Indian History: జైనమతం - తీర్థంకరులు.. పోటీ పరీక్షల కోసం!

ABN , First Publish Date - 2022-11-16T14:15:41+05:30 IST

క్రీ.పూ. 6వ శతాబ్దంలో చైనా, గ్రీసు, భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త మతాలు ఆవిర్భవించాయి. భారత్‌(India)లో జైన, బౌద్ద, అజీవక, చార్వాక మొదలైన మతాలు ఉనికిలోకి

Indian History: జైనమతం - తీర్థంకరులు.. పోటీ పరీక్షల కోసం!
పోటీ పరీక్షల కోసం!

టీఎస్‌పీఎస్సీ/పోలీస్‌ పరీక్షల ప్రత్యేకం

ఇండియన్‌ హిస్టరీ

క్రీ.పూ. 6వ శతాబ్దంలో చైనా, గ్రీసు, భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త మతాలు ఆవిర్భవించాయి. భారత్‌(India)లో జైన, బౌద్ద, అజీవక, చార్వాక మొదలైన మతాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ మతాలు ప్రజలపై ఏమేరకు ప్రభావం చూపాయో ఒకసారి చూద్దాం.

జైనమతం: క్రమశిక్షణ, అహింస, ఆధ్యాత్మిక స్వచ్ఛత ద్వారా జ్ఞానోదయానికి మార్గాన్ని బోధిస్తుంది. జైనమతం అనే పేరు సంస్కృత క్రియాపదమైన ‘జి’ నుంచి వచ్చింది. కోరికలను జయించిన వారు జైనులుగా మారుతారు. జైనులు(సన్యాసులు) జ్ఞానోదయం తరవాత సర్వజత, ‘ఆత్మ’ స్వచ్ఛతను పొందడానికి కోరికలు, శారీరక ఇంద్రియాలకు వ్యతిరేకంగా పోరాడాలి. నిర్గ్రంధులు(బంధాలు లేని)గా వీరిని చెబుతారు. జైనమతం ఎక్కువగా భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం భారతదేశంలో వీరి సంఖ్య 60 లక్షలు. ఈమధ్యకాలంలోనే దేశంలో 6వ మైనారిటీ మతంగా గుర్తింపు పొందింది(ఇస్లాం, క్రైస్తవం, సిక్కులు, పార్శీ, బౌద్ద, జైన మతాలు దేశంలో మైనారిటీ హోదా పొందాయి).

చరిత్ర: జైనమతంలో 24 మంది ‘తీర్ధంకరులు’ ఉన్నారు. తీర్థంకరులు అంటే వారథిని(జీవన స్రవంతి) దాటడానికి దోహదపడేవారని అర్థం. క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టింది. మొదటి తీర్ధంకరుడు ‘రుషభనాథుడు’. 11వ తీర్ధంకరుడు సీతలనాథుడు తెలంగాణ వాసి. 12వ వారు వాసుపూజ్య(బీహార్‌), 13 విమలనాథ్‌, 14 అనంతనాథ్‌, 15 ధర్మనాథ్‌, 16 శాంతినాథ్‌, 17 కుంతునాథ్‌, 18 అరనాథ్‌, 19 మల్లినాథ్‌, 20 మున్షివ్రతద్‌, 21 నేమినాథుడు. ఈయన మహాభారత కాలంలో శ్రీకృష్ణునికి, మగధ రాజైన జరాసంధునికి, ఛేది రాజు శిశుపాలునికి సమకాలీనుడు అని హేమచంద్ర పరిశిష్ట పర్వన్‌లో రాసి ఉంది. 22వ తీర్ధంకరుడు అరిష్టనేమి, 23 పార్శ్వనాథుడు క్రీ.పూ. 750 కాలానికి చెందినవాడు. 24వ తీర్ధంకరుడు వర్ధమానుడు. ఈయన క్రీ.పూ. 540 కాలం నాటికి చెందినవాడు.

మత ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు

క్రీ.పూ. 6వ శతాబ్దంలో మతపరంగా భారతదేశంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మికపరంగా అశాంతి నెలకొని ఉంది. ప్రపంచస్థాయిలో నాడు యఽథాతథ స్థితిలో విసిగిపోయిన ప్రజలు ఎదురుతిరిగారు. గ్రీసులో- గిరాక్లిటిజ్‌, సోక్రటీస్‌; ఇరాన్‌ (పర్షియా)లో- జరతృష్ణ(జొరాస్ర్టియన్‌); చైనాలో- కన్ఫ్యూషియ్‌సలు. సమాజంలో ఉన్న పరిస్థితులపై తిరుగుబాటు చేశారు. తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఇదే భారతదేశంలోనూ జరిగింది. ప్రాచీన హైందవ సమాజంలోని ‘కర్మకాండ క్రతువుల’ భారంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అసమానతలు, సామాజిక స్థబ్దత, అధర్మం, జంతుహింస, కులవ్యవస్థలతో సమాజం కుళ్లిపోయింది. ప్రజలు ముక్తినే సాధన చేసుకోవాలి. ఆధ్యాత్మీకరణ అనేది నూతన మార్పుగా రావాలనే నేపథ్యంలోనే జైన, బౌద్ద మతాలు వెలిశాయి. ఈ రెంటి ప్రభావంతో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది.

