Delhi Civic polls Results: ఆప్ విజయం...15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర
ABN , First Publish Date - 2022-12-07T14:40:37+05:30 IST
'నువ్వా-నేనా' అన్నట్టు సాగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ మార్క్ దాటింది. గెలుపు ఖాయం చేసుకుంది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మున్సిపల్ కార్పొరేషన్‌ను ..
న్యూఢిల్లీ: 'నువ్వా-నేనా' అన్నట్టు సాగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (MCD Elections) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మెజారిటీ మార్క్ దాటింది. గెలుపు ఖాయం చేసుకుంది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏలిన బీజేపీ ఆశలకు ఆప్ గండికొట్టింది. ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 2.30 గంటల వరకూ అందుబాటులో ఉంచిన గణాంకాల ప్రకారం మొత్తం 250 వార్డుల్లో 126 వార్డులను ఆప్ సొంతం చేసుకుంది. 2007 నుంచి ఈ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏలిన బీజేపీ 97 సీట్లలో గెలవగా, మరో 6 వార్డుల్లో లీడింగ్‌లో ఉంది. ఫలితంగా ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైంది.
ఆప్ సంబరాలు..
మెజారిటీ మార్క్‌ను దాటి ఆప్ విజయం దిశగా దూసుకుపోవడంతో ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, కేజ్రీవాల్ నినాదాలు హోరెత్తించారు.