యూనిఫాం రంగు హిజాబ్‌ ధరిస్తాం

ABN , First Publish Date - 2022-02-16T17:52:09+05:30 IST

కర్ణాటకలో హిజాబ్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కాలేజీ యూనిఫాం రంగు హిజాబ్‌ ధరిస్తామని.. అందుకు అనుమతివ్వాలని ఉడుపి ప్రభుత్వ పీయూసీ కళాశాల విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును అభ్యర్థించారు. శాంతి సామరస్యాలకు, శాంతిభద్రతలకు..

యూనిఫాం రంగు హిజాబ్‌ ధరిస్తాం

మాకు అనుమతివ్వండి..

కర్ణాటక హైకోర్టులో ఉడుపి విద్యార్థినుల వినతి


బెంగళూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో హిజాబ్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కాలేజీ యూనిఫాం రంగు హిజాబ్‌ ధరిస్తామని.. అందుకు అనుమతివ్వాలని ఉడుపి ప్రభుత్వ పీయూసీ కళాశాల విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును అభ్యర్థించారు. శాంతి సామరస్యాలకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వస్త్రాలు ధరించడాన్ని నియంత్రిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ గత వారం వారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రుతురాజ్‌ అవస్థి, జస్టిస్‌ జస్టిస్‌ ఖాజీ జైబున్నీసా మొహియుద్దీన్‌, జస్టిస్‌ కృష్ణ ఎం.దీక్షిత్‌ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం కొనసాగించింది. సదరు ఆరుగురు విద్యార్థినుల తరఫున న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపించారు. ‘ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేయడమే కాదు.. యూనిఫాం రంగును పోలిన హిజాబ్‌ను ధరించేందుకు అనుమతివ్వాలని కోరుతున్నాం. కేంద్రీయ స్కూళ్లలోనూ యూనిఫాం రంగున్న హిజాబ్‌ వేసుకునేందుకు ముస్లిం బాలికలను అనుమతిస్తున్నారు. అదే ఈ కాలేజీలోనూ చేయొచ్చు. హిజాబ్‌లు ధరించడం మతాచారం’ అన్నారు. తన కక్షిదారులు గత రెండేళ్లుగా.. అంటే అడ్మిషన్ల సమయం నుంచీ హిజాబ్‌లు ధరిస్తున్నారని కామత్‌ తెలిపారు. విచారణను బెంచ్‌ మంగళవారానికి వాయిదావేసింది.


కర్ణాటకలో తెరుచుకున్న స్కూళ్లుహిజాబ్‌ వివాదం నేపథ్యంలో వారం రోజులుగా మూతబడిన హైస్కూళ్లు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులు మొదలయ్యాయి. వివాదానికి మూలకేంద్రమైన ఉడుపి, దక్షిణ కన్నడ, బెంగళూరులోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 19 వరకు 144 సెక్షన్‌ సహా నిషేధాజ్ఞలు విధించింది. ఉడుపి జిల్లా స్కూళ్లకు విద్యార్థులు యథాప్రకారం హాజరయ్యారు. ముస్లిం బాలికలు క్యాంప్‌సల వరకు హిజాబ్‌లు వేసుకుని వచ్చారని.. తరగతి గదులకు మాత్రం తీసేసి వచ్చారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా బుధవారం నుంచి కళాశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - 2022-02-16T17:52:09+05:30 IST