ముదిగొండ చాళుక్యులు అజ్ఞాతంలో ఉన్న గ్రామమేది? పోటీ పరీక్షల కోసం!

ABN , First Publish Date - 2022-08-24T21:55:23+05:30 IST

విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ భౌగోళికమంతా కన్నడ ప్రాంత పరిపాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఆ ప్రాంత పాలకులైన బాదామీ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని

ముదిగొండ చాళుక్యులు అజ్ఞాతంలో ఉన్న గ్రామమేది? పోటీ పరీక్షల కోసం!

విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ భౌగోళికమంతా కన్నడ ప్రాంత పరిపాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఆ ప్రాంత పాలకులైన బాదామీ చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. బాదామీ చాళుక్యులు తొలుత కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య భాగంలో విష్ణుకుండినుల సామంతులుగా ఉండేవారని చరిత్రకారుల అభిప్రాయం. బి.ఎస్‌.ఎల్‌.హనుమంతరావు అనే చరిత్రకారుని రచనల్లో మహబూబ్‌నగర్‌ - కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ‘చలికి’ అనే వంశం ఉండేదని, వారే తరవాత చాళుక్యులుగా మారారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉందనే విషయాన్ని గమనించాలి. ‘రణ విక్రమ’ అనే పేరుతో  ఒక శాసనం ప్రస్తుత నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరంలో లభించింది. ఈ బిరుదు బాదామీ చాళుక్య రాజు మొదటి పులకేశిది.  చాళుక్య రాజ్యాన్ని విస్తృతపరచిన రణరాగుడి కాలంలోనే వీరు తెలంగాణలో విస్తరించారు.


హైదరాబాద్‌ శాసనాన్ని అనుసరించి తెలంగాణ ప్రాంతమంతా రెండో పులకేశి ఆధీనంలో ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు. వీరికాలంలో చతురస్ర పద్ధతిలో దేవాలయాల నిర్మాణం జరిగింది. దీనినే దక్కన్‌ శైలిగా పిలుస్తున్నారు. జోగులాంబ దేవాలయం, నవబ్రహ్మ దేవాలయం, భద్రకాళి దేవాలయం వీరికాలం నాటి నిర్మాణాలుగా గుర్తింపు పొందుతున్నాయి.


బాదామీ చాళుక్యుల అనంతరం తెలంగాణ ప్రాంతం రాష్ట్రకూటుల ఆధీనంలోకి వెళ్లింది. మాన్యఖేటం రాజధానిగా పాలించిన రాష్ట్రకూటులు తెలంగాణ ప్రాంతాన్ని ‘వేములవాడ చాళుక్యులు’ సామంతులుగా పాలించారు. రాష్ట్రకూట రాజు ఇంద్రవర్మ నిర్మించిన నగరమే  ఇందూరు. ప్రస్తుత నిజామాబాద్‌. తెలంగాణలో ‘గరుడ పక్షి’ చిహ్నంతో నిర్మించిన నిర్మాణాలు రాష్ట్రకూటులవి. ఈ నేపథ్యంలోనే తూర్పు చాళుక్యులుగా పిలుస్తున్న వేంగి చాళుక్యులతో రాష్ట్రకూటులు నిరంతరం యుద్ధాలు చేశారు. రాష్ట్రకూటులకు వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఈ యుద్ధంలో సహకరించారు. అదే సమయంలో వేంగి చాళుక్యులు ప్రస్తుత ఖమ్మం జిల్లాలోని ముదిగొండలో మరో సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రకూటులతో తలపడ్డారు. ఈ యుగ చరిత్రను అర్థం చేసుకోవడం కోసం అభ్యర్థులకు వేములవాడ చాళుక్యుల చరిత్ర, ముదిగొండ చాళుక్యుల చరిత్ర సమగ్రంగా అవగతం కావాలి. 


వేములవాడ చాళుక్యులు

వీరు ‘వేములవాడ’ను రాజధానిగా అంతకుముందు ‘బోధన్‌’ రాజధానిగా తెలంగాణ ప్రాంతాన్ని సుదీర్ఘంగా పాలించారు. రాష్ట్రకూటులకు సామంతులుగా, స్నేహితులుగా, బంధువులుగా వ్యవహరించారు. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని భౌగోళిక ప్రాంతాలనే ‘సాపదలక్ష దేశం’గా గుర్తించేవారు. ఈ ప్రాంతం నుంచి రాజులకు రూ.1,25,000 ఆదాయం లభించేది. ఈ ప్రాంతాన్నే ‘సబ్బినాడు’, ‘పొదననాడు’ పేర్లతో గుర్తించేవారు.


