date - 2022-05-20T21:29:49+05:30 IST
పోలీస్(Police) ఉద్యోగం సాధించాలనుకునే వారికి సీఎం కేసీఆర్(CM KCR) బంపర్ ఆఫర్ ఇచ్చారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత..
హైదరాబాద్ : పోలీస్(Police) ఉద్యోగం సాధించాలనుకునే వారికి సీఎం కేసీఆర్(CM KCR) బంపర్ ఆఫర్ ఇచ్చారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్లు కరోనా(Corona) కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయో పరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeswar Reddy) చేసిన విన్నపానికి సానుకూలంగా కేసీఆర్ స్పందించారు. అంతేకాదు హుటాహుటిన ఆదేశాలను సైతం జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ(DGP)ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా.. నేటితో పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు గడువు ముగియనుంది. నేటి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే అభ్యర్థులకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దరఖాస్తు గడువు మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే 17,291 ఉద్యోగాలకు గానూ దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగించడంతో మరికొన్ని లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.