ఒక్క క్లిక్‌తో సర్టిఫికెట్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-11-17T04:24:54+05:30 IST

రాష్ట్రంలో బోగస్‌ సర్టిఫికెట్లను గుర్తించడంలో ఆధునిక విధానం అందుబాటులోకి రానుంది.

ఒక్క క్లిక్‌తో సర్టిఫికెట్ల పరిశీలన

ఆన్‌లైన్‌లో 24.45 లక్షల మంది వివరాలు

ఇక బోగస్‌ సర్టిఫికెట్లను సులభంగా గుర్తించొచ్చు

రేపటి నుంచి సేవలు.. ప్రారంభించనున్న సబిత

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బోగస్‌ సర్టిఫికెట్లను గుర్తించడంలో ఆధునిక విధానం అందుబాటులోకి రానుంది. ఒక్క క్లిక్‌తో అభ్యర్థి చదువుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్రంలో ‘స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీ్‌స’ను ప్రారంభిస్తున్నారు. బోగస్‌ సర్టిఫికెట్ల సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. శుక్రవారం (ఈ నెల 18న) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో కొనసాగే ఈ సర్వీసు ద్వారా బోగస్‌ సర్టిఫికెట్ల గుర్తింపు సులభం కానుంది. ఇందుకోసం 2010 నుంచి 2021 ఏడాది వరకు డిగ్రీ (అన్ని రకాల కోర్సులు) పూర్తి చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఉంచారు. మొత్తం 15 యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో చదువుకున్న సుమారు 24.45 లక్షల మంది అభ్యర్థుల డేటాను ఇందులో పొందుపరిచారు.

సర్టిఫికెట్ల తనిఖీ రెండు దశల్లో ఉండనుంది. తొలుత ఇన్‌స్టంట్‌గా వివరాలను పొందవచ్చు. ఇందుకోసం ఈ వెబ్‌సైట్‌లో అభ్యర్థి వివరాలను నమోదు చేసిన వెంటనే, అతని సర్టిఫికెట్లు నిజమైనవా? కాదా? అనే విషయం స్పష్టం అవుతుంది. రెండో విధానంలో అభ్యర్థికి సంబంధించిన మరిన్ని వివరాలు.. అంటే ఆయా డిగ్రీల్లో సాధించిన మార్కులు, గ్రేడ్‌ వంటి వాటిని పరిశీలించవచ్చు. తొలి దశ వెరిఫికేషన్‌ సర్వీసును ఉచితంగానే పొందవచ్చు. రెండో దశ పరిశీలనకు మాత్రం నిర్ణీత ఫీజును నిర్ణయించారు. అది చెల్లించిన తర్వాత సంబంధిత వర్సిటీలు అభ్యర్థికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోనే అందజేస్తాయి. ఉద్యోగాలను భర్తీ చేసే ప్రభుత్వ సంస్థలతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రైవేట్‌ సంస్థలు కూడా ఈ సేవలను పొందవచ్చు.

Updated Date - 2022-11-17T11:04:36+05:30 IST