వీరి చరిత్రకు ఆధారాలు

శాసనాలు: 

  • కురవగట్టు శాసనం: జడ్చర్ల మండలం
  • కొల్లిపర తామ్రశాసనం: నిడమనూరు. దీన్ని వేయించింది అరికేసరి-1
  • వేములవాడ శాసనం: వేములవాడ. దీన్ని వేయించింది అరికేసరి-1/2వ బద్దెగూడు
  • కురిక్యాల శాసనం: గంగాధర - క్రీ.శ.946. దీన్ని వేయించింది జీనవల్లభుడు. అరికేసరి-2 కాలంలో. ఇది కందపద్యాలతో వేయించిన తొలి తెలుగు శాసనం.
  • చెన్నూరు శాసనం: చెన్నూరు. అరికేసరి-2 వేయించాడు. 
  • పర్భని శాసనం: మహారాష్ట్ర(క్రీ.శ.966). అరికేసరి-3 వేయించాడు.
  • రేపాక శాసనం: అరికేసరి-3 వేయించాడు.

  • లిఖిత ఆధారాలు:
  • పంప కవి: విక్రమార్జున విజయం(దీనినే పంపభారతం/కన్నడ భారతం అని కూడా అంటారు)
  • ఆదిపురాణం(జైనుల గురించి)
  • జీన వల్లభుడు: కురిక్యాల శాసనం(సంస్కృతం+తెలుగు+కన్నడం)
  • సోమదేవ సూరి: యశస్తిలక చంపవూ
  • మల్లియ రేచన: కవిజనాశ్రయం(తొలి తెలుగు రచన)

  • రాజకీయ చరిత్ర:
  • ‘సత్యాశ్రేయుడు’ ఈ వంశ మూలపురుషుడిగా గుర్తింపు పొందాడు. అయితే వీరి వంశచరిత్ర ఈ రాజ్యస్థాపకుడైన ‘యుద్ధమల్లుడి’తో ఆరంభమైంది.
  • ఫ వేములవాడ రాజ్యస్థాపకుడిగా వినయాధిత్య యుద్ధమల్లుడిని గుర్తించారు. ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడు. దంతిదుర్గుడికి, బాదామీ చాళుక్యులను ఓడించడంలో సహకరించడం వల్ల అతడు బోధన్‌ ప్రాంతానికి పాలకుడిగా ‘యుద్ధమల్లుడి’ని నియమించాడు. ఇతని వివరాలు ‘కొల్లిపర తామ్రశాసనం’లో ఉన్నాయి.


మొదటి అరికేసరి: రాష్ట్రకూట ప్రభువైన ధృవుడి కోసం వేంగి చాళుక్యులతో యుద్ధం చేశాడు. విజయాన్ని సాధించి వేంగి రాకుమారి ‘శీల మహదేవి’ని ధృవుడితో వివాహం చేశాడు. దీనితో సంతోషపడిన రాజు ప్రస్తుత మహబూబ్‌నగర్‌లోని నాగర్‌ కర్నూలు, జడ్చర్ల, రామడుగు మొదలైన ప్రాంతాలను బహుమతిగా ఇచ్చాడు. దీంతో వీరి రాజ్యం గోదావరి తీరం నుంచి కృష్ణానదీ తీరం వరకు విస్తరించింది. ఇతని కాలంలోనే రాజధానిని బోధన్‌ నుంచి వేములవాడకు మార్చారు.


బద్దెగూడు: 42 యుద్ధాల్లో విజయం సాధించడం వల్ల బద్దెగూడికి ‘సొలదగండ’ అనే బిరుదు వచ్చింది. ఇతను వేంగి రాజ్యంపై దాడి చేసి ప్రస్తుత కొల్లేరు సరస్సు(కునాల సరస్సు) వేంగి రాజైన ‘చాళుక్య భీముడి’ని మొసలిని మాదిరిగా పట్టుకున్నాడు. ఈ సమాచారాన్ని ‘విక్రమార్జున విజయం’, ‘పర్భనీ శాసనాలు’ తెలియజేస్తున్నాయి. ఇతని కాలంలోనే వేములవాడలో బద్దెగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రస్తుతం భీమేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు.


