సోమవారం నుంచి బడులు.. పిల్లలకు యూనిఫాం ఏదీ?

ABN , First Publish Date - 2022-06-08T22:36:53+05:30 IST

కొద్ది రోజుల్లోనే కొత్త విద్యా సంవత్సరం (2022-23) ప్రారంభమవనుండగా.. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు ఇంకా సిద్ధం కాలేదు. అసలు పిల్లల యూనిఫాంకు అవసరమైన గుడ్డ(క్లాత్‌)నే ఇంకా జిల్లాలకు సరఫరా చేయలేదు. అంటే ఈ ఏడాది..

సోమవారం నుంచి బడులు.. పిల్లలకు యూనిఫాం ఏదీ?

సకాలంలో అందించడం కష్టమే

ఇంకా జిల్లాలకు చేరని క్లాత్‌

కుట్టడానికి కనీసం నెల రోజులు!


హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజుల్లోనే కొత్త విద్యా సంవత్సరం (2022-23) ప్రారంభమవనుండగా.. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు ఇంకా సిద్ధం కాలేదు. అసలు పిల్లల యూనిఫాంకు అవసరమైన గుడ్డ(క్లాత్‌)నే ఇంకా జిల్లాలకు సరఫరా చేయలేదు. అంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందడం కష్టమే! రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచితంగా యూనిఫాం అందజేస్తున్న విషయం తెలిసిందే. 26 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం అందజేస్తారు. కానీ, కరోనా వల్ల రెండేళ్లుగా ఏకరూప దుస్తులు సరిగా ఇవ్వడం లేదు. 2020-21 విద్యా సంవత్సరానికి యూనిఫాంను కుట్టించినప్పటికీ విద్యార్థులకు అందించలేకపోయారు. 2021-22లో వాటిని విద్యార్థులకు అందజేశారు. సాధారణంగా పాఠశాలలను తెరిచే సమయానికే విద్యార్థులకు యూనిఫాంను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల కంటే ముందే క్లాత్‌ను జిల్లాలు, మండలాలకు చేర్చి స్కూళ్ల వారీగా అందించాల్సి ఉంటుంది.


సెలవుల్లో యూనిఫాంలు కుట్టించి, బడులను ప్రారంభించే సమయంలో లేదా అంత కంటే ముందుగానే విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. మంగళవారం నాటికి నాలుగు జిల్లాలకే క్లాత్‌ చేరినట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యార్థుల యూనిఫాంకు అవసరమైన క్లాత్‌ను ‘తెలంగాణ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో-ఆపరేటివ్‌ సోసైటీ (టెస్కో)’ ఆధ్వర్యంలో సమకూర్చుతున్నారు. ఈ క్లాత్‌ను స్కూళ్లకు పంపిణీ చేసి, స్థానిక మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలు కుట్టిస్తున్నారు. ఇందుకోసం ప్రతి యూనిఫాంపై రూ.600 ఖర్చు చేస్తున్నారు. ఇందులో కేంద్రం 60 శాతం నిధులు సమకూర్చుతుండగా, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. యూనిఫాంలు కుట్టే ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల నుంచి రెండు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నెల 13 నుంచి పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. అంటే ఈ సారి యూనిఫాంలు లేకుండానే విద్యార్థులు బడులకు హాజరు కావాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-06-08T22:36:53+05:30 IST