వర్ధమానుడు ‘జినుడు’గా మారడం: తన 42వ ఏట వర్ధమానుడు ‘జినుడు’గా మారాడు. ఇతని అనుచరులను ‘గణదారులని’, ‘నిర్గంధులని’ పేర్కొంటారు(అంటే ఏ బంధాలు లేనివారని అర్థం). మహావీరునిగా మారిన తరవాత మగధ రాజ్యంలోని తూర్పు వైపునకు వెళ్లి తన బోధనలు బోధించారు. మగధరాజు ‘అజాతశత్రు’కు, బుద్దునికి సమకాలీనుడు మహావీరుడు. చివరికి తన 72వ ఏట క్రీ.పూ. 568లో పాట్నా(పావాపురి)లో మరణించారు.

జైనంలో చీలిక: చంద్రగుప్తుని మౌర్యుని కాలంలో క్రీ.పూ. 305లో పాటలీపుత్రలో తొలి జైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థూలబద్ర, బద్రబాహు నాయకత్వం వహించారు.

శ్వేతాంబరం(తెల్లని వస్త్రాలు), దిగంబర(ఆకాశమే వస్త్రంగా భావించాలి) నగ్నత్వం అనే రెండు శాఖలు ఏర్పడ్డాయి.

నిర్యాణం పొందడానికి నగ్నత్వం ముఖ్యమని దిగంబరులు, కాదని శ్వేతాంబరులు భావించారు. స్త్రీలకు విముక్తి లేదని దిగంబరులు, స్త్రీలకు విముక్తి ఉందని 19వ తీర్థంకరుడైన మల్లినాథుడు భావించాడు. దిగంబర దేవాలయాల్లో పూజలు చేస్తారు. శ్వేతాంబరులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. శ్వేతాంబరుల్లోనూ విగ్రహారాధన ఉంది. దిగంబరులు తీర్థంకరులను, మహావీరుడ్ని గుడుల్లో పూజిస్తారు. మౌంట్‌ అబూ, ఉదయగిరి, ఎల్లోరా, శ్రావణ బెళగోళాలో వీరి శిల్పకళను చూడవచ్చు.

పండుగలు: వీరి ముఖ్యమైన పండుగ పర్యుష్ణాన. ఏడు రోజులపాటు జరుగుతుంది. దీనిలో ధ్యానం చేస్తారు. దీనిని సామయిక అంటారు. ఎనిమిదో రోజు సమ్వత్సరి జరుపుకోవడంతో పర్యుష్ణాన ముగుస్తుంది. పదో శతాబ్దంలో కన్నడలో చాముండరాయ, బాహుబలి విగ్రహం నిర్మించి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం నిర్వహించడాన్ని ప్రారంభించాడు.

జైనమత గ్రంథాలు: మహావీరుడు ‘అర్ధమాగధి’ భాషలో బోధనలు చేశాడు(బుద్దుని బోధనలు ‘పాళీ’ భాషలో ఉండేవి). మొదటి సమావేశంలో 12 అంగాలు రాశారు. జైనమత రెండో సమావేశం క్రీ.శ.512 ‘వల్లబి’ గుజరాత్‌ రాష్ట్రంలో దేవార్ర్ది క్షమపణ ఆధ్వర్యంలో జరిగింది.

హేమచంద్ర పరిశిష్ట పర్వణ్‌ గ్రంథం, విశాలదేవుడు ‘మరికేళి విలాసం’, మహేంద్రవర్మ రాసిన మత్తవిలాస ప్రవాసనం మొదలైనవి తమిళనాడులో జైనమత ఇతిహాసాలు. సిద్దసేనా దివాకరుడు, సోమదేవ సూరి, హేమచంద్ర మొదలైనవారు గొప్ప జైన కవులు.