రెండో నరసింహుడు: వేములవాడ చాళుక్యులలో ఇతను పరాక్రమవంతుడు. ఇతనికి రాష్ట్రకూట మహారాజు 3వ ఇంద్రుడు తన చెల్లెలు ‘జాకవ్వను’ ఇచ్చి వివాహం చేశాడు. ఈ వైవాహిక బంధంతో వేములవాడ చాళుక్యులు సామంతుల స్థాయి నుంచి బంధువుల స్థాయికి చేరుకున్నారు. ఇతని కాలంలో ప్రస్తుత యూపీలోని కనోజ్‌ పట్టణాన్ని జయించారు. యమునా నదీ తీరంలో ‘కాల్ఫి’ వద్ద ఇతను విజయ  స్థంభాన్ని నాటాడు. ఆ విజయస్థంభాన్నే ప్రస్తుతం కాలప్రియ ఆలయంగా పిలుస్తున్నారు. ఇతని కాలంలోనే ‘చౌ-ముఖములు’(జైన), చౌ-విస్సాలు చెక్కారు. ఇవి వేములవాడలోని భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.


రెండో అరికేసరి: ఇతని కాలాన్ని వేములవాడ చాళుక్య యుగంలో స్వర్ణయుగంగా గుర్తిస్తారు. రాష్ట్రకూట మహారాజు ఇంద్రవర్మ కుమార్తెలు రేవకి నిర్మడి, లోకాంబికలను వివాహం చేసుకున్నాడు. రెండో అరికేసరి వివరాలు కరీంనగర్‌ శాసనం ద్వారా తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఇది కరీంనగర్‌ మ్యూజియంలో ఉంది. వేములవాడ శాసనం రాజరాజేశ్వర దేవాలయంలో ఉంది. చెన్నూరు శాసనం ఆగస్తేశ్వర ఆలయంలో ఉంది. ఇతని వివరాలపై ‘విక్రమార్జున విజయం’ అనే గ్రంథాన్ని పంపకవి రాశాడు. ఆ కాలంలో వీరి శాసనాలు కన్నడ భాషలో రాయించారు. ఇతని ఆస్థానంలోని గుణాంకుశుడు, పెద్దనార్యుడు వేములవాడలో ‘ఆదిత్య ఆలయం’ నిర్మించారు. పెద్దనార్యుడి ఆధ్వర్యంలో ఆదిత్య ఆలయం, బుద్దగేశ్వర ఆలయం, నగరేశ్వర ఆలయం నిర్మించారు. ప్రస్తుత రాజరాజేశ్వర ఆలయాన్ని రాజాధిత్యుడు అనే మండలాధీశుడు నిర్మించాడు. ఇతడు కళ్యాణి చాళుక్య చక్రవర్తి 6వ విక్రమాధిత్యుడికి విధేయుడు. 


  • రెండో అరికేసరి కాలంలో పంపకవి అత్యంత ప్రసిద్ధుడు. ఇతనికి ‘శుభనందియ’ అనే బిరుదు ఉంది. ఇతనిని ‘కవిత గుణవర్ణుడు’ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇతని పేరున ‘కవితగుణావర్ణ’ చెరువు తవ్వించారు. ఇది కరీంనగర్‌లో ఉంది. ఇతని తమ్ముడు జీనవల్లభుడు ‘త్రిభువన తిలక’ అనే పేరుతో జైన బుసదిని నిర్మించాడు. అక్కడే ‘మదన విలాసం’ అనే ఉద్యానవనాన్ని కూడా నిర్మించాడు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలోని కురిక్యాల- గంగాధర గ్రామాల మధ్య ఇవి ఉన్నాయి. పంపకవి కవితా మాధుర్యానికి బహుమతిగా ‘ధర్మపురి’ గ్రామాన్ని బహూకరించారు. పంపకవి సమాధి బోధన్‌లో ఉంది. 

  • రెండో అరికేసరి కాలంలో ఆదిలాబాద్‌లోని చెన్నూరులో ఆలయం నిర్మాణం జరిగింది. పంప, రన్న, పొన్న అనే ముగ్గురు కవులను కన్నడ కవిత్రయం అనేవారు. వేములవాడ రాజధానిగా ఉండేది. ఇతను రాష్ట్రకూట వంశంలో రాజకీయ సంక్షోభాన్ని నివారించి 3వ అమోఘవర్షుడిని రాజుగా చేశాడు. ఇతని శరణు గోరిన ముదిగొండ చాళుక్యరాజు విజయాధిత్యునికి రాజకీయ ఆశ్రయాన్నిచ్చి చెన్నూరుని పరిపాలన కోసం ఇచ్చాడు. 100 స్థంభాలు లేదా ఇంద్ర నారాయణ ఆలయాన్ని బోధన్‌లో రెండో అరికేసరి కాలంలో నిర్మించారు. ఇతని అనంతరం అతని  మొదటి భార్య ‘రేవకి నిర్మడి’ కుమారుడు వాగరాజు గంగాధరను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇతని కాలంలోనే సోమదేవసూరి అనే జైన కవి ‘యశస్తిలక చంపవూ’ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఉజ్జయినిని పాలించిన రాజు ‘యశోధర’ చరిత్ర ఉంది. ఇతను ఈ గ్రంథంతోపాటుగా  ‘నీతివాక్యామృతం’, ‘శ్వాద్వాదోపనిషత్‌’ అనే సంస్కృత గ్రంథాలను కూడా రాశాడు.

  • వేములవాడ రాజధానిగా లోకాంబిక కుమారుడు భద్రదేవుడు/2వ బద్దెగూడు పరిపాలనలోకి వచ్చాడు. ఇతను వేములవాడలో ‘సుభదామ జీవ’ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ జైన తీర్థంకరుడి ప్రతిమ ఉంది.

3వ అరికేసరి: ఈ వంశంలో చివరి వాడు. ఇతని కాలంలో కరీంనగర్‌లోని రేపాకలో  జీనాలయాన్ని నిర్మించారు.  దీనిని ‘ఖిలివుతూ జీనాలయం’గా గుర్తిస్తున్నారు. ఇతని వివరాలు పర్భని శాసనంలో ఉన్నాయి.


  • క్రీ.శ. 973లో రాష్ట్రకూట రాజధాని ‘మాన్యఖేట’పై కళ్యాణీ చాళుక్యరాజు 2వ తైలపుడు దండయాత్ర చేసి ఆక్రమించాడు. దీనితో రాష్ట్రకూట రాజ్యం పతనమైంది. వారికి సామంతులైన వేములవాడ చాళుక్యులు క్రమంగా అధికారాన్ని కోల్పోయారు.


ముదిగొండ చాళుక్యులు

  • తొలి మధ్యయుగంలో ముదిగొండ కేంద్రంగా పాలించిన రాజవంశం. వీరు వేంగి చాళుక్యులకు/తూర్పు చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. వాస్తవానికి ఈ రాజ్యాన్ని రాష్ట్రకూటులు వేములవాడ చాళుక్యుల దండయాత్ర నుంచి రక్షించుకోవడం కోసం ‘వేంగి చాళుక్య రాజైన ‘రెండో చాళుక్య భీముడు’ ఏర్పాటు చేశాడు.


వీరి చరిత్రకు ఆధారాలు

  • మొగిలి చెరువు రాగి దానపత్రం : 4వ కుసుమాయుధుడు
  • కుకనూరు దానపత్రం: 2వ కుసుమాయుధుడు
  • కొరవి రాతి శాసనం(క్రీ.శ.135): వీరి స్వాతంత్ర్యాన్ని తెల్పుతుంది.
  • నత్త రామేశ్వర శాసనం: నాగతి రాజు, 6వ కుసుమాయుధుడు
  • ముదిగొండ చాళుక్యులు కొంత కాలం గోదావరి ఒడ్డున ‘బొత్తు’ అనే గ్రామంలో అజ్ఞాతంలో ఉండటం వల్ల వీరిని ‘బొత్తు చాళుక్యులు’గా గుర్తించారు.
  • కొరవి శాసనం తెలుగు భాషలో తొలి గధ్య శాసనం. శాసనకర్త నిరావద్దుడు
  • వీరు ముదిగొండ రాజ్యాన్ని దాదాపుగా 850 క్రీ.శ. నుంచి 1218 వరకు పరిపాలించారు. అయితే వీరి చరిత్రపై స్పష్టత లేదు. ఈ వంశంలో 1వ కుసుమాయుధుడిని ఈ రాజ్యస్థాపకుడిగా గుర్తిస్తున్నారు. 1వ కుసుమాయుధుడు, నిరవధ్యుడు, 2వ కుసుమాయుధుడు, బొట్టు బేతయ నిరంతరం రాష్ట్రకూటులతో, వేములవాడ చాళుక్యులతో యుద్ధాలు చేశారు. 3వ కుసుమాయుధుడి నుంచి కొంతకాలం కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు.
  • వీరిలో చివరి రాజైన 6వ కుసుమాయుధుడిని కాకతీయ రాజు 2వ ప్రోలుడు ఓడించి అజ్ఞాతంలోకి పంపాడు. 
  • వీరిలో చివరి వాడైన నాగతిరాజును కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు ఓడించి ఆ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపినట్లుగా పాలంపేట శాసనం తెలియజేస్తున్నది.



-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ 

డైరెక్టర్‌, 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-08-24T21:55:23+05:30 IST