మహావీరుని జీవితం 540 బిసి - 468 బిసి: మహావీరుడు అసలు పేరు ‘వర్ధమానుడు’. బిహార్‌లోని(వైశాలి రాజ్యం) కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్దార్ధుడు రాజు. తల్లి త్రిశాల. ’జ్ఞాత్రిక’ వంశం, క్షత్రీయులు. ఈయనకు వివాహమైనది. భార్య పేరు యశోధ, కూతురు అనోజ. 30 సంవత్సరాల వయసులో భార్య పిల్లలను వదిలి సన్యాసం స్వీకరించాడు. జమాలి అల్లుడు మహావీరునికి మొదటి శిష్యునిగా మారాడు. ‘నిర్గంధులు’ అనే ఒక తెగ ఆచారాలను అనుసరించాడు. అసలు ఈ విధానం 23వ తీర్ధంకరుడైన ‘పార్శ్వనాధుడు’ ప్రారంభించాడు. ఈయన నాలుగు సూత్రాలను బోధించాడు. అవి 1) అహింస, 2) సత్యం మాట్లాడాలి 3) అపరిగ్రహం(ఆస్తిపాస్తులు ఉండరాదు), 4. ఆస్తేయం(దొంగతనం చేయరాదు). అయిదో సూత్రాన్ని వర్ధమానుడు ప్రవేశపెట్టాడు. అదే ‘బ్రహ్మచర్యం’. దీంతో ఈయనను ‘మహావీరుడు’గా పేర్కొన్నారు. మహావీరుడు 131/2 అడుగుల ఎత్తులో ఉన్నాడని జైన గ్రంథాలు చెబుతున్నాయి.

మహావీరుని బోధనలు:

ఈయన బోధనలు తాత్వికాలు, శృతి, స్మృతులపై ఆధారపడి లేదు. దేవతలు లేరని చెప్పలేదు. కానీ, వారికి దివ్యత్వం లేదన్నాడు. అందువల్ల అతడి మతం ‘నాస్తికం’. వారివల్ల మానవులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈయన తత్త్వం ద్వైత్వం ప్రకారం రెండు జీవులు 1) జీవులు 2) అజీవులు.

1) జీవులు అంటే- అమర్ద్యాలు.

2) అజీవులు అంటే- అణు నిర్మితాలు, మర్ద్యాలు. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ ఉంటుంది. పునర్జన్మ మీద ‘కర్మ’ మీద ఆధారపడి ఉంటుంది. సల్లేఖనం అనే వ్రతం ఉపవాస దీక్షను పాటించి కర్మను తొలగించవచ్చు.

‘కర్మ’ కంటికి కనిపించని పరమాణు పదార్ధం. ఈ పదార్ధంతో ప్రతి జన్మలోనూ ఆత్మ చుట్టూ కర్మ శరీరం ఏర్పడుతుంది. తరవాత జన్మలో ఆత్మ ఏ జన్మ ఎత్తాలో ఈ కర్మ శరీరం నిర్ణయిస్తుంది. పునర్జన్మ రాహిత్యం కావాలంటే మోహ వికారాదులను, ఇంద్రియాలను క్రమంగా తొలగించుకోవాలి. చివరకు కర్మ శరీరాన్ని తొలగించుకోవాలి. దీనికి సన్యాసం, తపస్సులు అవసరమౌతాయి. మనిషి దుష్కర్మలను పరిహరించాలి. దీనికి ‘త్రి రత్నాలు’ ఆధారంగా జరగాలి. 1) సరైన విశ్వాసం 2) సరైన జ్ఞానం 3) సరైన ప్రవర్తన. ఈ మంచి నడతకు అయిదు ప్రమాణాలున్నాయి. అవి 1) అహింస 2) సత్యం(అబద్ధం మాట్లాడకుండా ఉండాలి). 3) ఆస్తేయం 4) అపరిగ్రహం 5) బ్రహ్మచర్యం. దీనిద్వారా ‘శద్వాదం’ అనే సిద్ధాంతాన్ని జైనులు బోధించారు. వేదాలను తిరస్కరించారు. కర్మకాండను కాదన్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తోసిపుచ్చారు.

జైనులకు మైనారిటీ హోదా: యూపీఏ ప్రభుత్వ కాలంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన 2008 డిసెంబరు 19న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేశారు. అప్పటి హోంమంత్రి చిదంబరం జైనులకు మైనారిటీ హోదాను కల్పించారు.

జైనం ఆదరించిన రాజ వంశాలు

1. మౌర్యులు- చంద్రగుప్త మౌర్య, సంప్రతి రాజులు

2. శాతవాహనులు- శ్రీముఖుడు

3. రాష్ట్రకూటులు- దంతిదుర్గుడు, అమోఘవర్షుడు

4. ఛేది రాజులు- ఖారవేలుడు

5. పశ్చిమ చాళుక్యులు- (బాదామి)- పులకేశి మొదలైనవారు

-డాక్టర్‌ పి.మురళి

సీనియర్‌ ఫ్యాకల్టీ

Dr--MURALI-PAGIDIMARRI.gif

Updated Date - 2022-11-16T14:15:43+05:30 IST